SBI vs Post Office: రికరింగ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇలా...

పోస్టాఫీస్ ఐదేళ్ళ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాకు 5.8శాతం వార్షిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంది

Updated : 28 Jun 2021 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న ట‌ర్మ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి రిక‌రింగ్ డిపాజిట్లు‌ (ఆర్‌డీ). ఈ ఖాతాలో ముందుగా నిర్ణ‌యించిన మొత్తాన్ని, ముందుగా నిర్ణ‌యించిన వ్య‌వ‌ధుల్లో జ‌మ చేయాల్సి ఉంటుంది. నెల‌వారీగా చెల్లించాల్సిన వాయిదా మొత్తం ఒక్క‌సారి నిర్ణ‌యించిన త‌రువాత మార్చుకునే వీలులేదు. ఆర్‌డీ ఖాతాను బ్యాంకుల‌లో గానీ పోస్టాఫీసులో గానీ తెరవొచ్చు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇత‌ర బ్యాంకుల్లోనూ ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఎస్‌బీఐ vs పోస్ట్ ఆఫీస్

* ఎస్‌బీఐ సాధార‌ణ ప్రజ‌ల‌కు అందించే రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా వ‌డ్డీ రేట్లు 5 నుంచి 5.4 శాతం మ‌ధ్య‌ ఉంటాయి. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మ‌రో 50 బేసిస్ పాయింట్లు అధిక వ‌డ్డీ రేటు ఉంటుంది. ఈ వ‌డ్డీ రేట్లు 2021 జ‌న‌వ‌రి 8 నుంచి అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు త‌మ ఆర్‌డీ ఖాతాదారుల‌కు 5.8 శాతం వార్షిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తోంది. ఈ వ‌డ్డీ రేటు 2021 జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌ల్లో ఉంది.

ఒక సంవ‌త్స‌రం నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వేర్వేరు కాల‌ప‌రిమితి గ‌ల రిక‌రింగ్ డిపాజిట్లను ఎస్‌బీఐ అందుబాటులో ఉంచింది. పోస్టాఫీస్ 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి మాత్ర‌మే ఆర్‌డీ అందిస్తుంది. 

* ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను చెక్కు/ న‌గ‌దు ద్వారా తెర‌వొచ్చు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను న‌గ‌దు ద్వారా మాత్ర‌మే తెరిచే వీలుంది.

ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను తెర‌వొచ్చు. పోస్టాఫీసు ఆర్‌డీ ఖాతాను తెరిచేందుకు పోస్టాఫీసు బ్రాంచ్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. 

ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాలో క‌నీసం రూ.100తో ప్రారంభించి (రూ.110, రూ.120 ... చొప్పున 10 గుణిజాల‌లో‌) ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాను క‌నీసం రూ.10తో ప్రారంభించ‌వ‌చ్చు. 5 గుణిజాల్లో (రూ.15, రూ.20, రూ.25.. చొప్పున‌) ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఇందులో కూడా గ‌రిష్ఠ పరిమితంటూ ఏదీ లేదు.

* ఐదు సంవ‌త్స‌రాల పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. ఎస్‌బీఐ వ‌డ్డీ రేటు టెన్యూర్ ప్రాతిప‌దిక‌న మారుతుంది. 

ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేట్లు
ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్ల‌కు - 4.9 శాతం
రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్ల‌కు - 5.1 శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్ల‌కు - 5.3 శాతం
ఐదేళ్ల నుంచి ప‌దేళ్లలోపు డిపాజిట్ల‌కు - 5.4 శాతం

పోస్టాఫీస్..

పోస్టాఫీస్ ఐదేళ్ల రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాకు 5.8 శాతం వార్షిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తోంది. ఈ రేటు 2021 ఏప్రిల్‌ 1 నుంచి వ‌ర్తిస్తుంది. వ‌డ్డీని త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని