బ్రిటన్‌లో సీరమ్‌ వ్యాపార విస్తరణ

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) బ్రిటన్‌లో 240 మిలియన్‌ పౌండ్ల(దాదాపు రూ.2500 కోట్ల) పెట్టుబడులతో తన టీకా వ్యాపారాన్ని విస్తరించనుంది. అక్కడ ఒక కొత్త విక్రయ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనుంది.

Published : 05 May 2021 01:04 IST

 రూ.2500 కోట్ల పెట్టుబడులు
  విక్రయ కేంద్రం ఏర్పాటు

లండన్‌: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) బ్రిటన్‌లో 240 మిలియన్‌ పౌండ్ల(దాదాపు రూ.2500 కోట్ల) పెట్టుబడులతో తన టీకా వ్యాపారాన్ని విస్తరించనుంది. అక్కడ ఒక కొత్త విక్రయ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలు కూడా రానున్నాయి. 1 బిలియన్‌ పౌండ్లతో ప్రకటించిన ‘భారత్‌-బ్రిటన్‌ విస్తృత వాణిజ్య భాగస్వామ్యం’లో ఇది ఒక భాగమని బ్రిటన్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా బ్రిటన్‌లో 6500 వరకు ఉద్యోగాలను సృష్టించాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. మంగళవారం భారత, బ్రిటన్‌ ప్రధాన మంత్రులు మోదీ, బోరిస్‌ జాన్సన్‌ల మధ్య జరగనున్న వర్చువల్‌ సమ్మిట్‌కు ముందు ఈ ప్రకటన వెలువడింది.
ముక్కు ద్వారా టీకా ప్రయోగాలు మొదలు
బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టనున్న ఆరోగ్యసంరక్షణ, బయోటెక్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల రంగాల్లోని దాదాపు 20 భారత కంపెనీల్లో అదర్‌ పూనావాలాకు చెందిన ఎస్‌ఐఐ ఒకటి. సీరమ్‌ ప్రకటించిన 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, విక్రయ కార్యాలయం ద్వారా 1 బిలియన్‌ డాలర్ల ఆదాయం లభిస్తుందని కంపెనీ ప్రణాళికలను అక్కడి అధికార వర్గాలు ఉటంకించాయి. ‘సీరమ్‌ పెట్టుబడుల వల్ల క్లినియల్‌ ట్రయల్స్‌, పరిశోధన-అభివృద్ధి, టీకా తయారీకి వీలు కలుగుతుంది. బ్రిటన్‌తో పాటు ప్రపంచమంతా కరోనా, ఇతర మహమ్మారులతో పోరాడడానికి మద్దతు పలుకుతుంది. ఇప్పటికే సీరమ్‌ బ్రిటన్‌లో ముక్కు ద్వారా ఇచ్చే టీకాకు సంబంధించిన తొలి టయల్స్‌ను కొడాజెనిక్స్‌ ఇంక్‌తో కలిసి ప్రారంభించింది కూడా’ అని తెలిపాయి. ఇటీవలే లండన్‌కు వెళ్లిన పూనావాలా సైతం భారత్‌ వెలుపల టీకా ఉత్పత్తిని విస్తరించనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.
రూ.600 కోట్లు పెట్టనున్న గ్లోబల్‌ జీన్‌
మరో భారత ఆరోగ్యసంరక్షణ కంపెనీ గ్లోబల్‌ జీన్‌ కార్ప్‌ సైతం వచ్చే అయిదేళ్లలో 59 మిలియన్‌ పౌండ్ల(దాదాపు రూ.600 కోట్లు) పెట్టుబడులను బ్రిటన్‌లో పెట్టనుంది. తద్వారా అక్కడ అత్యంత నైపుణ్యం ఉండే 110 ఉద్యోగాలను సృష్టించనుంది. ‘బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే భారత కంపెనీల్లో గ్లోబల్‌ జీన్‌ కార్ప్‌ కూడా చేరడం సంతోషకరమని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఒక ప్రకటనలో పేర్కొనడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని