Salary Increments: 2022లో 8.6% వేతన పెంపు.. ఐటీలో అత్యధికం!

2022లో వేతనాలు సగటున 8.6 శాతం పెరుగుతాయని డెలాయిట్‌ సర్వే తేల్చింది. సర్వేలోని ఇతర ముఖ్యాంకాలు..

Published : 20 Sep 2021 14:21 IST

డెలాయిట్‌ సర్వేలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల వేతన పెంపు వచ్చే ఏడాది నాటికి కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకుంటుందని ఓ ప్రముఖ సర్వే అంచనా వేసింది. 2022లో వేతనాలు సగటున 8.6 శాతం పెరుగుతాయని తెలిపింది. కొవిడ్‌ ఆంక్షలతో సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు 25 శాతం సంస్థలు 2022 నాటికి రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి. కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల నేపథ్యంలో వేతన పెంపు సగటున 4.4 శాతానికి పడిపోయింది. వ్యాపార రంగం పుంజుకుంటుండడంతో ప్రస్తుతం పెంపు సగటున 8 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికి అది మరింత పెరిగి 8.6 శాతానికి చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది.

సర్వేలోని ఇతర కీలకాంశాలు...

* 2022లో ఐటీ సెక్టార్‌లో వేతనాలు అధికంగా పెరగనున్నాయి. కొన్ని కంపెనీలు రెండంకెల పెంపును సైతం ప్రతిపాదించనున్నాయి. తర్వాత లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెరుగుతాయి. రిటైల్‌, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, మౌలిక, స్థిరాస్తి రంగంలో మాత్రం వేతనాల పెంపు మందగించనుంది.

* నైపుణ్యం, పనితీరును బట్టి సంస్థలు పెంపును నిర్ణయించనున్నాయి. సగటు పనితీరు కనబరిచిన వారితో పోలిస్తే.. బాగా రాణించిన వారికి 1.8 రెట్లు అధిక వేతనం అందవచ్చు.

* 2021లో 12 శాతం మందికి పదోన్నతులు లభించాయి. 2020లో ఇది 10 శాతంగా ఉండింది. దాదాపు 78 శాతం కంపెనీలు నియామకాలను కొవిడ్‌ మునుపటి స్థాయిలో చేపడుతున్నాయి.

* దాదాపు 12 శాతం కంపెనీలు పెంచిన వేతనాలకు అనుగుణంగా భత్యాలు, ఇతర ప్రయోజనాలను సవరించాయి. అలాగే కొవిడ్‌ నేపథ్యంలో 60 శాతం సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలనూ సవరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని