డిజిటల్‌ రుణ సంస్థలపై నియంత్రణ

ఆన్‌లైన్‌లోనూ, యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి, తర్వాత రుణ గ్రహీతలను తీవ్రంగా వేధిస్తున్న డిజిటల్‌ రుణ సంస్థల దారుణాలను అదుపు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సిద్ధమయ్యింది. దేశంలో ఆర్థిక వృద్ధికి డిజిటల్‌ విధానాలు వేగవంతం చేయడం స్వాగతించాల్సిన అంశమే..

Published : 14 Jan 2021 01:55 IST

సూచనల కోసం ఆర్‌బీఐ కమిటీ
ఈనాడు - హైదరాబాద్‌

ఆన్‌లైన్‌లోనూ, యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి, తర్వాత రుణ గ్రహీతలను తీవ్రంగా వేధిస్తున్న డిజిటల్‌ రుణ సంస్థల దారుణాలను అదుపు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సిద్ధమయ్యింది. దేశంలో ఆర్థిక వృద్ధికి డిజిటల్‌ విధానాలు వేగవంతం చేయడం స్వాగతించాల్సిన అంశమే.. అయినప్పటికీ దీనివల్ల కొన్ని సానుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. వీటిని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ఈ డిజిటల్‌ రుణాలపై అధ్యయనం చేసేందుకు ఒక వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
‘ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌/మొబైల్‌ యాప్‌ల ద్వారా రుణాల వితరణ పెరిగింది. అదే సమయంలో కొన్ని అనుకోని సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అద]ువల్ల దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంద’ని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అందుకు వీలుగా డిజిటల్‌ రుణాలు క్రమబద్ధంగా వృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తూ కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని భావించింది. నియంత్రణ పరిధిలోకి రాని ఈ సంస్థలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మార్గదర్శకాల రూపకల్పనపై ఈ వర్కింగ్‌ గ్రూపు సూచనలు చేస్తుందని తెలిపింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ రుణాల సంస్థలనూ ఈ గ్రూపు పరిశీలిస్తుంది. డిజిటల్‌ రుణాల వ్యవస్థ లోటుపాట్లపైనా ఇది అధ్యయనం చేస్తుంది.

జయంత్‌కుమార్‌ నేతృత్వం
ఈ బృందానికి ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయంత్‌ కుమార్‌ దశ్‌ నేతృత్వం వహిస్తారు. మరో ముగ్గురు ఆర్‌బీఐ ఉన్నతాధికారులు, ఒక ఫిన్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ బృందం తమ నివేదికను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా డిజిటల్‌ రుణాల్లో వృద్ధి పెరిగింది. కరోనా తర్వాత ఎంతోమంది ఆర్థిక అవసరాల కోసం వీటిపైనే ఆధారపడుతున్నారు. ఫిన్‌టెక్‌కు సంబంధించిన ఆవిష్కరణలు ఇటీవల కాలంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాయి. ఇదే సమయంలో డేటా భద్రత, గోప్యత, విశ్వసనీయత, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు తగిన విధంగా నియమ నిబంధనల రూపకల్పన తక్షణ అవసరంగా భావిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ వర్కింగ్‌ గ్రూపు.. డిజిటల్‌ రుణాల సంస్థల పనితీరుతో పాటు, వాటి విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రణ లేని రుణ సంస్థల వల్ల వస్తున్న నష్టాలను అధ్యయనం చేస్తుంది. డిజిటల్‌ రుణాల విషయంలో వివిధ నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం అమలు చేయాల్సిన నిబంధనలను సూచిస్తుంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. పూర్తి పారదర్శకంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ తెలియజేస్తుంది. నియంత్రణ లేని అనధికార రుణ యాప్‌ల నుంచి అప్పులు తీసుకోకూడదని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని