వాహ‌న బీమా రెన్యువ‌ల్  చేస్తున్నారా? ప్రీమియం త‌గ్గాలంటే..?

వాహ‌న బీమా పాల‌సీని స‌కాలంలో పున‌రుద్ధ‌రించ‌క‌పోతే అప్ప‌టివ‌ర‌కు పొందిన నో-క్లెయిమ్ బోన‌స్ వంటి ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది. 

Updated : 17 Nov 2021 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త కారు లేదా బైక్‌ను కొనుగోలు చేసిన‌ప్పుడు, సాధారణంగా డీలర్ సూచించిన వాహ‌న బీమా పాలసీని కొనుగోలు చేస్తారు. ఈ కవర్ అంత ఉత్తమమైనది కాకపోవచ్చు. సాధార‌ణంగా ఇటువంటి పాల‌సీలు కాల‌ప‌రిమితితో వ‌స్తాయి. కాబ‌ట్టి వీటికి పునరుద్ధ‌ర‌ణ అవ‌స‌రం. ఈ స‌మ‌యంలో పాల‌సీని స‌మీక్షించి ప్ర‌స్తుతం స‌రిప‌డేంత‌ క‌వ‌రేజ్ ఉన్నదీ, లేనిదీ నిర్ధారించుకుని త‌ద‌నుగుణంగా పాల‌సీని అప్‌గ్రేడ్‌ చేయొచ్చు. రెన్యువల్ చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం..

ఇన్సూర్డ్ డిక్లేర్ వేల్యూ (ఐడీవీ): మోటారు బీమాలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యుకి చాలా ప్రాముఖ్య‌ం ఉంది. ఇది ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపుతుంది. వాహ‌నం పూర్తిగా న‌ష్ట‌పోయిన‌ప్పుడు లేదా దొంగిలించిన‌ప్పుడు బీమా సంస్థ నుంచి మీరు పొందే గ‌రిష్ఠ బీమా విలువే 'ఐడీవీ'. పున‌రుద్ధ‌ర‌ణ స‌మయంలో మ‌రొక బీమా సంస్థ త‌క్కువ ప్రీమియంకే పాల‌సీ ఆఫ‌ర్ చేయొచ్చు. అయితే, త‌క్కువ ప్రీమియంతో ఐడీవీ కూడా త‌గ్గుతుంది కాబ‌ట్టి త‌క్కువ ప్రీమియంతో వ‌స్తుంద‌ని క‌దా ఐడీవి విష‌యంలో రాజీప‌డ‌కూడ‌దు. ఈ ప్ర‌భావం మీ క్లెయిమ్‌ల‌పై చూపుతుంది. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కావ‌ల‌సిన మొత్తం అంద‌దు. పాల‌సీ ప్రారంభంలో లేదా పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో వాహ‌న నిర్దిష్ట మోడ‌ల్ త‌యారీదారు జాబితా చేసిన అమ్మ‌క‌పు ధ‌ర ఆధారంగా ఐడీవీని నిర్ణ‌యిస్తారు. ఐదేళ్ల‌కు పైబ‌డిన వాహ‌నాల‌కు, వాహ‌న కండీష‌న్‌ను బీమాదారు అంచనా వేయ‌వ‌చ్చు. పాలసీదారుడు, బీమా సంస్థ ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఐడీవీని నిర్ణ‌యించ‌వ‌చ్చు.

నో-క్లెయిమ్ బోన‌స్‌(ఎన్‌సీబీ): పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయ‌నివారు నో-క్లెయిమ్ బోన‌స్ పొందేందుకు అర్హులు. ప్ర‌తీ క్లెయిమ్ ర‌హిత సంవ‌త్సరానికి బీమా సంస్థ మీకు ఎన్‌సీబీ రివార్డు అంద‌జేస్తుంది. వ‌రుసగా 5 సంవ‌త్స‌రాల పాటు మీరు ఎటువంటి క్లెయిమ్‌లు చేయ‌క‌పోతే గరిష్ఠంగా 50 శాతం వ‌ర‌కు డిస్కౌంటు పొందొచ్చు. ఏదైనా ఏడాది క్లెయిమ్ చేసినట్టయితే, రెన్యువల్ సమయంలో నో క్లెయిమ్ బోనస్ 0% అయిపోతుంది. ఎన్‌సీబీ మీ సొంత న‌ష్టం (Own Damage-OD) ప్రీమియంను గ‌ణనీయంగా త‌గ్గిస్తుంది. కాబ‌ట్టి క్లెయిమ్ ర‌హిత సంవ‌త్స‌రాల్లో ఎన్‌సీబీని ఎంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్‌సీబీ వ‌ర్తింపు కేవ‌లం ఓడి ప్రీమియంకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని గుర్తుంచుకోవాలి. మొత్తం ప్రీమియంలో ఓడీ, టీపీ (Third Party-TP) ప్రీమియంలు రెండు క‌లిసి ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు, మీ మొత్తం ప్రీమియం రూ.1000 అయితే అందులో టీపీ ప్రీమియం రూ. 400, ఓడీ ప్రీమియం రూ.600 ఉండొచ్చు. పాల‌సీదారుల‌లో చాలా మందికి ఇది తెలియ‌క ఎన్‌సీబీ డిస్కౌంటును త‌ప్పుగా లెక్కిస్తుంటారు.

యాడ్‌-ఆన్‌లు..: వాహ‌న బీమా స్టాండ‌ర్డ్ క‌వ‌ర్‌తోపాటు, మీ వాహ‌నానికి కావ‌ల‌సిన‌ సంపూర్ణ ర‌క్ష‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించ‌డంలో యాడ్‌-ఆన్‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. త‌క్కువ ధ‌ర‌లోనే విస్తృత క‌వ‌రేజ్‌ను పొందొచ్చు. ఇంజ‌న్ ప్రొట‌క్ష‌న్, జీరో డిప్రిసియేష‌న్, నో క్లెయిమ్ బోన‌స్ ప్రొట‌క్ష‌న్, ఇన్‌వాయిస్ క‌వ‌ర్ రిట‌ర్న్ వంటి యాడ్‌-ఆన్‌లు జోడించడం వ‌ల్ల వాహ‌న బీమా విలువ అనేక రెట్లు పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు..  మీరు వ‌ర‌ద‌లు ఎక్కువ‌గా వ‌చ్చే ప్రాంతాల్లో నివ‌సిస్తుంటే.. ఇంజ‌న్ ప్రొట‌క్ష‌న్ బీమా తీసుకోవ‌చ్చు. ఇక్క‌డ ఒక్క విష‌యం గుర్తించుకోవాలి. కొన్ని యాడ్‌-ఆన్‌లు వాహ‌న వ‌య‌సు ఆధారంగా మంజూరు చేస్తారు క‌నుక పాత వాహ‌నాల‌కు కొన్ని యాడ్‌-ఆన్‌లు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. 

సాధార‌ణంగా వాహ‌న బీమా క్లెయిమ్ స‌మయంలో డిప్రిసియేష‌న్‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు. అయితే జీరో డిప్రిసియేష‌న్‌, డిప్రిసియేష‌న్ షీల్డ్ యాడ్‌-ఆన్ క‌వ‌ర్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డిప్రిసియేష‌న్‌ను లెక్క‌లోకి తీసుకోకుండా మార్కెట్ ధ‌ర వ‌ద్ద వాహ‌న భాగం ధ‌ర‌ను చెల్లిస్తాయి బీమా సంస్థ‌లు. ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు వాహ‌నం కొనుగోలు చేసిన 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిప్రియేష‌న్ క‌వ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు. వాహ‌న బీమా పునరుద్ధ‌ర‌ణ స‌మయంలో 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, లాక్, కీ రీప్లేస్‌మెంట్ కవర్, యాక్సిడెంటల్ షీల్డ్, రవాణా ప్రయోజనాల వంటి కొన్ని ముఖ్యమైన యాడ్-ఆన్ కవర్‌ల గురించి బీమా సంస్థను అడగాలి.

పోర్ట‌బిలిటీ..: వాహ‌న బీమా పున‌రుద్ధ‌ర‌ణ స‌మయంలో పాల‌సీ వేరొక బీమా సంస్థ‌కు మార‌వ‌చ్చు. అంటే మీరు ప్ర‌స్తుత బీమా సంస్థ‌తో సంతృప్తిగా లేక‌పోతే, మెరుగైన సేవ‌లు, మెరుగైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ సామ‌ర్థ్యం, త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ క‌వ‌రేజ్‌, యాడ్‌-ఆన్ ఉన్న పాల‌సీకోసం బీమా చేసిన వ్య‌క్తి పోర్ట‌బిలిటీ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. మీ వాహ‌న బీమాను వేరొక సంస్థ‌కు పోర్ట్ చేసిన‌ప్ప‌టికీ నో క్లెయిమ్ బోన‌స్ వంటి ప్ర‌యోజ‌నాలు రెన్యువ‌ల్ ఫ్రీ క్లెయిమ్ పాల‌సీకి  అందుతాయి. 

వాలెంట‌రీ డిడ‌క్టిబుల్‌..: వాహ‌న బీమా.. పాల‌సీ పునురుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో వాలెంట‌రీ డిడ‌క్టిబుల్ ఫీచర్‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. వాలెంట‌రీ డిడ‌క్టిబుల్‌గా ఎంచుకున్న క్లెయిమ్ మొత్తం బీమాదారులే చెల్లిస్తారు. ఎంపిక చేసిన వాహ‌నాల‌ను లేదా 5 సంవ‌త్స‌రాల పాత వాహ‌నాల‌ను వినియోగించేవారు ఎక్కువ‌గా వాలెంట‌రీ డిడ‌క్టిబుల్‌ని ఎంచుకుంటారు. ఎందుకంటే, ఇది వాహ‌న బీమా పాల‌సీ మొత్తం ప్రీమియంను త‌గ్గిస్తుంది. 

యాంటీ తెఫ్ట్ పరికరాన్ని అమర్చండి..: మీ వాహనంలో యాంటీ తెఫ్ట్ పరికరాన్ని అమర్చడం వల్ల కేవలం మీ వాహనం దొంగతనానికి గురికాకుండా చేయడమే కాకుండా, మీ వాహ‌న‌ బీమా ప్రీమియంను కూడా తగ్గించవచ్చు. ఒకవేళ మీరు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిన యాంటీ తెఫ్ట్ పరికరాన్ని అమర్చినట్లైతే, బీమా కంపెనీలు మీ బీమా ప్రీమియంపై డిస్కౌంట్‌ను అందిస్తాయి.

చివ‌రగా: వాహ‌న బీమా పాల‌సీని స‌కాలంలో పున‌రుద్ధ‌రించాలి. లేక‌పోతే అప్ప‌టివ‌ర‌కు పొందిన నో-క్లెయిమ్ బోన‌స్ కోల్పోయే ప్ర‌మాదం ఉంది. దీంతో ప్రీమియం త‌గ్గింపు ప్ర‌యోజ‌నాలు కోల్పోతారు. ఖ‌ర్చు పెరుగుతుంది. పాల‌సీ నిర్వ‌హ‌ణ‌లో బీమా సంస్థ‌లు అందించే యాప్‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. పున‌రుద్ధ‌ర‌ణ గ‌డువును మీకు గుర్తుచేస్తాయి. కొన్ని క్లిక్‌ల‌తోనే పాల‌సీని పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని