ఆ ఛార్జీల్ని రిఫండ్‌ చేసేశాం: ఎస్‌బీఐ క్లారిటీ 

దేశంలోనే  అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగుకి మించి జరిపిన లావాదేవీలపై ఛార్జీల వసూళ్లపై వివరణ ఇచ్చింది....

Updated : 17 Apr 2021 22:08 IST

ముంబయి: దేశంలోనే  అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై వివరణ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్‌ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీల్ని రిఫండ్‌ చేశామని వెల్లడించింది. పరిమితికి మించిన లావాదేవీలపై సహేతుకమైన ఛార్జీలు వసూలు చేసుకొనే వెసులుబాటును 2012 ఆగస్టులో ఆర్‌బీఐ కల్పించిందని పేర్కొంది. అందువల్లే,  బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ (బీఎస్‌బీడీ)  ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ట్రాన్‌సెక్షన్స్‌పై ఛార్జీలు వసూలు చేసినట్టు తెలిపింది. 2016 జూన్‌ 15 నుంచి ఈ ఛార్జీలను వసూలు ప్రక్రియ అమలు జరిపినట్టు తెలిపింది.  అలాగే, ఈ విషయంపై ఖాతాదారులకు ముందుగానే సమాచారమిచ్చినట్టు పేర్కొంది. 

అయితే, 2020 జనవరి 1 తర్వాత డిజిటల్‌ లావాదేవీలపై  విధించిన ఛార్జీలను తిరిగి ఖాతాదారులకు చెల్లించాలంటూ 2020 ఆగస్టులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించింది. భవిష్యత్తులో డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని సీబీడీటీ బ్యాంకులకు సూచించిందని తెలిపింది. సీబీడీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్‌ 14 వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్‌ లావాదేవీలపై విధించిన ఛార్జీలను రిఫండ్‌ చేసినట్టు వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 15, 2020 నుంచి అలాంటి ఛార్జీలేమీ వసూలు చేయడం లేదని ఎస్‌బీఐ స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని