ఒకసారి ఛార్జింగ్‌తో 120 కి.మీ ప్రయాణం

నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ రోడ్లపైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణించేందుకు

Published : 11 Jul 2021 10:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ రోడ్లపైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఉండే విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది గ్రావ్‌టన్‌ మోటార్స్‌. హైదరాబాద్‌కు చెందిన ఈ అంకురం తన తొలి విద్యుత్‌ వాహనం ‘క్వాంటా’ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు అవలీలగా దూసుకుపోవచ్చని వెల్లడించింది. లి-ఐయాన్‌ బ్యాటరీని రిబ్‌డ్‌ ఛాసిస్‌లో బిగించడం ద్వారా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ సీఈఓ పరశురామ్‌ పాక తెలిపారు. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం అనే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ ఆన్‌లైన్‌ వెబ్‌సైటు ద్వారా బుకింగ్‌లు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ‘విద్యుత్‌ వాహనాన్ని వినియోగించే వారికి ప్రధానంగా ఇంకా ఎంత దూరం వెళ్లగలం అనే ఆందోళన ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే.. సగటున 120 కిలోమీటర్ల కన్నా అధికంగా ప్రయాణించాలని మా సర్వేలో తేలింది. అందుకు తగ్గట్టుగానే ఈ వాహనాన్ని రూపొందించాం. బీఎల్‌డీసీ మోటార్‌ 3 కిలోవాట్‌ (4బీహెచ్‌పీ) శక్తిని విడుదల చేస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ఠ వేగం దీని సొంతం. మూడు గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్‌ అవుతుంది. అదనంగా మరో బ్యాటరీని బిగించుకునే వీలూ ఇందులో ఉంది’ అని పరశురామ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటులో నెలకు 2,000 యూనిట్లు తయారీ సామర్థ్యం ఉందని, దీన్ని విస్తరించి, 5,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీని ధర రూ.99,000లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు