కెయిర్న్‌ ఇండియాపై జరిమానా నిలిపేసిన శాట్‌

2014లో షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారనే కారణంగా కెయిర్న్‌ ఇండియా, మరికొందరిపై జరిమానా విధిస్తూ సెబీ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

Updated : 25 Jun 2021 04:06 IST

సెబీ వద్ద రూ.2.5 కోట్లు డిపాజిట్‌ చేయాలని సూచన

దిల్లీ: 2014లో షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారనే కారణంగా కెయిర్న్‌ ఇండియా, మరికొందరిపై జరిమానా విధిస్తూ సెబీ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) నిలిపివేసింది. మూడు వారాల్లోగా సెబీ వద్ద రూ.2.5 కోట్లు డిపాజిట్‌ చేయాలని కెయిర్న్‌ ఇండియాకు, ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతావాళ్లకు సూచించింది. 2017లో వేదాంతాలో కెయిర్న్‌ ఇండియా విలీనమైంది. ఈ సంస్థలు డబ్బులు డిపాజిట్‌చేస్తే.. కేసు పెండింగ్‌లో ఉన్నంత కాలం ఎటువంటి రికవరీ చేయకూడదని జూన్‌ 22న జారీ చేసిన ఆదేశాల్లో శాట్‌ పేర్కొంది. బైబ్యాక్‌కు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు గాను సెబీ ఈ ఏడాది మేలో రూ.5.25 కోట్ల జరిమానాను కెయిర్న్‌ ఇండియాకు విధించింది. ఆ సమయంలో కెయిర్న్‌ ఇండియాకు సీఈఓ, డైరెక్టరుగా ఉన్న పి.ఎలంగో, డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న అమన్‌ మెహతా, నీర్జా శర్మ రూ.15 లక్షలు చొప్పున జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. బైబ్యాక్‌ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాకుండా.. కేవలం కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ చేసేలా మదుపర్లను ప్రభావితం చేసేందుకే 2014లో బైబ్యాక్‌ ప్రకటనను కెయిర్న్‌ ఇండియా, మరికొందరు రూపొందించారని సెబీ తన ఆదేశాల్లో పేర్కొని.. ఈ జరిమానా విధించింది.


2.4 కోట్ల షేర్లు తనఖా పెట్టిన జీఎంఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రమోటర్‌ సంస్థ అయిన జీఎంఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 2.4 కోట్ల జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ షేర్లను తనఖా పెట్టింది. కేఎల్‌జే ప్లాస్టిసైజెర్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ పేరు మీద ఈ షేర్లు తనఖా పెట్టినట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ) కి వెల్లడించింది. విమానాశ్రయాలు, జాతీయ రహదార్ల అభివృద్ధి, ఇంథన విభాగాల్లో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్యకలాపాలు సాగిస్తోంది.


బారిసిటినిబ్‌’ ఔషధ పంపిణీకి బీడీఆర్‌ ఫార్మాతో మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఒప్పందం

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే బారిసిటినిబ్‌ ఔషధాన్ని విక్రయించడానికి బీడీఆర్‌ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెల్లడించింది. ‘బారికైండ్‌’ అనే బ్రాండు పేరుతో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు పేర్కొంది. ఎలి లిల్లీ అనే కంపెనీకి పేటెంట్‌ ఉన్న ఈ ఔషధాన్ని మనదేశంలో తయారీ- విక్రయాల నిమిత్తం కొన్ని దేశీయ ఫార్మా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో బీడీఆర్‌ ఫార్మా ఒకటి. ఈ ఔషధాన్ని బీడీఆర్‌ ఫార్మా ఉత్పత్తి చేస్తూ, దాన్ని పంపిణీ బాధ్యతలను మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు అప్పగించింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని