ఇంటి అభివృద్ధితోనూ మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను సేవ్ చేయ‌వ‌చ్చు.. 

క్యాపిట‌ల్ గెయిన్ త‌గ్గించేందుకు  ఇల్లు అమ్మిన‌ప్పుడు, గృహ అభివృద్ది ఛార్జీల‌ను చేర్చ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. 

Updated : 25 Jun 2021 15:16 IST


ఇంటిని అమ్మిన‌ప్పుడు వ‌చ్చిన సొమ్మును మ‌రో ఆస్తి కొనుగోలుకు ఉప‌యోగించినా, లేదా 54ఈసీ బాండ్ల‌ను కొనుగోలు చేసినా, మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను ఆదా చేయ‌వ‌చ్చు. అయితే ఇంటి అభివృద్ధి పనుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు కూడా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చ‌ని మీకు తెలుసా?  

మూల‌ధ‌న రాబ‌డి ..
ఒక ఆస్తిని కొనుగోలు చేసిన‌ప్పుడు చెల్లించిన ధ‌ర కంటే.. ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే వ‌చ్చిన లాభాన్ని మూల‌ధ‌న రాబ‌డి(క్యాపిట‌ల్ గెయిన్) అంటారు. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. 1. స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న రాబ‌డి 2. దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి. ఆస్తిని కొనుగోలు చేసిన త‌రువాత ఎంత‌కాలం మ‌న వ‌ద్ద ఉంది అనే అంశంపై స్వ‌ల్ప కాలీక‌, దీర్ఘ‌కాలీక రాబ‌డుల‌ను లెక్కిస్తారు. ఆస్తిని కొనుగోలు చేసిన రెండు సంవ‌త్స‌రాల లోపు విక్ర‌యిస్తే.. వ‌చ్చే లాభాల‌ను స్వ‌ల్ప‌కాల రాబ‌డిగానూ, రెండు సంవ‌త్స‌రాల త‌రువాత విక్ర‌యిస్తే దీర్ఘ‌కాల రాబ‌డి గానూ లెక్కిస్తారు. 

స్వ‌ల్ప కాల మూల‌ధ‌న లాభాల‌పై అమ్మ‌కం దారునికి వర్తించే ఆదాయ‌పు ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది. దీర్ఘాకాల మూల‌ధ‌నంపై పోస్ట్ ఇండ‌క్సేష‌న్ ప‌న్ను 20 శాతం వ‌ర్తిస్తుంది. 

కాస్ట్ ఆఫ్ ఇఫ్రూవ్‌మెంట్..
ఇంటిని కొనుగోలు చేసిన త‌రువాత దాని అభివృద్ధి ప‌నులు..విస్త‌ర‌ణ వంటి వాటికి అయ్యే ఖ‌ర్చును కాస్ట్ ఆఫ్ ఇఫ్రూవ్‌మెంట్ (అభివృద్ధి ఖ‌ర్చు) అంటారు. దీనిని ఆస్తి కొనుగోలు అయిన వ్య‌యానికి జ‌త‌చేయ‌వ‌చ్చు. లేదా ఇంటి ఆస్తి అభివృద్ధికి అయిన ఖ‌ర్చును మూల‌ధ‌న రాబ‌డి నుంచి త‌గ్గించ‌వ‌చ్చు.

"ఆస్తి 24 నెలలకు మించి ఉంటే,  అభివృద్ధికి అయిన ఖ‌ర్చుల‌కు ఇండ‌క్సేష‌న్‌ను కూడా జ‌త‌చేయ‌వ‌చ్చు. అంటే వాస్తవ ఖర్చులకు.. ఆస్తి మ‌న వ‌ద్ద ఉన్న కాలంలో పెరిగిన ధ‌ర‌ల‌ను క‌లిపి ఎక్కువ మొత్తానికి సూచించవ‌చ్చు. ఇండెక్సేష‌న్ అంటే.. కొనుగోలు ధరకు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించి మార్చడం. ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ వల్ల దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గించుకునే వీలుంటుంది. " 

అయితే, క్యాపిట‌ల్ గెయిన్ లెక్కించేప్పుడు కొన్ని నిర్ధిష్ట ఇత‌ర ఖ‌ర్చుల‌ను మాత్రం ఇందులో క‌ల‌ప‌కూడ‌దు. మ‌ర‌మ్మ‌త్తు ఖ‌ర్చులు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు, వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తిపై చెల్లించే ఎస్టేట్ డ్యూటీల‌ను అభివృద్ధి కోసం చేసే ఖ‌ర్చులో చేర్చ‌కూడ‌దు. అలాగే మూల‌ధ‌న లాభాల‌ను లెక్కించేప్పుడు, ఏప్రిల్‌1,2001 ముందు చేసిన అభివృద్ధి ఖ‌ర్చుల‌ను విస్మ‌రించాలి. 

మూల‌ధ‌న రాబ‌డిని ఆస్తి కొనుగోలుకు వినియోగిస్తే.. వ‌ర్తించే ప‌న్ను మిన‌హాయింపులు ఒక‌సారి చూద్దాం..

వివిధ శ్లాబులు, సెక్ష‌న్‌ల ప్ర‌కారం ఒక ఇంటిని విక్ర‌యిస్తే వ‌చ్చే మూల‌ధ‌న రాబ‌డిని తిరిగి ఆస్తి కొనుగోలుకు వినియోగిస్తే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సెక్ష‌న్ 54: ఈ సెక్ష‌న్ ప్ర‌కారం, ఇంటిని అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుతో మ‌రో ఆస్తిని కొనుగోలు చేస్తే ప‌న్ను మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపును కోర‌వ‌చ్చు. ఆస్తిని విక్ర‌యించే ఏడాదికి ముందు లేదా అమ్మిన రెండేళ్ల త‌ర్వాత కొన‌గోలు చేస్తే ఇది వ‌ర్తిస్తుంది . ఒక‌వేళ నిర్మాణంలో ఉంటే మూడేళ్ల వ‌ర‌కు గ‌డువు ఉటుంది.

సెక్ష‌న్ 54ఈసీ: ఆస్తిని విక్ర‌యించగా వ‌చ్చిన రాబ‌డితో ఎన్‌హెచ్ఏఐ లేదా ఆర్ఈసీ విక్ర‌యించే బాండ్ల‌ను కొనుగోలు చేస్తే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

సెక్ష‌న్ 54 ఎఫ్: ఇంటిని కొనుగోలు చేసేందుకు మ‌రో ఆస్తిని అమ్మ‌గా వ‌చ్చిన మొత్తం సొమ్మును వినియోగిస్తే ప‌న్ను త‌గ్గింపు ఉంటుంది. అయితే ఆస్తి కొనుగోలు చేసేందుకు మొత్తం లాభాన్ని వినియోగించ‌కుండా కొంత మొత్త‌మే ఖ‌ర్చు చేస్తే దానిపై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మిగ‌తా రాబ‌డిపై దీర్ఘ‌కాలీక మూల‌ధ‌న రాబ‌డి ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

క్యాపిట‌ల్ గెయిన్స్ డిపాజిట్ ఖాతా ప‌థ‌కం:  సెక్ష‌న్ 54, సెక్ష‌న్ 54ఎఫ్ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు పొందాలంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. అయితే దీనిపై కూడా పైన తెలిపిన ప్రకార‌మే ప‌న్ను త‌గ్గింపున‌కు కాల‌ప‌రిమితి ఉంటుంది. కానీ మ‌రో ఆస్తిని కొనుగోలు చేయ‌డం ద్వారా ప‌న్ను త‌గ్గింపుతో పాటు మ‌రో ఆస్తిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని