బీమా రంగంలో మ‌ధ్య‌వ‌ర్తుల పాత్ర‌

బీమా కొనుగోలు ద‌గ్గ‌ర నుంచి క్లెయిమ్ చేసి ప్ర‌యోజనాలు పొందేదాకా మ‌ధ్య‌వ‌ర్తుల పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Published : 19 Dec 2020 16:54 IST

బీమా కంపెనీకి, బీమా తీసుకునే వ్యక్తికి అనుసంధానంగా వ్యవహరించేవారినే మధ్యవర్తులు అంటారు. పాలసీ తీసుకునే సమయం నుంచి ప్రీమియంలు చెల్లించడం, రెన్యూవల్‌ చేయించడం, క్లెయిం చేసే వరకూ వీరి పాత్ర ఉంటుంది. వివిధ రకాల నియమ, నిబంధనలతో సంక్లిష్టంగా ఉండే బీమా విషయాలను అర్థం చేయించేందుకు మధ్యవర్తులుగా బీమా ఏజెంటు లేదా బ్రోకర్‌ లేదా నిపుణులైన ఆర్థిక సలహాదార్లు ఉంటారు.

  • బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) బీమా బ్రోకర్లకు ప్రత్యేకంగా లైసెన్సు జారీచేస్తుంది. సాధారణంగా బీమా ఏజెంట్లకు, కార్పొరేట్‌ బీమా ఏజెంట్లకు సైతం ఐఆర్‌డీఏ లైసెన్సు ఇస్తుంది. వీరందరికీ ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఐఆర్‌డీఏ రూపొందించింది.

  • బీమాలోని రకాలు, వివిధ పాలసీల మొత్తం విషయాలను పాలసీ తీసుకునే వారి ముందు ఏజెంటు ఉంచాలి. పాలసీ తీసుకునే వ్యక్తికి పాలసీ నియమనిబంధనలను వివరించి సరైన పాలసీ తీసుకొనేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది.

బీమా మధ్యవర్తుల బాధ్యతలు

  • ఐఆర్‌డీఏ లైసెన్సు కలిగి ఉండడం.

  • సరైన పాలసీ ఎంపికలో సహాయం చేయడం

  • పాలసీలో లోటుపాట్ల‌ను వివరించడం

  • పాలసీకి వర్తించే అంశాలు, వర్తించని అంశాలు వివరించడం

  • బీమాదారులకు ఎప్పటికప్పుడు పాలసీ ప్రీమియం, రెన్యూవల్‌ విషయాలను గుర్తు చేయ‌డం

  • క్లెయిం చేసుకునే సందర్భంలో సహాయపడడం

బీమా మధ్యవర్తులతో వ్యవహరించేటప్పుడు…

లైసెన్సు క‌లిగి ఉన్నారా?

  • బీమా మధ్యవర్తులు ఐఆర్‌డీఏ జారీచేసే లైసెన్సు కలిగి ఉండి బీమా వ్యాపారం చేసుకునే అర్హత కలిగి ఉన్నారన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. మధ్యవర్తిత్వం వహించేవారు జీవిత బీమా లేదా సాధారణ బీమా లేదా రెండూ అమ్మేందుకు లైసెన్సు కలిగి ఉన్నారన్న దాన్ని చూడాలి. మధ్యవర్తికి వివిధ రకాల పాలసీలపైన పూర్తి అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలి.

  • బీమా ఏజెంటు వివరించే పాలసీ నియమనిబంధనలను సమగ్రంగా అర్థంచేసుకొని సందేహాలేమైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోవాలి.

  • పాలసీ దరఖాస్తు ఫారాన్ని స్వయంగా నింపాలి. ఖాళీ ఫారంపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయరాదు. పాలసీని తీసుకున్న తర్వాత అందులో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఏజెంటును కలిసి వివరాలు తెలుసుకోవాలి. సాధారణంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల నియమనిబంధనలు నచ్చకపోతే మూడేళ్ల వరకూ పాలసీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఎంత మొత్తానికి ప్రీమియం?

  • మీ అవసరాలను ఏజెంటు అర్థంచేసుకోగలగాలి. పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆదాయంలో ప్రీమియానికి వెచ్చించగలిగే దాన్నే తీసుకోవాలి. ఎక్కువ మొత్తం ప్రీమియం ఉండే పాలసీని తీసుకొని తర్వాత కట్టలేక ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తపడాలి. ఏజెంటు ద్వారా ప్రీమియం చెల్లించేటప్పుడు సదరు బీమా కంపెనీ ఆ ఏజెంటుకు ప్రీమియం తీసుకునే అధికారం ఇచ్చిందో లేదో చూసుకోవాలి. ఒక వేళ ఏజెంటుకు ప్రీమియం సొమ్ము ఇస్తే దానికి తగిన రశీదు తీసుకోవడం మర్చిపోవద్దు. చెల్లించిన ప్రీమియం పైకం లేదా చెక్కు బీమా కంపెనీకి అందాయో లేదో తెలుసుకోవాలి.

  • మనం తీసుకునే పాలసీకి సంబంధించిన బ్రోచర్‌ను ఏజెంటును అడిగి తీసుకోవాలి. కవరేజీలో రాని అంశాలు, మినహాయింపులేమైనా ఉంటే ముందే తెలుసుకొని ఉండడం మంచిది.

  • పాలసీ తీసుకునేటప్పుడు చేసే చెల్లింపులతోపాటు పాలసీని స్వాధీనపర్చుకునే వేళ, క్లెయిం చేసుకునేటప్పుడు ఎలాంటి చెల్లింపులు జరపాలో తెలుసుకొని ఉండాలి.

స‌మ‌యానికి క్లెయిం ప‌రిష్కారాలు!

  • క్లెయిం చేసుకునేటప్పుడు సమర్పించాల్సిన పత్రాలను, వ్యవహరించాల్సిన పద్ధతులను ఏజెంటును అడిగి తెలుసుకోవాలి. కొన్ని సార్లు బీమా కంపెనీలకే కాకుండా వేరే ఏజెన్సీలకు క్లెయిం విషయాలను తెలపాల్సి ఉంటుంది. అలాంటి వాటిని గురించి ఏమేం చేయాల్సి ఉంటుందో ఏజెంటు ద్వారా తెలుసుకోవాలి. సమయానికి సేవ‌లు అందుబాటులో ఉంటాయో లేదో కనుక్కోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని