నష్టం వస్తే భరించగలరా? 

నష్టభయాన్ని అంచనా వేయడంలో రెండు రకాల సమస్యలు ఉంటాయి

Updated : 09 Nov 2021 12:25 IST

లాభాలు రావాలని పెట్టుబడులు పెడతాం… కానీ, కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం. ఇతర విషయాల్లో ఎలా ఉన్నా… ఆర్థిక విషయాల్లో ఈ పొరపాట్లు కొన్నిసార్లు కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. పొరపాట్లను గుర్తిస్తూ… సరిచేసుకుంటేనే సంపద వృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నష్టభయం భరించే సామర్థ్యం అంచనా వేయడంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేప్పుడు అందులో ఉండే ప్రతికూల, సానుకూల అంశాలను పూర్తిగా గమనించాలి.

సాధారణంగా పెట్టుబడులు రెండు రకాలుగా ఉంటాయి. పెట్టుబడికి, రాబడికి కూడా హామీ ఉండే పథకాలు ఒకరకం అయితే… అసలుకు, రాబడికి కూడా ఏ మాత్రం హామీ ఉండనివి రెండో రకం. పెట్టుబడి వృద్ధి చెందాలని భావించేవారు రెండో రకాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో నష్టభయం అధికంగా ఉన్నట్లే… రాబడి శాతం హామీ ఉండే పథకాలకన్నా ఎక్కువగానే వచ్చే అవకాశమూ ఉంటుంది. నష్టభయాన్ని అంచనా వేయడంలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఇందులో మొదటిది రాబడి ఎంతొస్తుంది అనేది తెలుసుకోవడంలో వాస్తవాలను విస్మరించడం. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌నే తీసుకుంటే… ఇటీవలే సూచీలు జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పలు షేర్ల ధరలు అధిక ధరల వద్ద ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆయా షేర్లలో మదుపు చేయాలా వద్దా? ఒకవేళ చేస్తే…భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయా? లేదా తగ్గేందుకు వీలుందా? వేచి చూడాలా?

ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. ఇక రెండో విషయానికి వస్తే… అనుకోని విధంగా పెట్టుబడులకు నష్టం వస్తే ఏం చేయాలన్నది. షేర్లనే తీసుకుంటే… మీరు కొన్న వెంటనే ధర తగ్గింది అనుకోండి… అది తాత్కాలికంగానే అని, మళ్లీ ధర పెరగడానికి అవకాశం ఉందనీ భావిస్తారు ఎవరైనా. కానీ, అలాగే తగ్గుతూ ఉందనుకోండి… మరికొంత మొత్తంతో ఆ షేర్లను సగటు చేయాలని ప్రయత్నిస్తారు. కానీ, దీనివల్ల మన పోర్ట్‌ఫోలియోకు వచ్చిన నష్టాన్ని తగ్గించుకోవడమే అవుతుంది కానీ, పూర్తిగా బయటపడినట్లు కాదు.

ప్రతి పెట్టుబడి పథకంలోనూ ఎంతోకొంత నష్టభయం ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. ఉదాహరణకు స్థిరాస్తుల కొనుగోలు వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు అనుకునేముందు… గత పదిపదిహేనేళ్ల కాలంలో జరిగిన హెచ్చుతగ్గులను పరిశీలనలోకి తీసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేవారు… ఫండ్లను ప్రతి ఏడాదికోసారి సమీక్షించుకోవాలి. మనం పెట్టుబడి పెట్టిన ఫండ్‌ పనితీరు బాగాలేకపోతే మాత్రం కొంత నష్టం వచ్చినా… వదిలించుకోవడమే మేలు. నష్టం భరించే సామర్థ్యంలో విధించుకున్న పరిమితులు కూడా మీ వయసు, ఆదాయ వనరులు, పెట్టుబడి కొనసాగించే కాలాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులతోపాటు దీన్నీ సమీక్షించుకోవాల్సిందే.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని