స్వ‌ల్ప కాల పెట్టుబ‌డుల‌కు 6 మార్గాలు

స్వ‌ల్ప కాలావ్య‌వ‌ధిలో పెట్టే పెట్టుబ‌డులకు సంబంధించిన ఆరు ప‌థకాల గురించి తెలుసుకుందాం...

Published : 23 Dec 2020 15:46 IST

స్వ‌ల్ప కాలావ్య‌వ‌ధిలో పెట్టే పెట్టుబ‌డులకు సంబంధించిన ఆరు ప‌థకాల గురించి తెలుసుకుందాం

ఆర్థిక ప్ర‌ణాళిక అన‌గానే మ‌న‌లో చాలా మందికి దీర్ఘ‌కాలంలో చేసే పెట్టుబ‌డులు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తాయి. అయితే స్వ‌ల్ప కాలంలో నెర‌వేర్చాల్సిన ల‌క్ష్యాలు, అవ‌స‌రాలూ ఉంటాయి. ప్ర‌జలు త‌మ ల‌క్ష్యం త్వ‌ర‌గా చేరుకోవాల‌నో లేదా దీర్ఘ‌కాలంలో త‌మ పెట్టుబ‌డులను లాకింగ్ చేసి రిస్క్ తీసుకోవ‌ద్ద‌న్న ఉద్ధేశంతోనో స్వ‌ల్ప కాలావ‌ధి గ‌ల ఆర్థిక సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. అయితే స్వ‌ల్ప కాల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఇతమిద్ధ‌మైన గ‌డువును నిర్వ‌చించ‌న‌ప్పటికీ, 7 రోజుల నుంచి ఏడాది లోపు చేసే పెట్టుబ‌డుల‌ను స్వ‌ల్ప కాల పెట్టుబ‌డులుగా భావించ‌వ‌చ్చు. స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఎన్నో ఆర్థిక సాధ‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా రెండు ర‌కాలు. ఒక‌టి స్థిరాదాయ రాబ‌డులు అందించేవి, మ‌రొక‌టి మార్కెట్ అనుసంధాన‌ రాబ‌డుల‌ను అందించేవి. స్థిరాదాయ రాబ‌డులు అందించే ఆర్థిక సాధనాల‌లో 7 రోజుల నుంచి 12 నెల‌ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కంపెనీ డిపాజిట్లు, పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్లు ఈ త‌ర‌హా ఆర్థిక సాధ‌నాల కింద‌కి వ‌స్తాయి.

మార్కెట్ అనుసంధాన సాధ‌నాల‌కి లిక్విడ్ ఫండ్లు, అల్ట్రా షార్ట్ డ్యూరేష‌న్ ఫండ్లు, మ‌నీ మార్కెట్ ఫండ్లను మంచి ఉదాహ‌ర‌ణ‌లుగా చెపుకోవ‌చ్చు. వీటిలో జారి చేసే సెక్యూరిటీల కాల‌వ్య‌వ‌ధి 12 నెల‌ల లోపే ఉంటుంది.

  1. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు

కాల‌వ్య‌వ‌ధి:
స్వ‌ల్ప‌కాలానికి చేసే పెట్టుబ‌డులలో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు సుర‌క్షిత‌మైన‌వి. వీటి కాల‌వ్య‌వ‌ధి సాధార‌ణంగా 7 రోజులు, 14 రోజులు, 30 రోజులు, 45 రోజుల నుంచి మొద‌లుకొని 10 ఏళ్ల వ‌ర‌కు కూడా ఉంటుంది. ఈ డిపాజిట్ల కాల‌వ్య‌వ‌ధులు బ్యాంకుల‌ని బ‌ట్టి మారుతుంటాయి. కొన్ని డిపాజిట్ల‌ను మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత పున‌రుద్ధ‌రించుకుని అవ‌స‌రం లేద‌నుకుంటే మ‌ళ్లీ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్నోరేష‌న్‌(డీఐసీజీసీ) నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తీ డిపాజిట‌ర్‌కి చెందిన డిపాజిట్ సొమ్ము(అస‌లు+వ‌డ్డీ క‌లిపి)లో గ‌రిష్టంగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు బీమా స‌దుపాయం ఉంటుంది. ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా ఎఫ్‌డీలలో పెట్టుబ‌డులు పెట్టే అవకాశాన్ని క‌ల్పిస్తున్నాయి.

న‌గదు ల‌భ్య‌త:
కొన్ని బ్యాంకులు మెచ్యూరిటీ గ‌డువు తీర‌క‌ముందే చేసే న‌గదు ఉపసంహ‌ర‌ణ‌ల‌ను అనుమ‌తించ‌వు. పెట్టుబ‌డుల‌ను నిర్ధిష్ట కాలావధిలో లాక్ చేసుకునే బ‌దులు, లాడ‌రింగ్ విధానంలో ఈ డిపాజిట్ల‌ను వివిధ మెచ్యూరిటీ గ‌డువు తేదీలుగా విస్త‌రించుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల నిధుల‌కు న‌గ‌దు ల‌భ్య‌త క‌ల‌గ‌డ‌మే గాక‌, తిరిగి పెట్టుబ‌డుల పెట్టేట‌ప్పుడు ఎదుర‌య్యే రిస్క్‌ల‌ను కూడా నిర్వ‌హించ‌వ‌చ్చు. త‌క్కువ కాల‌వ‌ధి గ‌ల ఎఫ్‌డీ మెచ్యూరిటీ తీరే సంద‌ర్భం వ‌చ్చిన‌ప్ప‌డు దానిని పున‌రుద్ధ‌రించుకుని తిరిగి దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డులు చేయడం మంచిది. ఈ ప్ర‌క్రియ‌ను ఇత‌ర ఎఫ్‌డీల మెచ్యూరిటీ తీరిన‌ప్పుడు కూడా కొన‌సాగించ‌వ‌చ్చు. అవ‌స‌రాల మేర‌కు జ‌రిమానా క‌ట్టి మెచ్యూరిటీ తీర‌క‌ముందే న‌గదును ఉపసంహ‌రించుకోవ‌చ్చు. ఒక వేళ అవ‌స‌రం లేక‌పోతే వీటిపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని అందుకోవ‌చ్చు.

రాబ‌డులు:
మ‌దుప‌రులు త‌మ‌ అవ‌స‌రాల మేర‌కు నెల‌వారీగా, మూడు నెల‌లు, ఆరు నెల‌లు, ఏడాదికి లేదా ఏక‌మొత్తంగా వ‌డ్డీనిచ్చే ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు. ఈ వ‌డ్డీ రేట్లు ఆర్‌బీఐ నిర్ధేశించే రెపోరేటుతో పాటు బ్యాంకుల నిధుల వ్య‌యంపై ఆధార‌ప‌డి ఉంటాయి. ప్ర‌స్తుతం 12 నెల‌లు లేదా అంత‌కంటే ఎక్కువ గ‌డువు గ‌ల డిపాజిట్ల‌పై 6.5 శాతం వార్షిక వ‌డ్డీ ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు అద‌నంగా మ‌రో 0.5 శాతం వ‌డ్డీని పొంద‌వ‌చ్చు.

ప‌న్ను భారం:
ఈ డిపాజిట్ల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ వ్య‌క్తుల ఆదాయంగా ప‌రిగ‌ణించ‌బ‌డి, ఆదాయ ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది. ఒక వ్య‌క్తికి అన్ని బ్యాంకు శాఖ‌ల నుంచి వ‌చ్చే వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు మించితే, వారిపై మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌) ప‌డుతుంది.

  1. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
    బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంత భ‌ద్ర‌మైన‌వి కాబ‌ట్టి వీటిలో రిస్క్ ఎక్కువ‌. కంపెనీలు దివాలా తీసే సంద‌ర్భంలో కంపెనీ ఆస్తుల‌పై డిపాజిట‌ర్ల‌కు ఎలాంటి హ‌క్కులు ఉండ‌వు. అంత‌కుముందు స్వ‌ల్ప‌కాల డిపాజిట్ ఆప్ష‌న్ గ‌ల వారికి త‌యారీ రంగ కంపెనీల‌తో బాటు బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌(ఎన్‌బీఎఫ్‌సీ)లూ ఈ డిపాజిట్ల‌ను స్వీక‌రిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు అందించే ఎఫ్‌డీల కాల‌వ్య‌వ‌ధులు ఏడాదికి మించి కూడా ఉంటాయి.

న‌గదు ల‌భ్య‌త:
కంపెనీ విచ‌క్ష‌ణ బ‌ట్టి వీటిలో మెచ్యూరిటీ తీర‌క‌ముందే న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. స‌రెండ‌ర్ చేసే సంద‌ర్భంలో డిపాజిట్ల కాలావ‌ధులు బ‌ట్టి పెనాల్టీలు కూడా ఉంటాయి.

రాబ‌డులు:
వీటిలో బ్యాంక్ డిపాజిట్ల కంటే 1-2 శాతం అధిక వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంద‌నే విష‌యం మ‌ర‌వ‌వ‌ద్దు. మ‌దుప‌రులు త‌మ‌ అవ‌స‌రాల మేర‌కు నెల‌వారీగా, మూడు నెల‌లు, ఆరు నెల‌లు, ఏడాదికి లేదా ఏక‌మొత్తంగా వ‌డ్డీనిచ్చే ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ డిపాజిట్ల‌పై 7.5 శాతం వార్షిక వ‌డ్డీ ల‌భిస్తోంది.

ప‌న్ను భారం:
ఈ డిపాజిట్ల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ వ్య‌క్తుల ఆదాయంగా ప‌రిగ‌ణించ‌బ‌డి, ఆదాయ ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది. ఒక వ్య‌క్తికి కంపెనీకి చెందిన అన్ని శాఖ‌ల నుంచి వ‌చ్చే వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.5 వేలు మించితే, వారిపై మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌) ప‌డుతుంది.

  1. పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్లు

కాల‌వ్య‌వ‌ధి:
పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ల‌లో 1,2,3 లేదా 5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధుల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

న‌గ‌దు ల‌భ్య‌త‌:
ఈ త‌ర‌హా డిపాజిట్ల‌పై వార్షిక వ‌డ్డీ అమ‌ల‌వుతోంది. మెచ్యూరిటీ గ‌డువుకి ఆరు నెల‌ల ముందు నుంచి చేసే ఉపసంహ‌ర‌ణ‌ల‌ను అనుమ‌తించ‌రు. ఆ త‌ర్వాత డిపాజిట్ల‌ను స‌రెండ‌ర్ చేయ‌వ‌చ్చు కానీ త‌క్కువ వ‌డ్డీ ల‌భిస్తుంది.

రాబ‌డులు:
వీటిలో వ‌చ్చే రాబ‌డులు స్థిరంగా ఉండి, పెట్టుబ‌డి పూర్తి కాల‌ప‌రిమితికి సార్వ‌జ‌నీన హామీ ఉంటుంది. స్వ‌ల్ప కాలానికి మ‌దుప‌రులు ఏడాది కాల‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఏటా వ‌డ్డీని ఇస్తారు. అయితే లెక్కించ‌డం మాత్రం మూడు నెల‌లకోసారి చేస్తారు. ఈ వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తీ మూడు నెల‌ల‌కోసారి తాజా పెట్టుబ‌డులు ఆధారంగా ఖ‌రారు చేస్తారు. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న త్రైమాసికానికి(ఏప్రిల్‌-జూన్‌,2018 కి) ఏడాది నుంచి ఐదేళ్ల కాల‌వ‌ధి డిపాజిట్ల‌పై 6.6 నుంచి 7.4 శాతం వ‌డ్డీ అమ‌ల‌వుతోంది.

ప‌న్ను భారం:
ఈ డిపాజిట్ల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ వ్య‌క్తుల ఆదాయంగా ప‌రిగ‌ణించ‌బ‌డి, ఆదాయ ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది.

  1. రిక‌రింగ్ డిపాజిట్లు

ఇత‌ర స్వ‌ల్ప‌కాల ఆర్థిక సాధ‌నాల‌లో పెట్టుబ‌డుల‌ను ఏక‌మొత్తంగా, ఒకేసారి చేయాల్సి ఉంటుంది. అయితే క్ర‌మం త‌ప్ప‌కుండా, స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారికి రికరింగ్ డిపాజిట్లు(ఆర్‌డీ) మంచి ప్ర‌త్యామ్నాయం. ఆర్‌డీల‌లో నిర్ధేశించిన కాల‌వ్య‌వ‌ధికి క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ తీరిన త‌ర్వాత ఏక మొత్తంలో న‌గ‌దు అందుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా ఆర్‌డీలలో పెట్టుబ‌డులు పెట్టే అవకాశాన్ని క‌ల్పిస్తున్నాయి.

కాల‌వ్య‌వ‌ధి:
రిక‌రింగ్‌ డిపాజిట్ల‌లో క‌నిష్టంగా 6 నెల‌ల కాల‌వ‌ధిలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 3 నెల‌ల చొప్పున పెంచుకుంటూ 10 ఏళ్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ‌చు.

న‌గ‌దు ల‌భ్య‌త‌:
సాధార‌ణంగా ఆర్‌డీల‌లో కనీసం ఒక నెల వ‌ర‌కు పెట్టుబ‌డులను ఉప‌సంహ‌రించుకోవ‌ద్దు. ఒక వేళ నెలలోపే న‌గ‌దు ఉప‌సంహ‌రించుకుంటే వడ్డీ లేకుండా, కేవ‌లం అస‌లు మొత్తాన్ని మాత్ర‌మే డిపాజిట‌ర్‌కి తిరిగి చెల్లిస్తారు. మెచ్యూరిటీ తీర‌క‌ముందే న‌గదు ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో వ‌డ్డీని డిపాజిట్ కాల‌వ్య‌వ‌దికి అనుగుణంగా లెక్కిస్తారు.

రాబ‌డులు:
రిక‌రింగ్ డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ రేట్లు బ్యాంక్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌తో స‌మానంగా ఉంటాయి. ప్ర‌స్తుతం 12 నెల‌లు లేదా అంత‌కంటే ఎక్కువ గ‌డువు గ‌ల డిపాజిట్ల‌పై 6.5 శాతం వార్షిక వ‌డ్డీ ఉంది. మొద‌టి వాయిదా చెల్లించిన‌ప్ప‌టి తేదీ నుంచి వ‌డ్డీ రేట్లు అమ‌ల‌వుతాయి.

ప‌న్ను భారం:
ఈ డిపాజిట్ల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ వ్య‌క్తుల ఆదాయంగా ప‌రిగ‌ణించ‌బ‌డి, ఆదాయ ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది. ఒక వ్య‌క్తికి ఆర్‌డీల‌పై (అన్ని బ్యాంకు శాఖ‌లను క‌లుపుకొని) వ‌చ్చే వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు మించితే, వారిపై మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌) ప‌డుతుంది.

  1. స్వీప్‌-ఇన్‌-ఫిక్స్‌డ్ డిపాజిట్లు

న‌గ‌దు ల‌భ్య‌త స‌మ‌స్య‌లుండ‌వు కాబ‌ట్టి చాలామంది పొదుపు ఖాతాల‌లో డ‌బ్బులు వేయ‌డానికి మొగ్గు చూపుతుంటారు. అయితే దీనికి బ‌ప్ర‌త్య‌మ్రాయంగా స్వీప్-ఇన్‌-ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లోనూ పెట్టుబ‌డ‌లు పెట్టువ‌చ్చు. దీనికే మ‌నీ మ‌ల్టీప్లైయ‌ర్‌, 2-ఇన్‌-1 ఖాతా అని పేర్లు కూడా క‌ల‌వు. మ‌దుప‌రులు బ్యాంకు శాఖను సంద‌ర్శించి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా స్వీప్‌-ఇన్‌-ఖాతాను తెర‌వ‌వ‌చ్చు.

కాల‌వ్య‌వ‌ధి:
ఇందులో 12 నెల‌ల కాల‌వ్య‌వ‌ధికి ఖాతాను తెర‌చి పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

న‌గ‌దు ల‌భ్య‌త :
మెచ్యూరిటీ తీర‌క‌ముందే న‌గ‌దును ఉప‌సంహ‌రించుకుంటే రావాల్సిన వ‌డ్డీలో 0.5-1 శాతం వ‌ర‌కు జ‌రిమానా రూపేణా విధిస్తారు.

రాబ‌డులు:
స్వీప్‌-ఇన్‌-ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ రేట్లు బ్యాంక్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌తో స‌మానంగా ఉంటాయి. ప్ర‌స్తుతం 12 నెల‌లు లేదా అంత‌కంటే ఎక్కువ గ‌డువు గ‌ల డిపాజిట్ల‌పై 6.5 శాతం వార్షిక వ‌డ్డీ ఉంది.

ప‌న్ను భారం:
ఈ డిపాజిట్ల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ వ్య‌క్తుల ఆదాయంగా ప‌రిగ‌ణించ‌బ‌డి, ఆదాయ ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది. ఒక వ్య‌క్తికి అన్ని బ్యాంకు శాఖ‌ల నుంచి వ‌చ్చే వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు మించితే, వారిపై మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌) ప‌డుతుంది.

  1. డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు

స్వ‌ల్ప కాలావ్య‌వ‌ధికి ఈ కింద వివ‌రించిన నాలుగు డెట్ ఫండ్ల‌లలోనూ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. వీటిలో గ‌రిష్ట కాల‌వ్య‌వధి 12 నెల‌లు.

కాల‌వ్య‌వ‌ధి
లిక్విడ్ ఫండ్లు:
ఇందులో పెట్టిన పెట్టుబ‌డుల‌ను డెట్, మ‌నీ మార్కెట్ల‌లో తిరిగి పెట్టుబ‌డులుగా పెడ‌తారు. ఈ సెక్యూరిటీల మెచ్యూరిటీ 91 రోజుల త‌ర్వాత తీరిపోతుంది.
అల్ట్రా-షార్ట్ డ్యూరేష‌న్ ఫండ్లు:
ఇందులోనూ పెట్టిన పెట్టుబ‌డుల‌ను డెట్, మ‌నీ మార్కెట్ల‌లో తిరిగి పెట్టుబ‌డులుగా పెడ‌తారు. ఈ సెక్యూరిటీల మెచ్యూరిటీ 3 నుంచి 6 నెల‌ల లోపు ఉంటుంది.
మ‌నీ మార్కెట్ ఫండ్లు:
మ‌నీ మార్కెట్ ఫండ్లలో పెట్టిన పెట్టుబ‌డుల‌ను డెట్, మ‌నీ మార్కెట్ల‌లో తిరిగి పెట్టుబ‌డులుగా పెడ‌తారు. ఈ సెక్యూరిటీల మెచ్యూరిటీ ఏడాది త‌ర్వాత తీరిపోతుంది.

న‌గ‌దు ల‌భ్య‌త:
ఇందులోని యూనిట్ల‌ను వెంట‌నే రిడీమ్ చేసుకునే స‌దుపాయం ఉంది కాబ‌ట్టి న‌గ‌దు ల‌భ్య‌త అధికంగా ఉంటుంది.

రాబ‌డులు:
ఇందులోని రాబ‌డులు స్థిరంగా ఉండ‌వు, పైగా ఎలాంటి హామీ ఇవ్వ‌లేం. ప్ర‌స్తుతం వీటిపై మీరు ఏటా 7 శాతం రాబ‌డుల‌ను ఆర్జించ‌వ‌చ్చు. క‌చ్చిత‌మైన రాబ‌డులు తెలియాలంటే మీ పెట్టుబ‌డుల‌ను ఈ సెక్యూరిటీల మెచ్యూరిటీల‌తో పోల్చి పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది.

ప‌న్ను భారం:
ఇందులో 36 నెల‌ల పాటు పెట్టిన పెట్టుబ‌డుల‌పై ఆర్జించిన రాబ‌డుల‌ను వ్య‌క్తుల ఆదాయంలో ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని ప‌న్ను శ్లాబ్ ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు. అయితే 36 నెల‌ల‌కు మించి పెట్టిన పెట్టుబ‌డులపై ఆర్జించిన రాబ‌డుల‌పై ఇండేక్సేష‌న్ త‌ర్వాత 20 శాతం మేర ప‌న్ను ప‌డుతుంది.

ఇప్పుడు మీరు ఏం చేయాలంటే?
కేవ‌లం స్వ‌ల్ప‌కాలానికి పెట్టుబ‌డులు చేయాల‌నుకుంటే ప‌న్నులు చెల్లించిన త‌ర్వాత వ‌చ్చే రాబ‌డుల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోకండి. పైన వివ‌రించిన పెట్టుబ‌డి సాధ‌నాల‌లో ఆర్జించిన రాబ‌డులు వ్య‌క్తుల ఆదాయంలో ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని శ్లాబ్ క‌నుగుణంగా ప‌న్ను ప‌డుతుంది. మీరు స్వ‌ల్ప కాలానికి పెట్టుబ‌డులు చేయాల‌నుకుంటే అది మీకు సంప‌ద పెంచ‌డం కంటే మూల‌ధ‌న ప‌రంగా లాభ‌దాయ‌కంగా ఉండాలి.

భ‌ద్ర‌త కోసం స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే అధిక రాబ‌డుల విష‌యంలో రాజీ ప‌డ‌డం మంచిది కాదు. అలాగే అధిక రాబ‌డుల కోసం వెంప‌ర్లాడ‌కుండా ప్రాథ‌మికంగా భ‌ద్ర‌త‌, న‌గ‌దు ల‌భ్య‌త ఆధారంగా పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని