Adani group: అదానీ గ్రూప్‌ కంపెనీలపై సెబీ దర్యాప్తు

అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టెండ్‌ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌద్రీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్‌లో చెప్పారు. నిబంధనల అమలు తీరుపై

Updated : 19 Jul 2021 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీలపై సెబీ దర్యాప్తు చేపట్టిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌద్రీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్‌లో వెల్లడించారు . నిబంధనల అమలు తీరుపై సెబీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లు అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలపై దృష్టిపెట్టాయన్నారు. కాకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాత్రం రోజువారీ షేర్ల ట్రేడింగ్‌, ఎఫ్‌పీఐ పాత్రపై దర్యాప్తు చేయడంలేదని మంత్రి వెల్లడించారు. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్‌ కంపెనీలు ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌ కంపెనీల షేర్లు ట్రేడవుతన్నాయి.

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేసినట్లు వార్తలు రావడంతో గత నెలలో కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. కొన్ని షేర్లు ‘లోయర్‌ సర్క్యూట్‌’ను తాకాయి. దీంతో అదానీ నికర సంపద 7.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.55వేల కోట్లు) మేర ఆవిరైపోయింది. ఈ కంపెనీల షేర్ల ధరలు ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లో ఒత్తిడికి గురికావటంపై ఇటీవల గౌతమ్‌ అదానీ స్పందిస్తూ, వాస్తవాలను వక్రీకరించటమే దీనికి కారణమన్నారు.

మారిషస్‌కు చెందిన ఆరు పెట్టుబడి సంస్థలు తమ పెట్టుబడి మొత్తాల్లో అధిక భాగం అదానీ గ్రూపు షేర్లలో పెట్టుబడి పెట్టడం, అందులో మూడు సంస్థల షేర్లను 'ఫ్రీజ్‌' చేశారనే ఆరోపణలు రావటంతో అదానీ షేర్ల ధరలు కుంగిపోయాయి. ఈ మూడు పెట్టుబడి సంస్థలు అదానీ గ్రూపు కంపెనీల్లో 5 బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో విదేశీ సంస్థలకు ఉన్న షేర్లను 'ఫ్రీజ్‌' చేశారనే నివేదికలు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో కూడినవి గౌతమ్ అదానీ అన్నారు. ఇప్పుడు తాజాగా పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటనతో మరోసారి ఆ గ్రూప్‌ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని