పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కేసులో శాట్‌ తీర్పుపై సుప్రీం కోర్టుకు సెబీ

తమ కంపెనీ రూ.4,000 కోట్ల ఈక్విటీ మూలధన సమీకరణ ప్రణాళిక విషయంలో సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన తీర్పుపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గురువారం వెల్లడించింది.

Updated : 03 Sep 2021 09:00 IST

దిల్లీ: తమ కంపెనీ రూ.4,000 కోట్ల ఈక్విటీ మూలధన సమీకరణ ప్రణాళిక విషయంలో సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన తీర్పుపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గురువారం వెల్లడించింది. గత నెల 9న శాట్‌లోని ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ ఇచ్చిన తీర్పులో అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయని పేర్కొనడంతోనే, సెబీ తదుపరి చర్యలకు దిగింది. గత జూన్‌ 21న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి తీర్పు వచ్చే వరకు కొనసాగుతాయని శాట్‌ పేర్కొంది. నిధుల సమీకరణ ప్రణాళికకు సంబంధించి వాటాదార్ల ఓటింగ్‌ ఫలితాలను వెల్లడించకుండా ఈ ఉత్తర్వులు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ను నిరోధిస్తాయి. అమెరికాకు చెందిన కార్లైల్‌ గ్రూప్‌ నేతృత్వంలోని కొద్దిమంది పెట్టుబడిదార్లకు ప్రాధాన్య వాటాలు, వారెంట్లను జారీ చేయడం ద్వారా రూ.4,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రత్యేక తీర్మానం చేసి వాటాదార్ల ఆమోదం కోసం ఓటింగ్‌ నిర్వహించింది. శాట్‌ తీర్పుపై సెబీ సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. సెబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కంపెనీ పరిశీలిస్తోందని కూడా వెల్లడించింది.


యాపిల్‌పై భారత్‌లో పెత్తందారీ నిరోధక కేసు

అమెరికా కంపెనీ యాపిల్‌పై భారత్‌లో కేసు నమోదైంది. యాపిల్‌ విధిస్తున్న 30 శాతం వరకు ఫీజు వల్ల పోటీతత్వంపై భారం పడుతోందని.. యాప్‌ డెవలపర్లతో పాటు వినియోగదార్లకు వ్యయాలు పెరుగుతున్నాయని ఒక లాభాపేక్ష రహిత సంస్థ దావా వేసింది. యాప్‌ మార్కెట్లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని అనుచితంగా ఉపయోగిస్తూ డెవలపర్లు కచ్చితంగా కంపెనీకి చెందిన ప్రొప్రైటరీ ఇన్‌-యాప్‌ కొనుగోలు వ్యవస్థనే వినియోగించేలా చేస్తోందని ఆ సంస్థ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆంగ్ల పత్రిక ఒకటి విశ్వసనీయ వర్గాలు, పత్రాలను ఉటంకిస్తూ తన కథనంలో పేర్కొంది. ఇదే తరహా ఆరోపణలతో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లోనూ యాపిల్‌పై కేసు నడుస్తోంది. పెయిడ్‌ డిజిటల్‌ కంటెంట్‌ పంపిణీ కోసం 30 శాతం ఇన్‌-యాప్‌ ఫీజును విధిస్తున్న యాపిల్‌పై ఈయూలో అక్కడి నియంత్రణ సంస్థలు గతేడాది దర్యాప్తును మొదలుపెట్టాయి కూడా. కాగా, భారత్‌లో ఈ కేసును పెద్దగా పేరులేని ఒక లాభాపేక్ష రహిత సంస్థ దాఖలు చేసింది. ‘ప్రస్తుతం యాపిల్‌ విధిస్తున్న 30 శాతం కమీషన్‌ వల్ల కొంత మంది యాప్‌ డెవలపర్లు అసలు మార్కెట్లోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఇది వినియోగదార్లకు మంచిది కాద’ని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కు దాఖలు చేసిన పిటిషన్‌లో ఆ సంస్థ పేర్కొంది. కాగా, యాపిల్‌ కానీ, సీసీఐ కానీ దీనిపై స్పందించలేదు. రాబోయే కొద్ది వారాల్లో ఈ కేసును సీసీఐ సమీక్షిస్తుందని.. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయడం లేదా ఆరోపణల్లో నిజం లేదని భావిస్తే కేసును కొట్టివేయడం చేస్తుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలిపింది.


 

జెట్‌ పరిష్కార ప్రణాళికను రద్దు చేయండి

ఎన్‌సీఎల్‌ఏటీకి పీఎన్‌బీ విజ్ఞప్తి

 21న విచారణ

దిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిష్కార ప్రణాళికను పక్కన పెట్టాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)కు ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) విజ్ఞప్తి చేసింది. ఆ ప్రణాళికలో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించింది. భారీ అప్పుల కారణంగా 2019లో జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా పరిష్కారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దివాలా ప్రక్రియలో పరిష్కార వృత్తినిపుణుడు(ఆర్‌పీ) రుణదాతల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శించారని జెట్‌కు ఆర్థిక రుణదాతగా ఉన్న పీఎన్‌బీ ఆరోపించింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే దివాలా కోర్టు పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపిందనీ పేర్కొంది. పరిష్కార ప్రణాళిక అమలుపై స్టే ఇవ్వాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీకి ఆ బ్యాంకు విజ్ఞప్తి చేసింది. దివాలా స్మృతి నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. ఆర్‌పీ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది. ఒక ఏడాది అంతరంతో రూ.950 కోట్ల నుంచి రూ.740 కోట్లకు పరిష్కార ప్రణాళిక ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. పీఎన్‌బీ ఆరోపణలను పీఆర్‌ వ్యతిరేకించారు. పీఎన్‌బీ దాఖలు చేసిన విజ్ఞప్తిపై, ప్రణాళికపై స్టే ఇచ్చే అంశంపై ఎన్‌సీఎల్‌ఏటీ సెప్టెంబరు 21న విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు