ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: సీరమ్‌

వ్యాక్సిన్లు అందుబాటు చూసుకోకుండానే వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించడంపై సీరమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. అది కంపెన.....

Published : 23 May 2021 16:34 IST

దిల్లీ: వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనేది చూసుకోకుండానే వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించడంపై సీరమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. అది కంపెనీ అభిప్రాయం ఏమాత్రం కాదని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ జాదవ్‌ అభిప్రాయానికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు దూరంగా ఉంటోందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖకు ఆ కంపెనీ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్‌ సింగ్‌ లేఖ రాశారు. కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా తరఫున లేఖ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో భాగంగా కొవిషీల్డ్‌ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని లేఖలో వివరించారు. పూనావాలా మాత్రమే కంపెనీ అధికార ప్రతినిధి అని స్పష్టంచేశారు.

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ఇటీవల కేంద్రం పచ్చజెండా ఊపింది. వాస్తవానికి 18 ఏళ్లు పైబడిన వారికి చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. పైగా 45+ వారికి రెండో డోసు వేయడానికీ టీకా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకుని సీరమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ జాదవ్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల స్టాక్‌ను గానీ, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను గానీ ప్రభుత్వం పట్టించుకోకుండా వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించిందన్నారు. ఈ నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని