Gold: 76 టన్నుల పసిడి అమ్మకాలు..19.2 శాతం వృద్ధి!

దేశీయంగా ఏప్రిల్‌-జూన్‌లో 76.1 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ నాటి 63.8 టన్నులతో పోలిస్తే, ఈసారి 19.2 శాతం వృద్ధి లభించింది. అయితే మార్చి త్రైమాసికంతో పోలిస్తే, గిరాకీ 46 శాతం తగ్గింది...

Updated : 30 Jul 2021 11:27 IST

ఏప్రిల్‌-జూన్‌పై ప్రపంచ స్వర్ణ మండలి

ముంబయి: దేశీయంగా ఏప్రిల్‌-జూన్‌లో 76.1 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ నాటి 63.8 టన్నులతో పోలిస్తే, ఈసారి 19.2 శాతం వృద్ధి లభించింది. అయితే మార్చి త్రైమాసికంతో పోలిస్తే, గిరాకీ 46 శాతం తగ్గింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల దుకాణాలు మూసిఉండటంతో, అమ్మకాలు స్తంభించి ఈసారి గిరాకీ పెరిగినట్లు కనిపిస్తోందని,  కొవిడ్‌ రెండోదశ పరిణామాల వల్ల ఈసారీ పెద్దగా జరగలేదని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజనులో కూడా పెద్దగా గిరాకీ కనిపించలేదని పేర్కొంది.

* విలువ ప్రకారం 2021 ఏప్రిల్‌-జూన్‌లో రూ.32,810 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఏడాది క్రితం నాటి రూ.26,600 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం అధికం.

* ఈ ఏడాది తొలి 6 నెలల్లో 157.6 టన్నుల కొనుగోలే జరిగింది. 2019 తొలి అర్ధభాగంతో పోలిస్తే 46 శాతం; 2015-19 ప్రథమార్థాల సగటుతో పోలిస్తే 39 శాతం తక్కువ.

* జూన్‌ త్రైమాసికంలో ఆభరణాలకు గిరాకీ 25 శాతం పెరిగి 55.1 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే 29 శాతం హెచ్చి రూ.23,750 కోట్లకు చేరింది.

* పెట్టుబడుల పరంగా గిరాకీ 6 శాతం పెరిగి 21 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా 10% వృద్ధితో రూ.8250 కోట్ల నుంచి రూ.9060 కోట్లకు చేరుకుంది.

ఒక్కసారి సాధారణ పరిస్థితులు నెలకొంటే గిరాకీ మళ్లీ పుంజుకుంటుందని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ(ఇండియా) సోమసుందరమ్‌ పేర్కొన్నారు. ‘టీకాల వేగం, సీరో సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే వ్యాపారాలు, విక్రయాలు మళ్లీ బలాన్ని పుంజుకుంటాయి. ధనత్రయోదశి, రాబోయే పెళ్లిళ్ల సీజను గిరాకీని పెంచగలవ’ని అన్నారు.

ప్రపంచవ్యాప్త గిరాకీలో మార్పు లేదు: అంతర్జాతీయంగా పసిడి గిరాకీ ఏప్రిల్‌-జూన్‌లో1 శాతం మాత్రమే తగ్గి 955.1 టన్నులకు చేరింది. ఈటీఎఫ్‌ల నుంచి నామమాత్ర పెట్టుబడులు రావడం ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. 2020 ఇదే మూడు నెలల కాలంలో 960.5 టన్నుల గిరాకీ నమోదైంది. ఆభరణాల గిరాకీ 244.5 టన్నుల నుంచి 60 శాతం పెరిగి 390.7 టన్నులకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని