State Bank of India: ఎస్‌బీఐ వినియోగదారులా..? ఈ రెండు అప్‌డేట్స్‌ మీకోసమే!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటనలు చేసింది.

Updated : 24 Nov 2021 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటనలు చేసింది. ఒకటి పాన్‌-ఆధార్‌ అనుసంధానం కోసం కాగా.. రెండోది డిజిటల్‌ లావాదేవీల రుసుముల గురించి. ఈ మేరకు ట్విటర్‌లో ఆ వివరాలను పొందుపరిచింది.

ఎప్పటిలానే నిరంతరాయ బ్యాంకింగ్‌ సేవలను పొందేందుకు వెంటనే పాన్‌-ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయాలని వినియోగదారులకు ఎస్‌బీఐ సూచించింది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకుంటే.. పాన్‌ కార్డు పనిచేయకుండా పోతుందని పేర్కొంది. అలాంటి కార్డులను లావాదేవీల సమయంలో పొందుపరచొద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే వెంటనే పాన్‌-ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలని ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్రం 2022 మార్చి 31 వరకు పొడిగించింది. సాధారణ బ్యాంక్‌ అకౌంట్‌, డీమ్యాట్‌ ఖాతా తెరవాలన్నా, నగదు జమ చేయాలన్నా.. పాన్‌ తప్పనిసరన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేయని వారు incometax.gov.in వెబ్‌సైట్‌లోని అవర్‌ సర్వీసెస్‌లోకి వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు.

సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌దారుల డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి ఎస్‌బీఐ మరో ప్రకటన చేసింది. డిజిటల్‌ లావాదేవీలకు వారి నుంచి ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదని స్పష్టంచేసింది. రూపే డెబిట్‌ కార్డు, యూపీఐ పేమెంట్‌ లావాదేవీలపై 2020 జనవరి 1 నుంచి ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. 2017-2020 మధ్య జన్‌ధన్‌ ఖాతాదారుల నుంచి ఎస్‌బీఐ రూ.254 కోట్లు వసూలు చేసిందని, అందులో రూ.90 కోట్లు మాత్రమే వినియోగదారులకు రిఫండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలపై ఎస్‌బీఐ స్పందించింది. సీబీడీటీ ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్‌ 14 వరకు వసూలు చేసిన మొత్తాలను రిఫండ్‌ చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. అంతకుముందు వసూలు చేసిన ఛార్జీలు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించే చేసినట్లు వివరించింది. ప్రస్తుతానికి డిజిటల్‌ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టంచేసింది. ఏటీఎంల వద్ద నాలుగు నగదు లావాదేవీల వరకు ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని