SBI: కస్టమర్లకు ఎస్‌బీఐ పండగ బొనాంజా.. గృహరుణాలపై వడ్డీ తగ్గింపు

గృహ రుణాలు తీసుకోవాలనుకునే కస్టమర్లకు ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టే్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పండగ సీజన్‌ ఆఫర్ ప్రకటించింది.

Updated : 16 Sep 2021 17:17 IST

ముంబయి: గృహ రుణాలు తీసుకోవాలనుకునే కస్టమర్లకు ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పండగ సీజన్‌ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణాలకు 6.7శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందొచ్చని తెలిపింది. అంతేగాక, ఈ ఆఫర్‌ కింద ప్రాసెసింగ్‌ ఫీజును కూడా తొలగించినట్లు బ్యాంకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

అంతకుముందు రూ.75లక్షల కంటే ఎక్కువ మొత్తంలో గృహరుణం తీసుకునే వారు 7.15శాతం వడ్డీరేట్లు చెల్లించాలి. అయితే ఈ పండగ ఆఫర్‌తో కొత్తగా గృహరుణం తీసుకునేవారికి.. ఎంత మొత్తం రుణానికైనా 6.70వడ్డీరేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. దీనివల్ల 30ఏళ్ల కాలవ్యవధితో రూ.75లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేవారికి వడ్డీభారం 45 బేసిస్‌ పాయింట్ల తగ్గడమే గాక, రూ.8లక్షలు ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. 

అంతేగాక, ఇప్పటివరకు వేతన ఆధారిత కస్టమర్లతో పోలిస్తే ఇతర కస్టమర్లకు గృహరుణాలపై వడ్డీరేటు 15 బేసిస్‌ పాయింట్లు ఎక్కువగా ఉండేది. తాజా ఆఫర్‌లో ఈ తేడాను తొలగించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. వృత్తి, రుణమొత్తం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతి కస్టమర్‌కు గృహరుణాలపై ఒకే వడ్డీరేటు అందిస్తోన్నట్లు వివరించింది. అంతేగాక, గృహరుణాలను బదిలీ చేసుకునేవారికి కూడా  ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఈ పండగ సీజన్‌ ఎప్పటివరకు అన్నది బ్యాంకు స్పష్టంగా చెప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని