ఇలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆర్థికంగా సిద్ధంగా ఉండండి

సాధార‌ణంగా అయితే ఈ నెల‌లో జీతాల పెంపు లేదా ప్ర‌మోష‌న్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.....

Published : 24 Dec 2020 13:38 IST

సాధార‌ణంగా అయితే ఈ నెల‌లో జీతాల పెంపు లేదా ప్ర‌మోష‌న్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి

కొన్ని వారాల వ్యవధిలో, కోవిడ్ -19 మహమ్మారి భారతదేశం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం ఆర్థిక ప‌రిస్థితిని పూర్తిగా మార్చివేసింది. దేశంలో పరిశ్రమలు, కర్మాగారాలు, షాపింగ్ కేంద్రాలు మూత‌ప‌డ్డాయి. ఈ ఏడాది మ‌రింత విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక వేసుకున్న కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల‌ను తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు జీతాల‌లో కోత విధిస్తున్నాయి. సాధార‌ణంగా అయితే ఈ నెల‌లో జీతాల పెంపు లేదా ప్ర‌మోష‌న్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆర్థికంగా ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకోండి.

అత్య‌వ‌స‌ర నిధి:
ఇప్పుడు క‌రోనా వ‌చ్చినందుకే కాదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి అత్యవసర నిధి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి అనుకోకుండా ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌తో ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం, వేత‌నంలో కోత వంటివి ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చు. మీరు లిక్విడ్ ఫండ్ లేదా బ్యాంక్ డిపాజిట్లో తగినంత డబ్బును కలిగి ఉండ‌టం ముఖ్యం. అత్య‌వ‌స‌రి నిధిగా క‌నీసం 6 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా డ‌బ్బు ఉండాల‌న్న‌ది ఒక నియ‌మం. మీకు అత్యవసర నిధులు ఉంటే ఇలాంటి స‌మ‌యంలో ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులపై బ్యాంకులు అందించే తాత్కాలిక విరామాన్ని ఎంచుకోవలసిన అవసరం లేదు.

ఆరోగ్య బీమా:
చాలామంది వారు ప‌నిచేస్తున్న సంస్థ ఆరోగ్య బీమా ఇస్తున్నందున ప్ర‌త్యేక పాల‌సీల‌ను తీసుకోరు. కానీ, మీరు ఆ ఉద్యోగం కోల్పోయిన‌ప్పుడు ఆ బీమా ల‌భించ‌దు. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వ‌స్తే, మీకు ఆరోగ్య బీమా లేక‌పోతే ఏంటి ప‌రిస్థితి. చాలా పాల‌సీలు అన్ని ర‌కాల వ్యాదుల‌కు క‌వ‌రేజ్ కూడా ఇవ్వ‌వు. పైగా ముంద‌స్తు వ్యాదుల‌కు రెండేళ్ల వ‌ర‌కు వెయిటింగ్ పీరియ‌డ్ కూడా ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కు వైద్య ఖ‌ర్చుల‌కు హామీ ల‌భించ‌దు. అందుకే ఆరోగ్య బీమా పాల‌సీ ఇప్పుడు అవ‌స‌రం లేదు అనుకోకుండా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవ‌డం ముఖ్యం

రుణాల‌ను త‌గ్గించుకోండి:
దాదాపుగా అంద‌రికీ గృహ రుణం లేదా క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ వంటి రుణాలు ఉంటాయి. మీకు వేర్వేరు రుణాలు ఉంటే అన్నింటిని ఏకీకృతం చేయడానికి ప్రయత్నించండి. త‌న‌ఖా రుణాలు ఇత‌ర రుణాల కంటే త‌క్కువ‌గా ఉంటాయి. ఎక్కువ వ‌డ్డీ రేటు ఉన్న రుణాల‌ను ముందుగా చెల్లించండి.

పెట్టుబ‌డులు ఉప‌సంహ‌ర‌ణ‌:
మీరు కొన్ని పెట్టుబడులను ఉప‌సంహ‌రించుకోవ‌డం ద్వారా డబ్బును సేకరించవచ్చు. మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం మంచి ఆలోచన కాదు. ఈక్విటీయేతర నిధులు, బంగారం, స్థిర డిపాజిట్లు వంటి ఇతర పెట్టుబడులను వెన‌క్కి తీసుకోవ‌డాన్ని పరిగణించవచ్చు. ఒక సులభమైన ఎంపిక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణ, ఇందులో ఇప్పుడు వడ్డీ రేటు 7.1% కు తగ్గించారు. పెట్టుబడి ఆరు సంవత్సరాలకు మించి ఉంటే, ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. మూడేళ్లకు పైగా బీమా పాలసీలపై రుణాలు తీసుకోవడం కూడా సాధ్యమే.

మీ రోజువారి బడ్జెట్‌ను స‌వ‌రించుకోండి:
ప్రతి నెలా మీకు ఆదాయం వచ్చినప్పుడు ఇంటిని నడపడం సులభం. కానీ ఆదాయం ఆగిపోతే, చిన్న ఖర్చులు కూడా కష్టంగా కనిపిస్తాయి. అన్నింటినీ తగ్గించవద్దు, కానీ మీ ఇంటి బడ్జెట్ నుంచి అనవసరమైన ఖర్చులను త‌గ్గించుకుంటే, మీకు అవసరమైన ఖ‌ర్చుల‌కు స‌రిపోతాయి.

పెద్ద ఖ‌ర్చుల‌ను వాయిదా వేయండి:
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వేతన కోతలు, ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉన్నందున ఎక్కువ ఖ‌ర్చుతో కూడిన కొనుగోళ్లు ప్ర‌స్తుతం వాయిదా వేయ‌డం మంచిది. మందగమనం సాధారణంగా ఆర్థిక వ్యవస్థను, మీ ఉద్యోగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై స్పష్టత వచ్చేవరకు కొంచెం ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని