Paytm: పేటీఎంకు షాక్‌.. ఒకేసారి ముగ్గురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామా!

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరోసారి గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే గత రెండేళ్లుగా ఈ సంస్థ నుంచి పలువురు సీనియర్‌ ఉద్యోగులు బయటకు వెళ్లిపోగా..

Updated : 23 Dec 2021 15:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరోసారి గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే గత రెండేళ్లుగా ఈ సంస్థ నుంచి పలువురు సీనియర్‌ ఉద్యోగులు బయటకు వెళ్లిపోగా.. తాజాగా ముగ్గురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు వెనువెంటనే రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) అభిషేక్‌ అరుణ్‌, ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ సీవోవో రేణు సాతి, సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌, సీవోవో అభిషేక్‌ గుప్తా రాజీనామాలు సమర్పించినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. 

గత ఐదేళ్లకు పైగా పేటీఎంలో సేవలందిస్తున్న అభిషేక్‌ అరుణ్‌.. కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో వెల్లడించారు. అభిషేక్‌ గుప్తా, రేణు సాతి గతేడాదే పేటీఎంలో చేరగా.. ఇటీవల వీరిద్దరూ తమ రాజీనామాలు సమర్పించినట్లు సదరు కథనం పేర్కొంది. అయితే, ఈ రాజీనామాలపై పేటీఎం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు పేటీఎం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పేటీఎం ప్రెసిడెంట్‌ అమిత్‌ నాయర్‌, చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ రోహిత్‌ ఠాకూర్‌ సహా మరో ముగ్గురు వైస్‌ ప్రెసిడెంట్లు రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టార్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌.. అరంగేట్రంలోనే నిరాశపర్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని