‘ ఫ్లిప్‌కార్ట్‌ లీప్‌’ కోసం ఎనిమిది అంకురాల ఎంపిక

దేశంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించిన యాక్సిలరేటర్‌ కార్యక్రమం ‘ఫ్లిప్‌కార్ట్‌ లీప్‌’. తొలి దశలో 8 అంకురాలను ఎంపిక చేసినట్లు మంగళవారం సంస్థ తెలిపింది. ఈ సంస్థలన్నింటికీ ఈక్విటీ గ్రాంటుగా 25,000 డాలర్లు

Updated : 13 Jan 2021 10:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించిన యాక్సిలరేటర్‌ కార్యక్రమం ‘ఫ్లిప్‌కార్ట్‌ లీప్‌’. తొలి దశలో 8 అంకురాలను ఎంపిక చేసినట్లు మంగళవారం సంస్థ తెలిపింది. ఈ సంస్థలన్నింటికీ ఈక్విటీ గ్రాంటుగా 25,000 డాలర్లు (సుమారు రూ.18.75 లక్షలు) అందించనుంది. గత ఏడాది ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఐదు విభాగాల్లో మొత్తం 920 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివిధ దశల్లో వడపోత అనంతరం ఏఎన్‌ఎస్‌ కామర్స్‌, ఎంట్రోపిక్‌ టెక్‌, ఫాషింజా, గల్లీ నెట్‌వర్క్‌, పిగ్గీ, ట్యాగ్‌బాక్స్‌ సొల్యూషన్స్‌, అన్‌బాక్స్‌ రోబోటిక్స్‌, వోకస్‌ టెక్నాలజీలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ అంకురాలకు 16 వారాల పాటు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, ఇతర పరిశ్రమల నిపుణులతో వివిధ అంశాలపై మెంటార్‌షిప్‌ ఉంటుందని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ లీప్‌ ద్వారా సరైన అంకురాలను ప్రోత్సహించి, వినియోగదారులకు మంచి పరిష్కారాలను అందించడంతో పాటు, పరిశ్రమకు విలువ జోడించేలా చూస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్రొడక్ట్‌ స్ట్రాటెజీ అండ్‌ డెవలప్‌మెంట్‌) నరేన్‌ రావుల పేర్కొన్నారు.

40% పెరిగిన టాటా ఎలెక్సి లాభం
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో టాటా ఎలెక్సి రూ.105.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.75.4 కోట్లతో పోలిస్తే ఇది 39.5 శాతం అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.423.4 కోట్ల నుంచి 12.7 శాతం పెరిగి రూ.477.1 కోట్లకు చేరింది. ‘పరిశ్రమ పరంగా, భౌగోళికంగా మా కంపెనీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. ఆదాయం, లాభంలో బలమైన వృద్ధి సాధించాం. త్రైమాసిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధి సాధించాం. నిర్వహణ మార్జిన్ల పరంగా చూసినా, పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నాం. మా ఆరోగ్య సంరక్షణ వ్యాపారంతో పాటు మీడియా, కమ్యూనికేషన్స్‌ వ్యాపారాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయ’ని టాటా ఎలెక్సి సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ రాఘవన్‌ వెల్లడించారు. 2020 డిసెంబరు నాటికి సంస్థలో 6,816 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
* బీఎస్‌ఈలో షేరు 1.41 శాతం నష్టంతో రూ.2,087.60 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని