రుణ విభాగంలో ఫ్లెక్సీ క్యాప్‌..

పీపీఎఫ్‌ఏఎస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ‘పరాగ్‌ పరీఖ్‌ కన్సర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌’ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 21న ముగుస్తుంది. ఇది ప్రధానంగా రుణ, మనీ మార్కెట్

Published : 07 May 2021 00:22 IST

పీపీఎఫ్‌ఏఎస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ‘పరాగ్‌ పరీఖ్‌ కన్సర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌’ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 21న ముగుస్తుంది. ఇది ప్రధానంగా రుణ, మనీ మార్కెట్ పత్రాల్లో పెట్టుబడులు పెట్టటం ద్వారా మదుపరులకు స్ధిరమైన రాబడి తెచ్చిపెట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కొంత మొత్తాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పత్రాలు, రీట్- ఇన్విట్ లలోనూ పెట్టుబడిగా పెడుతుంది. ఎన్‌ఎఫ్‌ఓ ద్వారా కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి.  ఈ పథకం పనితీరును క్రిసిల్‌ హైబ్రీడ్‌ 85 + 15 కన్సర్వేటివ్‌ ఇండెక్స్‌ ట్రై. ఆధారంగా పోల్చి చూస్తారు. దీనికి రాజీవ్‌ టక్కర్‌, రౌనక్‌ ఓంకార్‌, రాజ్‌ మెహతా ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
పీపీఎఫ్‌ఏఎస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణలో పరాగ్‌ పరీఖ్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ అనే ఫండ్‌ పథకం ఉంది. ఇది పూర్తిగా ఈక్విటీ పథకం. ఇదే పద్ధతిని రుణ విభాగంలో ఆవిష్కరించాలని ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నమే ‘పరాగ్‌ పరీఖ్‌ కన్సర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌’. దీన్లో ఫండ్‌ మేనేజర్‌కు పోర్ట్‌ఫోలియోను ఎంచుకునేందుకు ఎనలేని స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ, పెట్టుబడులను మార్చుతూ అధిక ప్రతిఫలం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అంతేగానీ గిరి గీసుకొని ఒకే పద్ధతిలో పెట్టుబడులు పెడతాం, ఎంత ప్రతిఫలం వస్తే... అంత వస్తుంది- అనుకునే విధానం కాదు. ఇది ప్రధానంగా డెట్ ఫండ్‌ అయినప్పటికీ, 25 శాతం వరకూ నిధులను ఈక్విటీలో, 10 శాతం వరకూ రీట్, ఇన్విట్లలో పెట్టుబడి పెట్టే ప్రతిపాదన ఉంది.  అందువల్ల దాదాపు అన్ని రకాలైన పెట్టుబడి అవకాశాలు... అంటే, ఈక్విటీ, రుణపత్రాలు, రియల్‌ ఎస్టేట్ పెట్టుబడులు (రీట్, ఇన్విట్ ద్వారా...) చేసే మిశ్రమ మ్యూచువల్‌ ఫండ్‌ పథకంగా ‘పరాగ్‌ పరీఖ్‌ కన్సర్వేటివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌’ను అభివర్ణించవచ్చు. ఇటువంటి పథకాల ఉంచి ఒక మోస్తరు లాభాలు ఆర్జించే అవకాశం మదుపరులకు ఉంటుంది. రిస్కు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు.

తక్కువ నష్టభయంతో మదుపు...

చేతన పెట్టుబడుల విధానాన్ని (ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌) ఇష్టపడే వారికి అనువైన ఒక మ్యూచువల్‌ పండ్‌ పథకాన్ని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. అదే ఎస్‌బీఐ ఎంఎఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం పనితీరు నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ను కొలమానంగా పెట్టుకున్నారు. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 11. ఎన్‌ఎఫ్‌ఓ లో కనీస పెట్టుబడి రూ.5,000.
నిఫ్టీ 100 కంపెనీలకు చెందిన షేర్లలో, నిఫ్టీ 50 షేర్ల తర్వాత ఉన్న 50 కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ లో ఉంటాయి. గత ఏడాది కాలంలో ఈ ఇండెక్స్‌ 50 శాతం ప్రతిఫలాన్ని ఆర్జించింది. గత ఏడాది కాలంలో స్టాక్‌మార్కెట్ బాగా కోలుకోవటం దీనికి ప్రధాన కారణం. కానీ ప్రతి ఏడాదీ ఇలాగే ఉంటుందని అనుకోవటానికి వీల్లేదు. ఇప్పటికే వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నుంచి నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్లు ఉన్నాయి. తక్కువ రిస్కుతో స్ధిరమైన లాభాలు ఆశించే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ పథకాల్లో ఫండ్‌ మేనేజర్‌ క్రియాశీలత తక్కువగా ఉంటుంది. ‘పెట్టుబడుల విధానం’ స్పష్టంగా నిర్దేశించి ఉంటుంది కాబట్టి పోర్ట్‌ఫోలియోను తరచుగా మార్చటం అనేది ఉండదు. అందువల్ల నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ప్రతిఫలానికి దగ్గరగా ఈ పథకాల్లో ప్రతిఫలం ఉంటుంది. పెద్దగా రిస్కు ఇష్టపడని, ఒక మోస్తరు లాభాలు చాలు అనుకునే వారికి ఎస్‌బీఐ ఎంఎఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ అనుకూలం. దీనికి ఫండ్‌ మేనేజర్‌గా రవి ప్రకాశ్‌ శర్మ వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని