రూపే కార్డు ప్రయోజనాలు

రూపే కార్డు దేశీయంగా రూపొందించిన ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌కార్డు. రూపాయి పేమెంట్‌లను కలిపి రూపే కార్డుగా పేరు పెట్టారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు నిర్వహిస్తున్న ఈ కార్డుతో బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపవచ్చు. రూపే కార్డును దేశంలోని అన్ని ఏటీఎమ్‌ల్లోనూ, వ్యాపార సముదాయాల్లోనూ(పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌) ఉపయోగించవచ్చు...

Published : 16 Dec 2020 19:11 IST

రూపే కార్డు దేశీయంగా రూపొందించిన ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌కార్డు. రూపాయి పేమెంట్‌లను కలిపి రూపే కార్డుగా పేరు పెట్టారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు నిర్వహిస్తున్న ఈ కార్డుతో బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపవచ్చు. రూపే కార్డును దేశంలోని అన్ని ఏటీఎమ్‌ల్లోనూ, వ్యాపార సముదాయాల్లోనూ(పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌) ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్‌ లావాదేవీలు, చెల్లింపులు చేయవచ్చు.

రూపే కార్డు ప్రధాన లక్షణాలు:

  • వినియోగదారుడి నమోదు, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌తో పాటు బొమ్మతో కూడిన ధ్రువీకరణ ఉండటం వల్ల రూపే కార్డు వాడకం భద్రతకు భరోసానిస్తుంది.
  • పిషింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం వల్ల సురక్షితంగా ఉంటుంది.
  • వినియోగదారులు సులువుగా ఉపయోగించగల, త్వరగా అర్థం చేసుకోగల సాంకేతికతో కూడుకున్నది.
  • లావాదేవీల దశలు సులభంగా ఉండటం మూలంగా సమయం ఆదా అవుతుంది.
  • పిన్‌ ప్యాడ్‌లో పిన్‌ నమోదుకు సురక్షితమైన పద్ధతులను వాడటం జరిగింది.

రూపే కార్డు ఆన్‌లైన్‌ లావాదేవీ విధానం:

  • రూపే కార్డు ద్వారా ఆన్ లైన్ లావాదేవీలకు వాడేందుకు, మొదటగా రూపే పేసెక్యూర్‌లో కార్డు వివరాలు, నెంబరు, ఎక్సపైరీ తేదీ, కార్డు వెనుక ఉన్న CVD2 సంఖ్య వివరాలు సమర్పించి నమోదు చెసుకొవాలి.
  • కార్డు జారీ చేసిన బ్యాంకు ఖాతాదారు అందించిన వివరాల ఆధారంగా ధ్రువీకరణను పూర్తిచేస్తుంది.
  • నమోదయ్యే ముందు కార్డుతో కనీసం ఒక లావాదేవీ అయినా జరిపి ఉండాలి.
  • ఆన్‌లైన్‌ చెల్లింపులు మొదటిసారి జరిపే ముందు ఒక బొమ్మను ఎంపిక చేసుకుని దానికి ఒక పేరును కేటాయించుకోవాలి.
  • తదుపరి చెల్లింపుల్లో ఎంపిక చేసుకున్న బొమ్మను, దాని పేరును గుర్తించాల్సి ఉంటుంది.
  • యాంటి ఫిషింగ్‌ కోసం చివరి మూడు ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాలు నమోదు చేయాలి.
  • లావాదేవీలు, చెల్లింపుల విషయంలో చివరి ధ్రువీకరణగా ఏటీఎమ్‌ పిన్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఇవన్నీ సక్రమంగా పూర్తయిన తర్వాత రూపే కార్డు లావాదేవీ పూర్తవుతుంది.

రూపే కార్డు వాడకం వల్ల ప్రయోజనాలు:

భారతదేశంలో కార్డులను వాడేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. దేశంలో ఉన్న వినియోగదారులను, బ్యాంకులను, వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. కార్డును వాడేందుకు ఉన్న అవకాశాలు, వాడకందార్ల సమాచారం గోప్యంగా ఉండటం, రూపే బ్రాండుకు ఉన్న బలం వంటి పలు ప్రయోజనాలు కార్డు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

తక్కువ, భరించగలిగే ఖర్చు :

లావాదేవీ దేశీయంగా జరిగే ఏర్పాటు ఉండటం వల్ల చెల్లింపు జరిగేందుకు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. దాని వల్ల సగటు లావాదేవీకి అయ్యే ఖర్చు వినియోగదారుడు భరించగలిగే విధంగా ఉంటుంది.

దేశీయ వినియోగదారుకు తగ్గ ఏర్పాట్లు :

మన దేశంలోనే తయారవ్వడం మూలంగా దేశీయ వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకుని కార్డును రూపొందించారు. సేవలన్నీ ఈ కోణంలోనే ఉంటాయి.

వినియోగదారుల సమాచారం :

లావాదేవీలు, వినియోగదారులకు సంబంధించిన సమాచారం దేశం లోపలే సురక్షితంగా ఉంటుంది.

మారుమూల ప్రాంతాలకు విస్తరణ :

ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాదారులకు రూపే కార్డు ఇవ్వడం వలన, ఈ కార్డుల వినియోగం మారుమూల ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చింది.

చెల్లింపు మాధ్యమాల్లో ఉపయోగించేందుకు అవకాశం :

వివిధ చెల్లింపు మాధ్యమాల్లో వాడేందుకు వీలుగా రూపే కార్డును తయారుచేశారు.
ఏటీఎమ్‌, మర్చంట్‌ పేమెంట్స్‌, ఆన్‌లైన్‌ చెల్లింపులు లాంటి వాటికి అందుకు అనుగుణమైన సాంకేతికత, పరిష్కార మార్గాలను వాడటం ద్వారా రూపే కార్డు వాడకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని