స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డి ప‌థ‌కాలు 

స్వ‌ల్ప‌ కాలానికి పెట్టుబ‌డి చేసేందుకు న‌ష్ట‌భ‌యం లేని ప‌థ‌కాలు, మార్కెట్ ఆధారిత న‌ష్ట‌భ‌యం ఉన్న‌ ప‌థ‌కాలు రెండు ర‌కాలుంటాయి.

Updated : 27 Jan 2021 15:53 IST

స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డి చేసేందుకు ఎలాంటి ప‌థ‌కాలు ఎంచుకోవాలి. స్వ‌ల్ప‌కాల ఫిక్సిడ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. డెట్ ఫండ్లలో స్వ‌ల్ప‌కాలానికి అనుకూలంగా ఉండే లిక్విడ్ ఫండ్లు మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన‌ పెట్టుబ‌డులను ప్ర‌భుత్వ ట్రెజ‌రీ బిల్లులు, మ‌నీ మార్కెట్ సాధ‌నాల్లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. వ‌డ్డీ రేట్ల‌లో క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి పెట్టుబ‌డుల్లో త‌గిన మార్పుచేర్పులు చేస్తుంటారు. స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం లేని ప‌థ‌కాలు, మార్కెట్ ఆధారిత న‌ష్ట‌భ‌యం ఉన్న‌ ప‌థ‌కాలు రెండు ర‌కాలు అందుబాటులో ఉంటాయి.

న‌ష్ట‌భ‌యం లేని పెట్టుబ‌డి సాధ‌నాలు:
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్: ఇవి 1,2,3,5 సంవ‌త్స‌రాల‌కు అందుబాటులో ఉంటాయి. వార్షిక వ‌డ్డీరేటు 6.9-7.8 శాతం వ‌ర‌కూ ఉంటుంది. క‌నీస పెట్ట‌బ‌డి రూ.200 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. గ‌రిష్ట ప‌రిమ‌తి లేదు. ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఐదేళ్ల కాల‌ప‌రిమితి టైమ్ డిపాజిట్ల‌పై మాత్ర‌మే ఉంటుంది. అంత‌కంటే త‌క్కువ కాల‌ప‌రిమితి టైమ్ డిపాజిట్ల‌పై ఉండ‌దు

షార్ట్ ట‌ర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్: వీటి మెచ్యూరిటీ ఏడు రోజుల నుంచి ఏడాది వ‌ర‌కూ కాల‌ప‌రిమితికి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. వార్షిక వ‌డ్డీరేటు 3.5-6.75 శాతం వ‌ర‌కూ ఉంటుంది. క‌నీస పెట్ట‌బ‌డి రూ.100 అయితే ఇది బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది.

స్వీప్ ఇన్ ఫిక్సిడ్ డిపాజిట్: వీటిపై ల‌భించే వార్షిక వ‌డ్డీరేటు ఫిక్సిడ్ డిపాజిట్ ల‌పై వ‌చ్చే విధంగానే ఉంటుంది. ఖాతాదారుడు నిర్ణ‌యించిన మొత్తం కంటే ఎక్కువ డ‌బ్బు ఖాతాలో ఉంటే ఆటోమేటిక్ గా ఆ మొత్తం స్వీప్ ఇన్ విధానం ద్వారా ఫిక్సిడ్ డిపాజిట్ గా మారుతుంది.

న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డి సాధ‌నాలు:
స్వ‌ల్పకాలం పాటు పెట్టుబ‌డి చేసేందుకు అనుకూలంగా ఉండే లిక్విడ్ ఫండ్లు కొంత మార్కెట్ న‌ష్ట‌భ‌యాన్ని క‌లిగి ఉంటాయి. వీటిని ఎంచుకునే మ‌దుప‌ర్లు రాబ‌డి స్థిరంగా ఉండ‌ద‌ని గుర్తించాలి. వీటిపై వ‌చ్చే రాబ‌డి మార్కెట్ ప‌రిస్థితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

లిక్విడ్ ఫండ్లలో కొన్ని రోజుల‌ నుంచి కొన్ని నెల‌లు వ‌ర‌కూ మ‌దుపు చేసుకోవ‌చ్చు. వీటికి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూనిట్ల‌ను న‌గ‌దుగా మార్చుకోవ‌డం సుల‌భ‌త‌రం, వేగంగా పూర్త‌వుతుంది. ఇవి 91 రోజుల కంటే త‌క్కువ కాల‌ప‌రిమితి ఉన్న పెట్టుబ‌డి సాధానాల్లో మ‌దుపు చేస్తాయి. అత్య‌వ‌స‌ర నిధి కోసం వీటిలో లిక్విడ్‌ ఫండ్‌ లో గ్రోత్, డివిడెండ్ ఆప్ష‌న్ల‌ను మ‌దుప‌ర్లు వారి అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఎంచుకోవచ్చు. రెగ్యుల‌ర్, డైరెక్టు ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. క్రమ‌బ‌ద్ధ‌మైన ఆదాయం కోరుకునేవారు డివిడెండ్ ప్లాన్‌లోనూ, పెట్టుబ‌డిలో వృద్ధిని కోరుకునేవారు గ్రోత్ ప్లాన్‌లోనూ మ‌దుపుచేయాలి. లిక్విడ్ ఫండ్లలో డివిడెండ్ల‌ను రోజు, వారం, ప‌క్షానికి ఒక సారి ఇస్తుంటాయి. ఈ డివిడెండ్లపై మ‌దుప‌ర్ల‌కు ప‌న్ను ఉండ‌దు. దాదాపు చాలా లిక్విడ్ ఫండ్లకు నిష్క్రమణ ఛార్జీలు ఉండ‌వు. అలాగే ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలో త‌క్కువగా ఉంటాయి.

మార్కెట్ సంబంధిత అంశాల ద్వారా ఎటువంటి ప్ర‌భావం లేకుండా పెట్టుబ‌డి ర‌క్ష‌ణ‌కు న‌ష్ట‌భ‌యం లేని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్, షార్ట్ ట‌ర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్ సాధ‌నాలు ఎంచుకోవ‌చ్చు. మార్కెట్ ఆధారిత న‌ష్ట‌భ‌యం ఉన్నా సాధార‌ణ స్థిరాదాయ ప‌థ‌కాల కంటే ఎక్కువ రాబ‌డి కావాల‌నుకునే మ‌దుప‌ర్లు లిక్విడ్ ఫండ్లు ఎంచుకోవ‌చ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని