Stock market: ‘బేర్‌’మన్న మార్కెట్‌.. ఇన్వెస్టర్లకు చుక్కలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. బుల్‌ రంకెలు వేయడం, అప్పుడప్పుడూ బేర్‌ ఓసారి తొంగి చూడడం మాత్రమే తెలిసిన మదుపరికి.. బేర్‌ ఒక్కసారి ఒళ్లు విరుచుకుని మీదపడితే ఎలా ఉంటుందో రుచి చూపించింది.

Updated : 20 Dec 2021 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. బుల్‌ రంకెలు వేయడం, అప్పుడప్పుడూ బేర్‌ ఓ సారి తొంగి చూడడం మాత్రమే తెలిసిన మదుపరికి.. బేర్‌ ఒక్కసారి ఒళ్లు విరుచుకుని మీదపడితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. భారీ నష్టాలు గతంలో చూసిన వారికి ఇది మరో అనుభవమే అయినా, కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టిన వారికి నిజంగా గట్టి షాకే. ఒమిక్రాన్‌ కేసులు, లాక్‌డౌన్‌ భయాలు, ఫెడ్‌ నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ఓ దశలో 1800 పాయింట్ల మేర కోల్పోయిన సెన్సెక్స్‌ చివర్లో కాస్త కోలుకుని 1189 పాయింట్ల నష్టంతో ముగియడం సగటు మదుపరికి ఊరటనిచ్చే అంశం. దాదాపు అన్ని రంగాల షేర్లూ కుదేలైనా బీఎస్‌ఈలో ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు రాణించడం విశేషం.

ఉదయం 56,517 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆద్యంతం అదే ఒరవడిని కొనసాగించింది. ఒక దశలో 1800 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ 55,132 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివర్లో కోలుకుని 1189.73 పాయింట్ల నష్టంతో 55,822.01 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 371 పాయింట్లు కోల్పోయి 16,614 వద్ద ముగిసింది. రూపాయి స్వల్పంగా కోలుకుని 75.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో భారత్‌ పెట్రోలియం, టాటా స్టీల్‌, టాటామోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ ప్రధానంగా నష్టపోగా.. సిప్లా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు మాత్రమే రాణించాయి. అన్ని రంగాల షేర్లూ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు సైతం 3 శాతం చొప్పున నష్టపోయాయి.

పతనానికి కారణాలు..

ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు: అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను మార్చి నాటికి పెంచడంపై అధికారులు బహిరంగంగా సంకేతాలు ఇవ్వడంతో మిగిలిన మార్కెట్ల నుంచి నిధుల మళ్లింపు మొదలైంది. ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్‌ ఇండెక్స్‌ చేరింది. ఇది ఒక్క శుక్రవారమే 0.7శాతం పెరిగింది. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. దీంతోపాటు వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్లు పెంచి 0.25కు చేర్చింది. ఇటీవల కాలంలో తొలిసారి వడ్డీరేట్లను పెంచింది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండే. త్వరలో ఫెడ్‌ ఈ బాట పట్టనుంది.

ఒమిక్రాన్‌ భయాలు: అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాపించిన వేరియంట్‌గా ఒమిక్రాన్‌ నిలిచే అవకాశం ఉండటం ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. అమెరికన్లు బూస్టర్‌ షాట్లు తీసుకోవాలని ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. దీంతో పాటు మాస్కులు ధరించడం, శీతాకాలంలో ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం వంటివి చేయాల్సిందిగా ఆదివారం సూచించారు.

లాక్‌డౌన్‌లోకి ఐరోపా దేశాలు..?: ఐరోపా దేశాల్లో మరోమారు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉండటంతో మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా అత్యధికంగా షాపింగ్‌లు జరిగే క్రిస్మస్‌, నూతన సంవత్సర సీజన్‌లో లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్‌ లాక్‌డౌన్‌ విధించింది.

ఎఫ్‌ఐఐల ఎఫెక్ట్‌: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) భారీగా విక్రయాలు జరపడం స్టాక్‌ మార్కెట్‌ సూచీల పతనానికి మరో కారణం. ఫెడ్‌ నిర్ణయాలు, ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో విదేశీ మదుపర్లు మార్కెట్ల నుంచి తరలిపోతున్నారు. నవంబర్‌ నెల మొత్తంలో రూ.39,901 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. డిసెంబర్‌లో సైతం అది కొనసాగుతుండడం, మున్ముందూ కొనసాగే అవకాశం ఉండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.


ఫ్యూచర్‌ జూమ్‌: ఓవైపు మార్కెట్‌ సూచీలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా.. ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు రాణించడం గమనార్హం. 2019లో అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నిలుపుదల చేయడం ఇందుకు నేపథ్యం. దీంతో బీఎస్‌ఈలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ (20శాతం), ఫ్యూచర్‌ రిటైల్‌ (19.92శాతం), ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ (19.91) షేర్లు భారీగా రాణించాయి. వీటితో పాటు టేస్టీ బైట్‌ (10.80 శాతం), త్రివేణి ట్రిబ్యూన్‌ (5.60 శాతం) షేర్లు సైతం రాణించడం విశేషం.


రెండ్రోజుల్లో ₹11.45 లక్షల కోట్లు ఫట్‌
దేశీయ మార్కెట్లు గత రెండు సెషన్ల పతనానికి మదుపర్లు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. శుక్రవారం, సోమవారం సంభవించిన అమ్మకాలతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.11,45,267 కోట్ల మేర క్షీణించింది. ఒక్క శుక్రవారం రూ.4.65 లక్షల కోట్లు సంపద హరించుకుపోయగా.. మిగిలిన మొత్తం సోమవారం నాటి ట్రేడింగ్‌లో పోయింది. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,52,57,581.05 కోట్లకు చేరింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని