Stock Market: మార్కెట్లను వెంటాడుతున్న ఒమిక్రాన్‌ భయాలు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి......

Published : 27 Dec 2021 09:43 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. దేశీయంగానూ కేసుల పెరుగుదలతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు విధించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, బ్రిటన్‌ మార్కెట్లకు నేడు సెలవు. క్రిస్మస్‌ నేపథ్యంలో శుక్రవారం మూతపడిన అమెరికా మార్కెట్లు తిరిగి నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. 

ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 281 పాయింట్ల నష్టంతో 56,843 వద్ద.. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 16,921 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్, విప్రో, టాటా స్టీల్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌‌: ఆర్‌బీఎల్‌ బ్యాంకులో పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నాయని ఆరోపిస్తూ, బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య ఏఐబీఈఏ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) విశ్వవీర్‌ అహూజా బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈఓగా రాజీవ్‌ అహూజా (ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌)ను నియమించినట్లు బ్యాంకు తెలిపింది.

* జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా‌: ఇండోనేషియాలోని మెడన్‌లో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్మాణం నిమిత్తం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నెదర్లాండ్స్‌, అంగ్‌కసా పురా-II మధ్య ఒప్పందం కుదిరింది.

* వేదాంత: సంస్థ అవుట్‌లుక్‌ను ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చి ‘స్టేబుల్‌’ నుంచి ‘పాజిటివ్‌’కు మార్చింది.

* స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా: సంస్థ వనరుల్ని మరింత ప్రభావవంతంగా వినియోగించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై నేడు సమీక్ష నిర్వహించనుంది.

* ఐనాక్స్‌ లీజర్‌: హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉన్న 900 సీట్ల సామర్థ్యం గల మల్టీప్లెక్స్‌ థియేటర్‌ కమర్షియల్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

* వన్‌97కమ్యూనికేషన్స్‌(పేటీఎం): పేటీఎం లెండింగ్‌ సీఈఓ భవేశ్‌ గుప్తాకు పదోన్నతి లభించినట్లు పేటీఎం వెల్లడించింది. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఇకపై ఆఫ్‌లైన్‌ చెల్లింపుల విభాగానికీ గుప్తా నాయకత్వం వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ప్రోడక్ట్‌, టెక్నాలజీ, బిజినెస్‌ పదవులకు 30 సీనియర్‌ ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేటీఎం పేర్కొంది. ఆఫ్‌లైన్‌ చెల్లింపుల వ్యాపారంలో రుణాలతో మరింత బలోపేతమయ్యామని, 2.3 కోట్ల మంది వ్యాపారులకు రుణ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించింది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని