SBI-Life: స‌రికొత్త‌ ‘న్యూ-ఏజ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌’ను తీసుకొచ్చిన ఎస్‌బీఐ లైఫ్‌!

కుటుంబ ఆర్థిక అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని సంపాదించే ప్ర‌తీఒక్క‌రూ ట‌ర్మ్ పాల‌సీని త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.

Updated : 23 Aug 2021 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌బీఐ జీవిత బీమా సంస్థ‌ ‘ఎస్‌బీఐ లైఫ్ ఇ-షీల్డ్ నెక్స్ట్’ పేరుతో స‌రికొత్త‌ న్యూ-ఏజ్ ప్రొట‌క్ష‌న్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది వ్య‌క్తిగ‌త‌, నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, ప్యూర్ రిస్క్ ప్రీమియంతో కూడిన జీవిత బీమా. ఇది స్టాక్ మార్కెట్‌తో అనుసంధానం కాదు. అలాగే పాలసీదారునితో ఎలాంటి లాభంగానీ డివిడెండ్‌ల‌ను గానీ పంచుకోదు.

ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో వివాహం, త‌ల్లిదండ్రులు కావ‌డం, కొత్త ఇల్లు కొనుగోలు చేయ‌డం వంటివి కొన్ని ముఖ్య మైన మైలురాళ్లు. ఈ ద‌శ‌ల‌ను చేరుకున్న‌ప్పుడు బీమా ర‌క్ష‌ణ పెంచుకోవాలి. అవ‌స‌రానికి త‌గిన‌ట్లు బీమా హామీ మొత్తాన్ని పెంచుకునే అవ‌కాశం ఈ పాల‌సీ క‌ల్పిస్తుంది.

ఈ పాలసీలో మూడు ప్లాన్ ఆప్ష‌న్‌లు అందుబాటులో ఉంటాయి. 1. లెవెల్ క‌వ‌ర్‌, 2. ఇంక్రీజింగ్ క‌వ‌ర్ 3. ఫ్యూచ‌ర్‌-ఫ్రూఫింగ్ ప్ర‌యోజ‌నంతో కూడిన లెవల్ క‌వ‌ర్‌. ఏ ఆప్ష‌న్ కావాలో ముందుగానే ఎంచుకోవాలి. పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌రో ఆప్ష‌న్‌కు మారే వీలులేదు.

ఆప్ష‌న్‌-1:  లెవల్ క‌వ‌ర్‌..
ఇందులో పాల‌సీ అమ‌ల్లో ఉన్నంత కాలం హామీ మొత్తం స్థిరంగా ఉంటుంది.

ఆప్ష‌న్‌-2: ఇంక్రీజింగ్ క‌వ‌ర్‌..
హామీ మొత్తాన్ని పెంచుకోవ‌డం. అంటే పాలసీదారుడు మ‌ర‌ణిస్తే కుటుంబ స‌భ్యుల‌కు అందించే సంపూర్ణ హామీ ఏడాదికి 10 శాతం చొప్పున‌ పెరుగుతుంది. ఇది ప్రతి ఐదో సంవ‌త్స‌రం ముగింపు సమయంలో అమల్లోకి వస్తుంది. ప్రాథ‌మిక బీమా మొత్తంపై గ‌రిష్ఠంగా 100శాతం వ‌ర‌కు పెరుగుద‌ల ఉంటుంది.

ఆప్ష‌న్‌-3:  లెవ‌ల్ క‌వ‌ర్ విత్ ఫ్యూచ‌ర్‌-ప్రూఫింగ్‌..
వివాహం, పిల్ల‌లు జ‌న్మించ‌డం, ఇళ్లు కొనుగోలు వంటి ముఖ్య‌మైన మైలురాళ్ల చేర‌కున్న‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు లేకుండానే హామీ మొత్తం పెంచుకోవ‌చ్చు. 
ఈ సదుపాయం పాలసీ వ్యవధిలో ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత మాత్రమే ఇటువంటి ప్ర‌యోజ‌నాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న మైలురాళ్లు చేరుకున్న‌ప్పుడు బీమా మొత్తం పెంచుకోవాలా వ‌ద్దా అనేది పూర్తిగా పాల‌సీదారుని ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. 

ప్రీమియం చెల్లింపు విధానం..
ప్రీమియం చెల్లింపు ఎంపికలో అనేక సౌకర్యాలను బీమా సంస్థ‌ అందిస్తోంది. ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించొచ్చు లేదా క్రమానుగ‌త చెల్లింపులు లేదా ప‌రిమిత కాలం (5 సంవ‌త్స‌రాల నుంచి 25 సంవ‌త్స‌రాలు) చెల్లింపులు చేయొచ్చు. మీరు ఎంచుకున్న పాల‌సీ మొత్తం కాల‌వ్య‌వ‌ధి నుంచి 5 సంవ‌త్స‌రాలు తీసేసి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించే ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా జీవిత బీమా క‌వ‌రేజ్ 100 ఏళ్ల‌కు (మొత్తం జీవితం), 85 సంవ‌త్స‌రాలకు కూడా అందుబాటులో ఉంది.

జీవిత భాగ‌స్వామి ప్ర‌యోజ‌నాలు..
పాల‌సీదారుడు లేన‌ప్పుడు, అత‌డు/ఆమె జీవిత భాగ‌స్వామికి తగినంత కవరేజ్ అందుబాటులో ఉండేలా ఈ ఆప్షన్ రూపొందించారు. జీవించి ఉన్న వారిపైన కుటుంబ బాధ్యత ఉంటుంది కాబ‌ట్టి ఇది అవ‌స‌రం.

మ‌ర‌ణ ప్ర‌యోజ‌నం చెల్లింపు విధానం..

పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే హామీ మొత్తం (డెత్ బెనిఫిట్‌) ఏవిధంగా పొందాలో ఎంచుకునే అవ‌కాశం ఉంది. ఒకేసారి గానీ, నెల‌వారీగా గానీ, కొంత ఏక మొత్తంగా మిగిలిన మొత్తం నెల‌వారీ వాయిదాలుగా తీసుకోవ‌చ్చు.

మీ వ్య‌క్తిగ‌త ఆర్థిక స్థితి, మీపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని హామీ మొత్తం ఏవిధంగా అందాలో ఎంపిక చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు: క్ర‌మ‌మైన ఆదాయాన్ని కోరుకునే వారు నెల‌వారీ వాయిదాల ప‌ద్ధ‌తిని ఎంచుకోవ‌చ్చు. లేదా రుణాలు తీర్చాల్సిన వారు ఏక మొత్తంలో పొందే ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు.

చివ‌రిగా..
ట‌ర్మ్ పాల‌సీ అనేది పాల‌సీదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు మాత్ర‌మే హామీ మొత్తం అందుతుంది కాబ‌ట్టి త‌క్కువ హామీ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి స్వ‌చ్ఛ‌మైన ట‌ర్మ్ పాల‌సీలో త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ మొత్తాన్ని పొందొచ్చు. అందువ‌ల్ల కుటుంబ ఆర్థిక అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని సంపాదించే ప్ర‌తి ఒక్క‌రూ ట‌ర్మ్ పాల‌సీని త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని