మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపు ఎలా?

మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు వివిధ ఆదాయ ప‌న్ను చ‌ట్టాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువ‌ల్ ఫండ్లు, స్థిరాస్తి, స్టాక్‌లు, బంగారం లేదా బాండ్ల‌ను కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ ధ‌ర‌కు ..

Published : 25 Dec 2020 19:05 IST

మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు వివిధ ఆదాయ ప‌న్ను చ‌ట్టాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువ‌ల్ ఫండ్లు, స్థిరాస్తి, స్టాక్‌లు, బంగారం లేదా బాండ్ల‌ను కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే వ‌చ్చిన రాబ‌డిని మూల‌ధ‌న రాబ‌డి అంటారు. ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం, మూల‌ధ‌న రాబ‌డి, వ‌డ్డీ, డివిడెండు వేర్వేరుగా ప‌రిగ‌ణిస్తారు. మీ పెట్టుబ‌డులు, పొదుపు, ఆస్తులు కాల‌ప‌రిమితి ఆధారంగా వ‌డ్డీ లేదా డివిడెండ్ల‌ను వేర్వేరుగా అందిస్తాయి. కానీ మూల‌ధ‌న రాబ‌డి అంటే మీరు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్మ‌డిన‌ప్పుడు వ‌చ్చిన లాభం.

మూల‌ధ‌న రాబ‌డిని అందించే ఆస్తులు:స్థిరాస్తి లేదా ఇత‌ర ఆస్తులు, వ్యాపారాలు, బంగారం, స్టాక్‌లు వంటివి మూల‌ధ‌న రాబ‌డిని అందిస్తాయి. అయితే వీటిని మూల‌ధ‌న ఆస్తులుగా గుర్తించ‌రు. వీటిని అమ్మితే వ‌చ్చిన డ‌బ్బును మూల‌ధ‌న‌ రాబ‌డిగా ప‌రిగ‌ణించ‌రు. స్టాక్ లేదా ఏదైనా విలువైన‌ లోహాలు వాణిజ‌న్య ప‌రంగా ఉప‌యోగించేవి. వ్య‌క్తిగ‌త వ‌స్తువులు, వ‌స్ర్తాలు, ఫ‌ర్నీచ‌ర్‌, వ్య‌వ‌సాయ భూమి వంటివి ఇందులోకి రావు. మున్సిపాలిటీ ప‌రిధిలోకి రాని, గ్రామీణ పొలాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు.

మూల‌ధ‌న ఆస్తుల‌ ర‌కాలు:ఆస్తులు త‌మ వ‌ద్ద ఎంత‌కాలం ఉన్న‌దాన్ని బ‌ట్టి స్వ‌ల్ప కాలీక‌, దీర్ఘ‌కాలీక ఆస్తులుగా లెక్కిస్తారు. స్వ‌ల్ప కాలీక ఆస్తుల‌ను ప‌రిశీలిస్తే బాండ్లు, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు, బంగారం లేదా గోల్డ్ బాండ్లు వంటివి 36 నెల‌లు, అంత‌కంటే త‌క్కువ కాలం మీ వ‌ద్ద ఉంటే దానిని స్వ‌ల్ప కాలీక ఆస్తిగా గుర్తిస్తారు. అంటే ఇక్క‌డ రెండు ర‌కాలుగా ఉన్నాయి. చ‌ల‌నం లేని ఆస్తులు అంటే భూమి, ఇళ్లు, స్థిరాస్తి వంటివి 24 నెల‌లు లేదా అంత‌కంటే త‌క్క‌వ, అదే ఈక్విటీ పెట్టుబ‌డులు అయితే 12 నెల‌లు అంత‌కంటే త‌క్కువ‌గా ఉంటే ఇవి స్వ‌ల్ప‌కాలీకం కింద‌కి వ‌స్తాయి. అంత‌కంటే ఎక్కువ‌కాలం ఉంటే అవి దీర్ఘ‌కాలీక పెట్టుబ‌డుల కింద‌కు వ‌స్తాయి. బ‌హుమ‌తి రూపంలో లేదా వారస‌త్వంగా ఏదైనా ఆస్తి మీకు ల‌భిస్తే అది కూడా ఎంత‌కాలం మీ వ‌ద్ద ఉందన్న దానిపై ఆధార‌ప‌డి రాబ‌డి లెక్కిస్తారు.

ప‌న్ను వ‌ర్తింపు:ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం, మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని ఇత‌ర ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం, వేర్వేరు ఆస్తుల‌పై వేర్వేరుగా ప‌న్ను విధానాలు ఉంటాయి. దీర్ఘ‌కాలీక మూల‌ధ‌న ఆస్తుల నిక‌ర లాభంపై 20.8 శాతం ప‌న్ను, ఈక్విటీ లాభంపై రూ.ల‌క్ష కంటే ఎక్కువ‌గా ఉన్న ఈక్విటీ లాభంపై 10.4 శాతం ప‌న్ను విధిస్తారు. స్వ‌ల్ప‌కాలీక మూల‌ధ‌న ఆస్తిలో లాభాలు మొత్తం ఆదాయంతో క‌లిపి వ్య‌క్తిగ‌త ప‌న్ను శ్లాబు ప్ర‌కారం ప‌న్ను వ‌సూలు చేస్తారు. అదే ఈక్విటీల‌లో స్వ‌ల్ప‌కాలిక రాబ‌డిపై 15.6 శాతంగా ఉంటుంది.

మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపు:స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపున‌కు అవ‌కాశం లేదు. అయితే వివిధ శ్లాబులు, సెక్ష‌న్‌ల ప్ర‌కారం మూల‌ధ‌న రాబ‌డిని తిరిగి ఆస్తి కొనుగోలుకు వినియోగిస్తే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సెక్ష‌న్ 54:ఈ సెక్ష‌న్ ప్ర‌కారం, ఇంటిని అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుతో మ‌రో ఆస్తిని కొనుగోలు చేస్తే ప‌న్ను మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను మిన‌హాయింపును కోర‌వ‌చ్చు. ఆస్తిని విక్ర‌యించే ఏడాదికి ముందు లేదా అమ్మిన రెండేళ్ల త‌ర్వాత కొన‌గోలు చేస్తే ఇది వ‌ర్తిస్తుంది . ఒక‌వేళ నిర్మాణంలో ఉంటే మూడేళ్ల వ‌ర‌కు గ‌డువు ఉటుంది.

సెక్ష‌న్ 54ఈసీ:ఆస్తిని విక్ర‌యించగా వ‌చ్చిన రాబ‌డితో ఎన్‌హెచ్ఏఐ లేదా ఆర్ఈసీ విక్ర‌యించే బాండ్ల‌ను కొనుగోలు చేస్తే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

సెక్ష‌న్ 54 ఎఫ్: ఇంటిని కొనుగోలు చేసేందుకు మ‌రో ఆస్తిని అమ్మ‌గా వ‌చ్చిన మొత్తం సొమ్మును వినియోగిస్తే ప‌న్ను త‌గ్గింపు ఉంటుంది. అయితే ఆస్తి కొనుగోలు చేసేందుకు మొత్తం లాభాన్ని వినియోగించ‌కుండా కొంత మొత్త‌మే ఖ‌ర్చు చేస్తే దానిపై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మిగ‌తా రాబ‌డిపై దీర్ఘ‌కాలీక మూల‌ధ‌న రాబ‌డి ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

క్యాపిట‌ల్ గెయిన్స్ డిపాజిట్ ఖాతా ప‌థ‌కం:  సెక్ష‌న్ 54, సెక్ష‌న్ 54ఎఫ్ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు పొందాలంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. అయితే దీనిపై కూడా పైన తెలిపిన ప్రకార‌మే ప‌న్ను త‌గ్గింపున‌కు కాల‌ప‌రిమితి ఉంటుంది. కానీ మ‌రో ఆస్తిని కొనుగోలు చేయ‌డం ద్వారా ప‌న్ను త‌గ్గింపుతో పాటు మ‌రో ఆస్తిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని