Future Retail: ఫ్యూచర్‌ రిటైల్‌కు చుక్కెదురు..!

సింగపూర్‌కు చెందిన ఆర్బిటరేషన్‌ న్యాయస్థానం ఎస్‌ఐఏసీలో ఫ్యూచర్‌ రిటైల్‌కు చుక్కెదురైంది. రిలయన్స్‌తో చేసుకొన్న రూ.24,713 కోట్లు విలువైన డీల్‌పై విధించిన తాత్కాలిక

Published : 22 Oct 2021 22:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపూర్‌కు చెందిన ఆర్బిటరేషన్‌ న్యాయస్థానం ఎస్‌ఐఏసీలో ఫ్యూచర్‌ రిటైల్‌కు చుక్కెదురైంది. రిలయన్స్‌తో చేసుకొన్న రూ.24,713 కోట్ల విలువైన డీల్‌పై విధించిన తాత్కాలిక స్టేను తొలగించాలని కోరింది. దీనికి ఎస్‌ఐఏసీ నిరాకరించింది. దీంతో అమెజాన్‌కు కొంత ఊరట లభించినట్లైంది. ఫ్యూచర్‌ గ్రూప్‌-అమెజాన్‌ మధ్య వివాదంలో ఫ్యూచర్‌ రిటైల్‌ను కక్షిదారుగా చేర్చిన మర్నాడే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. తన ప్రమోటర్ ఫ్యూచర్‌ కూపన్స్‌, అమెజాన్‌కు మధ్య ఉన్న వివాదంతో తనకు సంబంధం లేదని ఫ్యూచర్‌ రిటైల్‌ వాదించింది.

సింగపూర్‌ న్యాయస్థానం తీర్పు అంశాన్ని ఫ్యూచర్‌ రిటైల్‌ శుక్రవారం రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అక్టోబర్‌ 21వ తేదీన ఈ తీర్పు వెలువడినట్లు వెల్లడించింది.

నేపథ్యం ఇదీ..

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దాఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదించింది. సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. ఆ కోర్టు డీల్‌పై స్టే విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని