చెక్ చెల్లింపులు చేస్తున్నారా.. జ‌న‌వ‌రి 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్‌

చెక్ చెల్లింపుల‌కు సంబంధించి మోసాలు, దుర్వినియోగ కేసులను తగ్గించడ‌మే పాజిటీవ్ పే ముఖ్య ఉద్దేశ్యం

Updated : 30 Dec 2020 12:44 IST

దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చెక్ ద్వారా చెల్లింపులు చేసే వారికి 'పాజిటీవ్ పే సిస్ట‌మ్'‌ను అమ‌లులోకి తీసుకురానుంది. ఈ విధానంలో రూ.50 వేలకు మించిన చెక్‌ల‌ను పునః-నిర్ధార‌ణ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త చెక్ చెల్లింపు వ్య‌వ‌స్థ జ‌న‌వ‌రి 1, 2021 నుంచి అమ‌లులోకి రానుంది. 

ఆర్‌బీఐ విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జన‌వ‌రి 2021 నుంచి 'పాజిటీవ్ పేమెంట్ వ్య‌వ‌స్థ'‌ను అందుబాటులోకి వ‌స్తుంది. రూ.50వేలు, అంత‌కంటే ఎక్కువ మొత్తంను చెక్ ద్వారా చెల్లింపులు చేసే వారు అక్కౌంట్ నెంబ‌రు, చెక్ నెంబ‌రు, అమౌంట్‌, చెక్‌జారీని చేసిన తేది, చెల్లింపు దారుని పేరు, మొద‌లైన వివరాల‌ను త‌మ‌కు తెలియ‌జేయాల‌ని ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. పాజిటీవ్ పే సిస్ట‌మ్ ఎంపిక‌, సందేశాలు, స‌మ‌స్య‌లు ఉంటే బ్యాంక్ బ్రాంచిని సంప్ర‌దించాల‌ని వినియోగ‌దారుల‌ను ఎస్‌బీఐ కోరింది. 

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొన్ని నెలల క్రితమే  'పాజిటివ్ పే సిస్టమ్' ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుబ‌కుని, చెక్ చెల్లింపుకు సంబంధించి మోసం, దుర్వినియోగ కేసులను తగ్గించేందుకు  ఆగస్టులో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.


'పాజిటివ్ పే సిస్టమ్' అంటే ఏమిటి?

చెక్కులోని వివ‌రాల‌ను మ‌రోసారి ధృవీర‌క‌రించుకోవ‌డ‌మే పాజిటీవ్ పే వ్య‌వ‌స్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్ర‌క్రియలో అధిక విలువ‌తో కూడిన చెక్కును జారీ చేసినప్పుడు, చెక్కులో పేర్కొన్న‌  తేది, ల‌బ్ధిదారుని పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, అమౌంట్ త‌దిత‌ర‌ వివ‌రాలు పాజిటీవ్ పే వ్య‌వ‌స్థ ద్వారా పునః నిర్ధార‌ణ చేస్తారు. 

చెక్ జారీ చేసే వారు, ఎస్ఎమ్ఎస్‌, మొబైల్‌ అనువర్తనం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం మొదలైన ఛానెళ్ల ద్వారా ఎలక్ట్రానిక్‌గా చెక్‌లోని క‌నీస వివ‌రాల‌ను బ్యాంకుకు తెలియ‌జేయాలి.  ఈ వివ‌రాల‌ను సీటీఎస్ స‌మ‌ర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా వ్య‌త్యాసం ఉంటే అటువంటి చెక్‌ల‌ను బ్యాంక్ నిలిపివేస్తుంది. ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను వినియోగించుకుని త‌మ కావ‌ల‌సిన చిరునామాకు చెక్‌బుక్ డెలివ‌రీ కోసం అభ్య‌ర్ధించ‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ ఇంత‌కు ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని