స్టాక్ మార్కెట్‌లో సెక్టార్ సూచీలు

స్టాక్ మార్కెట్‌లో న‌మోదైన ప‌రిశ్ర‌మ‌ (సెక్టార్ ఇండీసెస్) సూచీల‌ను ఆ రంగానికి చెందిన‌ కంపెనీల ప‌నితీరుకు కొల‌మానంగా (బెంచ్ మార్క్) గా ప‌రిగ‌ణిస్తారు.....

Updated : 19 Nov 2022 14:05 IST

స్టాక్ మార్కెట్‌లో న‌మోదైన ప‌రిశ్ర‌మ‌ (సెక్టార్ ఇండీసెస్) సూచీల‌ను ఆ రంగానికి చెందిన‌ కంపెనీల ప‌నితీరుకు కొల‌మానంగా (బెంచ్ మార్క్) గా ప‌రిగ‌ణిస్తారు.

స్టాక్ మార్కెట్ వార్త‌ల్లో ఎక్కువ‌గా వినిపించే ప‌దం ఇండెక్స్ (సూచీ). ఫ‌లానా సూచీ ఈ రోజు లాభ‌ప‌డింద‌ని, లేదా న‌ష్ట‌పోయింద‌ని చెబుతుంటారు. ఇంత‌కీ ఈ సూచీ అంటే ఏంటి? అది ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. సూచీల‌ను బెంచ్ మార్క్ గా ఎందుకు ప‌రిగ‌ణిస్తారు?.. బెంచ్ మార్క్ అంటే ఏంటి? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం. 

ప్ర‌స్తుతం ఈ క‌థ‌నంలో సెక్టార్ ఇండీసెస్ (ప‌రిశ్ర‌మ ప‌నితీరును తెలిపే సూచీల) గురించి తెలుసుకుందాం.

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట‌యిన దాదాపు 4 వేల కంపెనీలు ప‌లు ర‌కాల‌ వ్యాపారాలు చేస్తుంటాయి. ఒక్కో సంస్థ‌ ఆటోమొబైల్, సిమెంట్ ఇలా ఒక్కో వ‌ర్గానికి చెందిన వ్యాపారాల‌ను చేస్తుంటాయి. ఆ విధంగా ఒకేలాంటి వ్యాపారం చేసే కంపెనీల‌ను ఒకే రంగానికి చెందిన కంపెనీలుగా గుర్తిస్తారు. అంటే ఆటో మొబైల్ వ్యాపారం చేసే టాటా మోటార్స్, టీవీఎస్ మోట‌ర్స్, ఐష‌ర్ మోట‌ర్స్ కంపెనీలు ఒకే రంగం ఆటో రంగానికి చెందినవి. కాబ‌ట్టి ఈ కంపెనీల‌న్నింటినీ క‌లిపి ఉన్న‌ ఇండెక్స్ ను ఆటో ఇండెక్స్ అంటారు. ఈ రంగంలో ఉన్న అన్ని సంస్థ‌ల‌ మిశ్ర‌మ ప‌నితీరును ఇండెక్స్ గ‌ణాంకాల్లో సూచిస్తుంది.

ఎక్స్ఛేంజీ బ‌ట్టి దీని పేరు ఉంటుంది. —ఎన్ఎస్ఈ లో ఆటోరంగ సూచీ నిఫ్టీ ఆటో అంటారు. —బీఎస్ఈలో అయితే ఎస్&పీ బీఎస్ఈ ఆటో అంటారు.

ఉదాహ‌ర‌ణ‌:

ఎస్ అండ్ పీ బీఎస్ఈ ఆటో ప్ర‌స్తుత విలువ కింది విధంగా ఉంది. (న‌వంబ‌ర్ 10, 2017 నాటికి)

S&P BSE AUTO 24931.75 -158.79 (-0.63%)

ఎస్ అండ్ పీ బీఎస్ఈ ఆటో ఇండెక్స్ లో మొత్తం 14 కంపెనీలు న‌మోదై ఉన్నాయి. ఈ 14 కంపెనీల ప‌నితీరు ఆధారంగా ఆ సూచీ మారుతుంటుంది. కింది చిత్రంలో ఆ రోజు కంపెనీలు చ‌లించిన తీరు గ‌మ‌నించండి. ఎక్కువ కంపెనీల షేరు ధ‌ర‌లు త‌గ్గాయి. అందుకే మొత్తంగా ఇండెక్స్ కూడా త‌గ్గింది.

వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఏంటి అనుకుంటున్నారా…

సూచీలు ప్ర‌ధానంగా బెంచ్ మార్క్ లుగా ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. బెంచ్మార్క్ అంటే ఒక స్టాండ‌ర్డ్ గా ప‌రిగ‌ణిస్తారు. ఒకే రంగానికి చెందిన కంపెనీల ప‌నితీరును విశ్లేష‌ణ చేసి మిశ్ర‌మ ప‌నితీరును సూచించేది ఇండెక్స్ . కాబ‌ట్టి మ‌దుప‌ర్లు తాము మ‌దుపుచేసిన కంపెనీ ప‌నితీరును ఆ రంగం సూచీతో పోల్చి చూసుకుంటే మొత్తం ప‌రిశ్ర‌మ‌ ఉమ్మ‌డి ప‌నితీరుకంటే మెరుగా, త‌రుగా అనేది తెలుసుకోవ‌చ్చు. అందుకే సూచీల‌ను బెంచ్ మార్క్ గా ప‌రిగ‌ణిస్తారు.

బెంచ్ మార్క్ గా సూచీ

ఉదాహ‌ర‌ణ‌కు ఫార్మారంగానికి చెందిన మూడు కంపెనీల‌ను సూచీతో పోల్చిచూడ‌టం ద్వారా ఆయా కంపెనీల్లో నెల, ఏడాది వ్య‌వ‌ధిలో వ‌చ్చిన‌ మార్పును గ‌మ‌నిద్దాం.

పై ప‌ట్టిక‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మొత్తం ప‌రిశ్ర‌మ‌, అందులో కంపెనీలు ఏవిధంగా మార్పు చెందుతున్నాయో తెలుసుకోవ‌చ్చు.

నిఫ్టీ ఫార్మా సూచీతో కంపెనీల‌ను పోల్చి చూస్తే

నిఫ్టీ ఫార్మా సూచీ గ‌తేడాది కాలంలో -13.94 %, గ‌త నెల‌లో -1.84 % మార్పు చెందింది.

  • కంపెనీ A: కంపెనీ A గ‌తేడాది కాలంలో -17.99 %, గ‌త నెల‌ వ్య‌వ‌ధిలో 15.8%. ఏడాది వ్య‌వ‌ధిలో సూచీ కంటే త‌క్కువ‌గా, నెల వ్య‌వ‌ధిలో ఎక్కువ‌గా మార్పుచెందింది.

  • కంపెనీ B: గ‌తేడాది కాలంలో -45.52%, గ‌త నెల‌ వ్య‌వ‌ధిలో -21.53% మార్పుచెందింది. ఏడాది వ్య‌వ‌ధిలో సూచీ కంటే చాలా త‌క్కువ‌గా, నెల వ్య‌వ‌ధిలో కూడా త‌క్కువ‌గా మార్పుచెందింది.

  • కంపెనీ C: గ‌తేడాది కాలంలో 62.26%, గ‌త నెల‌ వ్య‌వ‌ధిలో -4.54% మార్పుచెందింది. ఏడాది వ్య‌వ‌ధిలో ఈ కంపెనీ సూచీని మించి ప‌నితీరు క‌న‌బ‌రిచింది. నెల వ్య‌వ‌ధిలో సూచీ కంటే త‌క్కువ‌గా న‌మోదైంది.

చివ‌ర‌గా…

పైన తెలిపిన‌ విధంగా సూచీల‌ను బెంచ్ మార్క్ గా ప‌రిగ‌ణించి మ‌దుప‌ర్లు తాము మ‌దుపు చేసిన కంపెనీల ప‌నితీరును బేరీజు వేసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని