సుర‌క్షితంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్

ముంగిట్లో బ్యాంకింగ్ మంచి ప‌రిణామ‌మే అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ర‌క్ష‌ణ కూడా ఉంటుంది...

Published : 15 Dec 2020 21:58 IST

తీరిక లేని జీవితాల్లో ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు చ‌క్క‌టి ప‌రిష్కార‌మే ఆన్‌లైన్ బ్యాంకింగ్‌. ఇత‌రుల‌కు డ‌బ్బులు ఖాతాలో జ‌మ‌చేయ‌టానికో, బ్యాంకింగ్‌ స‌మ‌స్యలుంటే ఫిర్యాదు చేసేందుకో చాలా మందికి కుద‌ర‌క‌పోవ‌చ్చు. పైగా బ్యాంకు ప‌నివేళ‌లు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కే. అదే స‌మ‌యంలో మ‌న‌కూ ఆఫీసుల్లో ప‌ని ఉంటుంది. సెల‌వు పెట్టి ప్ర‌తి సారీ బ్యాంకుకు వెళ్ల‌లేం క‌దా! స‌రిగ్గా ఇలాంటి అవ‌స‌రాల‌కోస‌మే బ్యాంకింగ్ లో ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేశారు.

ఇంట‌ర్నెట్‌తో అనుసంధాన‌మున్న కంప్యూట‌ర్‌/మొబైల్ ద్వారా ఎన్నో బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపులు, షాపింగ్, సినిమా, బ‌స్ టికెట్ల కొనుగోళ్లు త‌దిత‌రాలు జ‌ర‌ప‌వ‌చ్చు. లావాదేవీ చేసే స‌మ‌యంలో ఖాతా వివ‌రాలు న‌మోదుచేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే అద‌నుగా ఆన్‌లైన్‌లో పొంచి ఉన్న ప్ర‌మాదాలు ఖాతా వివ‌రాల‌పై దాడి చేసి, సొమ్మును అప‌హ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాయి. ఆన్‌లైన్ లావాదేవీ నెరిపేట‌ప్పుడు ఒళ్లంతా క‌ళ్లు చేసుకొని ఉండాల్సిందే. లేక‌పోతే చిక్కుల్లో ప‌డిపోవ‌డం ఖాయం.

ఇంట‌ర్నెట్ కెఫెల్లో జాగ్ర‌త్త‌

ఇంట‌ర్నెట్ కెఫెల్లో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ చేయ‌కుండా ఉండేందుకు వీలైనంత మేర‌ ప్ర‌య‌త్నించాలి. ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చేయాల్సి వ‌స్తే ప‌ని పూర్త‌యిన వెంట‌నే పాస్‌వ‌ర్డ్‌ను మార్చుకోవ‌డం మంచిది. లావాదేవీ పూర్త‌యిన త‌ర్వాత బ్రౌజింగ్ హిస్ట‌రీ, క్యాచీ మొత్తం డిలీట్ చేయాలి. లాగిన్ అయ్యేట‌ప్ప‌డు Remember Password అని అడుగుతూ ఉంటుంది. Never అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ప‌ని పూర్తి చేసుకొని లాగిన్‌లోనే ఉంచి బ్రౌజ‌ర్‌ను నేరుగా మూసివేయ‌ద్దు. లాగ్ అవుట్ చేయండి.

వెబ్‌సైట్ చిరునామా స‌రిచూసుకోండి

బ్యాంకు సంబంధిత వెబ్ చిరునామా అక్ష‌రాల‌ను క‌చ్చితంగా చూసుకోవాలి. త‌ప్పుడు వెబ్‌సైట్ల‌తో మీ బ్యాంకు ఖాతా వివ‌రాలు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగు చేసేట‌పుడు ఇత‌ర వెబ్‌సైట్లు తెరిచి స‌ర్ఫింగ్ చేయ‌డంలాంటివి మానుకోండి. మెయిల్స్ పంప‌డం వంటివి ఆ స‌మ‌యంలో చేయ‌కండి.
వెబ్ సైటు అడ్ర‌స్ ముందు https: అని ఉంటే భ‌ద్ర‌త‌తో ఉంద‌ని భావించాలి.

ఫిషింగ్ వ‌ల‌లో ప‌డ‌కండి

ఫోన్ ద్వారా మోస‌పుచ్చి వ్య‌క్తిగ‌త ఆర్థిక స‌మాచారం రాబ‌ట్టి గుర్తింపు వివ‌రాల‌ను దొంగ‌లించ‌డాన్నే ఫిషింగ్ అంటారు. బ్యాంకు మెయిల్ ఐడీని పోలినట్టుగానే కొన్ని మెయిల్ ఐడీలు వ‌స్తాయి. వీటిల్ల‌నో కొన్ని లింకులు పంపుతారు. ఆ లింకుల‌పై క్లిక్ చేసి వైబ్ సైటు తెరిస్తే మీ బ్యాంకు ఖాతా,ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని అడుగుతుంది.

లాట‌రీ గెలిచారా?

మీరు లాట‌రీలో పెద్ద మొత్తం గెల్చుకున్నార‌ని అప‌రిచిత‌ వ్య‌క్తుల‌నుంచి మెయిల్స్ వ‌స్తాయి. అందులో మీ పేరు బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివ‌రాల‌ను అడుగుతారు. అలాంటి వాటికి స్పందించ‌కండి. భారీ మొత్తంలో లాట‌రీ త‌గిలింద‌ని, అయితే ఆ సొమ్ముపై ఛార్జీల రూపేణ కొంత డిపాజిట్ చేస్తేనే లాట‌రీ సొమ్ము రిలీజ్ చేయ‌గ‌ల‌మ‌ని, కొంత మొత్తాన్ని బ‌దిలీ చేయాల్సిందిగా అవ‌త‌లి వ్య‌క్తులు కోర‌తారు. మ‌నం దాన్ని నిజంగానే న‌మ్మి డ‌బ్బులు జ‌మ‌చేశామో. ఇక మోస‌పోయిన‌ట్టే. ఇలాంటి ఉదంతాలు రోజూ ప‌త్రిక‌ల్లో మ‌న‌కు తార‌స‌ప‌డుతూనే ఉంటాయి. లాట‌రీ మెయిళ్ల‌కు స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిది.

బ్యాంకు ఉద్యోగుల‌మంటూ బురిడీ

వివిధ మార్గాల ద్వారా ఖాతా సంఖ్య‌ను, ఆన్‌లైన్‌ లావాదేవీ స‌మాచారాన్ని మోస‌గాళ్లు సేక‌రిస్తారు. ఒక్కోసారి బ్యాంకు ఉద్యోగిలాగానో, ఆర్బీఐ ప్ర‌తినిధి అనో చెప్పి ప‌రిచ‌యం చేసుకుని భ‌ద్ర‌తా ప్ర‌క్రియ‌లో భాగంగా ఫోన్ చేసిన‌ట్లు న‌మ్మ‌బ‌లుకుతారు. నెట్ బ్యాంకింగ్ యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ (పిన్) వంటివి అడుగుతారు. పొర‌పాటున వాటిని వెల్ల‌డిస్తే మీ ఖాతా భ‌ద్ర‌త ఇర‌కాటంలో పెట్టిన‌ట్టే.

వ్య‌క్తిగ‌త ర‌హ‌స్య స‌మాచారాన్ని బ్యాంకు సిబ్బందితో స‌హా ఎవ‌రితోనూ పంచుకోవ‌ద్దు.

  • నెట్ బ్యాంకింగ్ పాస్ వ‌ర్డ్ / యూజ‌ర్ ఐడీ
  • ఫోన్ బ్యాంకింగ్ పాస్ వ‌ర్డ్
  • ఏటీఎమ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పిన్

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సుర‌క్షింతంగా జ‌రిపేందుకు యాంటి వైర‌స్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. సేఫ్ బ్రౌజింగ్ ఆప్ష‌న్ ఎంచుకోండి. దీని వ‌ల్ల మీరు టైప్ చేసిన వివ‌రాలు కీలాగ‌ర్స్ లాంటివి త‌స్క‌రించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. బ్రౌజింగు చేసే ముందు ఫైర్ వాల్స్ ను త‌ప్ప‌క ఎనేబుల్ చేయాలి. ఏదైనా వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేసేట‌పుడు మ‌భ్య‌పెట్టే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను క్లిక్ చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని