మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లిమిట్ మీరే నిర్ణ‌యించుకోండి

కార్డు లావాదేవీలను ప‌రిమితం చేయ‌డం ద్వారా మోసాల‌కు గురికాకుండా మ‌రింత ర‌క్ష‌ణ పొంద‌చ్చు

Published : 18 Feb 2021 15:50 IST

ప్ర‌స్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉప‌యోగించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డుల ఉప‌యోగంతో ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోవ‌డానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల‌పై ప‌రిమితిని మీరే సెట్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి మీరు కార్డు ఉప‌యోగించిన ప్ర‌తీసారి రూ. 5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయ‌కూడ‌దు అనుకుంటే, దానికి త‌గిన‌ట్ల‌గా ప‌రిమితిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఒకవేళ ప‌రిమితికి మించి లావాదేవీలు చేస్తే… అవి విఫ‌లమ‌వుతాయి. అంత‌ర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవ‌కాశం కూడా ఉంది.

ఎలా సెట్ చేయాలి?
కార్డు ప‌రిమితిని ఏర్ప‌రుచుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బ‌ట‌న్‌ను స్విచ్ ఆన్ చేయ‌డం ద్వారా అనుమ‌తిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ప‌రిమితిని ఏర్పాటు చేసుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్ష‌న్‌కు వెళ్ళి, ప‌రిమితి విధించాల‌నుకుంటున్న కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. దేశీయ లావాదేవీల కోసం లేదా అంత‌ర్జాతీయ లావాదేవీల కోసం ప‌రిమితి మార్చుకోవాలా లేదా ఇత‌ర మార్పులు ఏమైనా చేయాల‌నుకుంటున్నారా అన్న ఆప్ష‌న్ల‌ను ఇస్తుంది. ఇందులో మీకు కావ‌ల‌సిన దాన్ని ఎంచుకుని లిమిట్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్‌ను సెట్ చేసుకునే సౌక‌ర్యాన్ని కొన్ని బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్ష‌న్ ఎనేబుల్ చేసిన త‌రువాత బ్యాంకు వారు ప‌రిమితి విధించి మీకు తెలియ‌జేస్తారు. త‌దుప‌రి లావాదేవీలు ప‌రిమితికి మించితే… బ్యాంకు వారు మీకు స‌మాచారం అందిస్తారు.

ప‌రిమితి ఎందుకు పెట్టుకోవాలి?
డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాల‌ను అరిక‌ట్టేందుకు బ్యాంకులతో పాటు మ‌నం కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప్ర‌త్యేకించి మీ పాస్‌వ‌ర్డ్‌, పిన్ వంటి వివ‌రాల‌ను ఎవ‌రితోనూ పంచుకోకండి. మీ కార్డు విత్‌డ్రా లిమిట్‌ను ప‌రిమితం చేయండి. ఉదాహ‌ర‌ణ‌కి, మీ కార్డు అంత‌ర్జాతీయ లావాదేవీల‌ను రద్దు చేసి, దేశీయంగా ఒక‌సారి చేసే లావాదేవీల‌ను రూ.5 వేల‌కు ప‌రిమితం చేశార‌నుకుందాం. అంత‌ర్జాతీయంగా మోసాల‌కు పాల్ప‌డే వారు మీ కార్డు వివ‌రాల ద్వారా లావాదేవీలు నిర్వ‌హించ‌లేరు. అలాగే దేశీయంగా మోసాల‌కు పాల్ప‌డితే రూ.5 వేలకు మించి న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని