ప‌థ‌కాల రాబడిలో తేడా గమనించండి

పదవీవిరమణ తరువాత సంపాదన కష్టమవుతుంది కాబట్టి, సరిపడా ఆదాయం తప్పనిసరిగా ఉండాలి.....

Updated : 01 Jan 2021 18:55 IST

​​​​​​​ప్రతి వ్యక్తికీ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి సంపాదించిన దాంట్లో కొంత సొమ్ము జాగ్రత్త పరుస్తారు. అయితే ఆ పథ‌కం తాలూకు నియమ నిబంధనలు ఏమిటి, రాబడి ఎంత, కాలపరిమితి ఏమిటి అని తెలుసుకోకుండా ఏదో ఒక పధకంలో మదుపు చేస్తుంటారు. దీనివలన వారి ల‌క్ష్యాల‌ను చేరుకునే అవ‌కాశాన్ని కోల్పోతారు. వయసులో ఉన్నపుడు పరవాలేదు కానీ , వయసు మళ్ళిన తరువాత , అంటే పదవీవిరమణ తరువాత ఏ కోరికలు లేకపోయినా , జీవనానికి సరిపడా ఆదాయం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఆ వయసులో సంపాదన కష్టమవుతుంది కాబట్టి.

పదవీవిరమణ తరువాత నెలవారీ ఆదాయం పొందడానికి ప‌థ‌కాలు ఉన్నప్పటికీ , దీర్ఘకాలం మదుపు చేయలేకపోవటం జరుగుతుంది. అందువలన ఈ సమస్యను గ్రహించిన ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ పేరుతొ ఉద్యోగి సంపాదన నుంచి కొత్త మొత్తం , అలాగే ఉద్యోగి పనిచేసే సంస్థ లేదా యజమాని ద్వారా కొంత మొత్తం కలిపి, ఉద్యోగ‌ భవిష్య నిధిని (ఈపీఎఫ్) ఏర్పాటు చేసాయి. ఇది ఒకరకంగా తప్పనిసరి మదుపు. భవిష్యత్ లో పదవీవిరమణ పొందిన తరువాత ఆదాయం కొరకు వినియోగించుకోవచ్చు.

అయితే, మారుతున్న జీవన విధానం, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఆధునిక వైద్య విధానాల వలన ఎక్కువ కాలం జీవించగలగడం , ఖరీదైన వైద్య ఖర్చులు, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వంటి అనేక కారణాల వలన ఈ సొమ్ము సరిపోదు అని గ్రహించాలి.

అలాగే, అనేక ఇతర పెట్టుబడి మార్గాలు కూడా వచ్చాయి. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే ప‌థ‌కాలు కూడా వచ్చాయి . అందువలన కొంత సొమ్మును ఇటువంటి పథకాలలో కూడా మదుపు చేయాల్సిఉంటుంది. ఈ కింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం:

శ్యామ్ 25 ఏళ్ల వయసులో , రూ 10 వేల బేసిక్ జీతం తో ఉద్యోగంలో చేరాడు. మొదటి ఏడాది ప్రతి నెలా అతని వాటా కింద 12 శాతం గా రూ. 1,200 కింద ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతుంది. ప్రతి ఏడాది అతనికి లభించే ఇంక్రిమెంట్ 5 శాతం అనుకుంటే , అతని వాటా కూడా అదే శాతంలో పెరుగుతుంది . ప్రతి ఏడాది జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ మీద ఏడాదికి సుమారుగా 8.5 శాతం వడ్డీ లభిస్తుంది. 60 ఏళ్ల వయసులో అతను పదవీవిరమణ చేసేనాటికి అతని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం రూ 55 లక్షలు .

అలాగే అతను ప్రావిడెంట్ ఫండ్ తోపాటు , ఎన్పీఎస్ లో కూడా అదే మొత్తాలను మదుపు చేసినట్లయితే , అదే కాలానికి 10 శాతం రాబడి అంచనాతో తన పదవీవిరమణ నాటికి అదనంగా రూ. 74.75 లక్షలను పొందొచ్చు.

అలాగే అతను ప్రావిడెంట్ ఫండ్ తోపాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అదే మొత్తాలను మదుపు చేసినట్లయితే , అదే కాలానికి 12 శాతం రాబడి అంచనాతో తన పదవీవిరమణ నాటికి అదనంగా రూ. 118.45 లక్షలను పొందొచ్చు.

return.jpg

ముగింపు:
సాధారణంగా చేతికి అందిన ఆదాయం నుంచి 25-30 శాతం వరకు మదుపు చేయాలి. ఇవి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప‌థ‌కాల‌ కోసం విడివిడిగా మదుపు చేయడం ద్వారా అన్ని లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. చిన్న వయసు నుంచే మదుపు చేయడం వలన చక్రవడ్డీ ప్రభావంతో మంచి రాబడి పొందొచ్చు. ఫై పట్టికలో చూపినట్టుగా ప్రతి ఐదు ఏళ్లలో రాబడిలో తేడాను గమనించవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని