
E-Comm Rules: ఈ-కామర్స్ కొత్త నిబంధనలు..రిలయన్స్ వర్సెస్ టాటా?
దిల్లీ: కేంద్రం తీసుకురాదలిచిన ఈ-కామర్స్ కొత్త నిబంధనలు ఇప్పటికే భారత్ వర్సెస్ విదేశీ కంపెనీల మధ్య పోరుగా మారింది. తాజాగా దేశీయ కంపెనీల నుంచి కూడా ఈ విషయంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదనలను దేశీయ వ్యాపారం దిగ్గజం రిలయన్స్ సమర్థించింది. వాటాలున్న కంపెనీలు, అనుబంధ సంస్థలకు చెందిన ఉత్పత్తులను సొంత ఈ-కామర్స్ పోర్టల్‌లో విక్రయించరాదన్న షరతులకు రిలయన్స్ ఆమోదం ప్రకటించింది.
మరోవైపు కొత్త నిబంధనలను మరో వ్యాపార దిగ్గజ సంస్థ టాటా ఇప్పటికే వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఓ సమగ్ర సూపర్ ఈ-కామర్స్ యాప్‌ను రూపొందిస్తున్న టాటాకు కొత్త నిబంధనలు తలనొప్పిగా మారాయి. నిబంధనల కారణంగా స్టార్ బక్స్, క్రోమా, వొల్టాస్, టైటన్ వంటి భాగస్వామ్య కంపెనీల ఉత్పత్తులను తమ పోర్టల్‌లో విక్రయించే వెసులుబాటు ఉండదని ఇటీవలే ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముసాయిదాను వత్యిరేకిస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలే టాటా నిర్ణయాన్ని తప్పుబట్టారు.
కొత్త నిబంధనలు అమలు చేయడానికి రిలయన్స్ సైతం తమ వ్యాపార మోడల్‌ను మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జియో-మార్ట్‌లో తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు అనుగుణంగా.. రిలయన్స్ రెండు సూపర్ యాప్‌లను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి పూర్తిగా థర్డ్ పార్టీ కంపెనీ ఉత్పత్తుల విక్రయానికి కాగా.. మరొకటి ప్రత్యేకంగా రిలయన్స్, దాని అనుబంధ సంస్థ ఉత్పత్తుల విక్రయానికి అందుబాటులో ఉంచాలని ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇప్పటికే వినియోగదారులు రిలయన్స్ డిజిటల్, హామ్లేస్ వంటి పోర్టళ్లలో కొనుగోళ్లు భారీగానే చేస్తున్నారు.
ఇవీ కొత్త నిబంధనలు...
చిన్న వ్యాపారస్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చింది. తాజా నిబంధనల ప్రకారం.. తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థలు తమ సొంత పోర్టల్స్‌లో విక్రయించడం కుదరదు. ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ప్రత్యేకంగా తమ పోర్టల్స్‌లోనే విక్రయించేలా ఈ-కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. తమ షాపింగ్ పోర్టల్స్‌లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ-కామర్స్ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించొద్దు. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, పేమెంట్స్, ఫైనాన్సింగ్ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి. ఈ-కామర్స్ సంస్థకు చెందిన గ్రూప్ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది.