Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలాకు వారంలో రూ.58 కోట్ల లాభం!

వారం క్రితం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఆయనకు సిరుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ఈరోజు కంపెనీ షేర్లు గరిష్ఠంగా 39 శాతం ఎగబాకడంతో ఆయన వాటాల విలువ 61 శాతం పెరిగింది....

Updated : 23 Aug 2022 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరైన ప్రణాళిక, మార్కెట్‌పై మంచి పట్టు, కంపెనీ తీరుతెన్నుల్ని క్షణ్నంగా విశ్లేషించగలిగే సామర్థ్యం ఉంటే స్టాక్‌ మార్కెట్లో రోజుల వ్యవధిలో రూ.కోట్లు గడించొచ్చని ఇండియన్‌ బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరోసారి నిరూపించారు. వారం క్రితం కొన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఆయనకు సిరుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ఈరోజు కంపెనీ షేర్లు గరిష్ఠంగా 39 శాతం ఎగబాకడంతో ఆయన వాటాల విలువ 61 శాతం పెరిగింది.

సెప్టెంబరు 14న రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని 50 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. అప్పుడు ఒక్కో షేరు విలువ రూ.220.44. ఈ లెక్కన 50 లక్షల షేర్లకు రూ.110 కోట్లు వెచ్చించారు. ఇక గతవారం రోజులుగా కంపెనీ నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో షేరు విలువ పెరుగుతూ వచ్చింది. ఈరోజు సోనీ పిక్చర్స్‌ ఇండియాతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం ప్రకటించడంతో కంపెనీ షేరు విలువ ఓ దశలో 39 శాతం ఎగబాకి 355.40 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. చివరకు 31.86 శాతం లాభంతో 337.10 వద్ద ముగిసింది. దీంతో ఝున్‌ఝున్‌వాలా ఒక్కో షేరు విలువ వారం రోజుల్లో రూ.116.66 పెరిగింది. ఈ లెక్కన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆయన వాటాల విలువ ఈరోజు రూ.168.33 కోట్లకు చేరింది. అంటే వారంలో ఆయన రూ.58.33 కోట్ల లాభం ఆర్జించారు.

ప్రముఖ మీడియా సంస్థ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జెడ్‌ఈఈఎల్‌)’, ‘సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)’ మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది. విలీనం తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం వాటాలుంటాయి. ఎస్‌పీఎన్‌ఐకు 52.93 శాతం వాటాలు దక్కుతాయి. ఒప్పందం ప్రకారం.. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్‌ 1.575 బిలియన్‌ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. ఆర్థికపరమైన అంశాలే కాకుండా సోనీతో భాగస్వామ్యం వల్ల రానున్న వ్యూహాత్మక విలువను కూడా పరిగణనలోకి తీసుకున్నామని జీ బోర్డు తెలిపింది. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నేడు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని