కేవైసీ పేరుతో మోసాలు.. ఎస్‌బీఐ అలర్ట్‌!

కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింక్‌ల‌ను పంపించ‌దు. కాబ‌ట్టి అటువంటి లింక్‌ల‌ను క్లిక్ చేయ‌కూడ‌దు. 

Updated : 17 Jun 2021 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో పెరుగుతున్న మోసాల గురించి స్టేట్‌బ్యాక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న ఖాతాదారుల‌ను హెచ్చ‌రించింది. నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొందరు మోస‌గాళ్లు బ్యాంకు/ సంస్థ ప్ర‌తినిధిగా మేసేజ్ పంపి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ఎస్‌బీఐ తన ట్విటర్‌లో పేర్కొంది.

కొవిడ్‌ రెండో వేవ్‌ నేపథ్యంలో ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌డంతో ఖాతాదారులు బ్రాంచ్‌కు వ‌చ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌ను దృష్టిలో ఉంచుకుని కేవైసీ అప్‌డేట్‌కి కావ‌ల‌సిన ప‌త్రాల‌ను మెయిల్ ద్వారా గానీ, పోస్ట్ ద్వారా గానీ పంపేందుకు ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ ఇటీవ‌లే అనుమ‌తించింది. ఈ విధానంలో కేవైసీ అప్‌డేట్ చేసుకునేవారు కూడా అప్రమత్తంగా ఉండాల‌ని బ్యాంక్ సూచించింది.

మోసాల బారిన పడకుండా ఎస్‌బీఐ సూచనలు

* ఏదైనా లింక్‌ను క్లిక్‌ చేసేముందు ఆలోచించండి.

కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించ‌దన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

మీ మొబైల్ నంబర్‌, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.

రిపోర్ట్ చేయ‌డం ఎలా?
ఖాతాదారులు త‌మ బ్యాంక్ ఖాతాలో అన‌ధికార లావాదేవీలు జ‌రిగితే వెంట‌నే బ్యాంకుకు నివేదించాలి. ఇలాంటి లావాదేవీల‌ను గుర్తించిన వెంట‌నే 1800 425 3800, 1800 112 211 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. వారు సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్తారు.

ఏమిటీ కేవైసీ వెరిఫికేషన్‌?
వినియోగ‌దారుని వివ‌రాల‌ను తెలుసుకోవ‌డ‌మే కేవైసీ. ప్ర‌భుత్వం ఇచ్చిన గుర్తింపు ప‌త్రాల ఆధారంగా ఖాతాదారుల వివ‌రాలను బ్యాంక్‌ ధ్రువీకరించుకుంటుంది. ఎలాంటి మోసాలూ జ‌ర‌గ‌కుండా నిజ‌మైన ఖాతాదారుల‌ను గుర్తించేందుకు బ్యాంకులు అనుస‌రించే ప్రక్రియ ఇది. 
కేవైసీ అప్‌డేట్ చేయ‌డంలో విఫ‌లమైనప్పటికీ కొవిడ్‌ ఇబ్బందుల దృష్ట్యా వినియోగ‌దారుల ఖాతా లావాదేవీల‌పై 2021 డిసెంబర్‌ 31 వరకు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆర్‌బీఐ గత నెలలో బ్యాంకులు, ఇత‌ర ఫైనాన్షియ‌ల్ సంస్థ‌ల‌కు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని