SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్‌.. పాస్‌వర్డ్‌ ఇలా పెట్టుకోండి

బ్యాంకు ఖాతా, ఈ-మెయిల్‌ ఐడీ.. ఇలా నేటి డిజిటల్‌ యుగంలో ప్రతిదానికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. అయితే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. గుర్తుపెట్టుకోలేమనో

Published : 19 Aug 2021 17:15 IST

వీడియో షేర్‌ చేసిన బ్యాంకింగ్‌ దిగ్గజం

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాంకు ఖాతా, ఈ-మెయిల్‌ ఐడీ.. ఇలా నేటి డిజిటల్‌ యుగంలో ప్రతిదానికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. అయితే చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. గుర్తుపెట్టుకోలేమనో లేదా తొందరగా ఓపెన్‌ చేయొచ్చనో సులువైన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటారు. అయితే ఇదే వారిని సైబర్‌ మోసాల బారిన పడేలా చేస్తోంది. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే మన ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలని చెబుతోంది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా. ఇందుకోసం కొన్ని సలహాలు ఇచ్చింది.

ఇటీవల సైబర్‌ నేరాలు పెరుగుతోన్న నేపథ్యంలో ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. ‘‘బలమైన పాస్‌వర్డ్‌ మన ఖాతాకు అధిక భద్రత ఇస్తుంది. సైబర్‌ నేరగాళ్ల నుంచి మీ ఖాతాకు రక్షణ కలిగించేలా దృఢమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండిలా’’ అని ట్విటర్‌ వేదికగా వీడియో సందేశం విడుదల చేసిన ఎస్‌బీఐ.. పాస్‌వర్డ్‌ క్రియేషన్‌ కోసం 8 మార్గాలను సూచించింది. 

1. ఎప్పుడైనా క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్స్‌ కలిపి ఉండే పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. ఉదాహరణకు aBjsE7uG ఇలా అన్నీ కాంబినేషన్స్‌లో ఉండాలి.

2. లేదంటే అక్షరాలు, అంకెలు, సంజ్ఞలు వంటిని కలిపి కూడా పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు AbjsE7uG61!@.

3. మీ పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే భద్రత ఉంటుంది. ఉదా. aBjsE7uG.

4. సాధారణంగా డిక్షనరీలో ఉండే పదాలు.. సులువుగా ఉండే పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. ఉదా.  itislocked, thisismypassword వంటివి ఉపయోగించొద్దు.

5. కీబోర్డులో వరుసగా ఉండే పదాలను కూడా పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. అంటే qwerty, asdfg వంటివి ఉండకూడదు. దానికి బదులుగా ":)", ":/"ఇలా భావోద్వేగాలకు చిహ్నంగా ఉండే వాటిని ఉపయోగించొచ్చు.

6. చాలా మంది పాస్‌వర్డ్‌ అనగానే 12345678 లేదా abcdefg వంటివి పెట్టుకుంటారు. సులువగా గుర్తుంటుందని ఇలా చేస్తారు. ఇలాంటి పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. 

7. సులువుగా ఊహించే విధంగా ఉండే పాస్‌వర్డ్‌లు కూడా పెట్టుకోవద్దు.

8. పాస్‌వర్డ్‌ పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి. అంతేగాక మీ పేరు, పుట్టినతేదీ, లేదా మీ కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన సంవత్సరం వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు.  

‘‘మీ పాస్‌వర్డే మీ సంతకం. దాన్ని బలంగా, ప్రత్యేకంగా ఉంచుకునేలా చూసుకోండి’’ అని ఎస్‌బీఐ ఖాతాదారులను సూచించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని