Indian Employees: ఉద్యోగం మారతామంటున్న భారతీయులు!

భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగం మారాలని భావిస్తున్నారట! తమ నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచుకొని ఉన్నత ఉద్యోగాలకు వెళ్లాలని యోచిస్తున్నారని ఓ ప్రముఖ సర్వే తేల్చింది....

Published : 13 Sep 2021 22:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగం మారాలని భావిస్తున్నారట! తమ నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచుకొని ఉన్నత ఉద్యోగాలకు వెళ్లాలని యోచిస్తున్నారని ఓ ప్రముఖ సర్వే తేల్చింది. దాదాపు 90 శాతం మంది కొత్త నైపుణ్యాల్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది. ఉద్యోగులపై కొవిడ్‌-19 ప్రభావం, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఓ అధ్యయనం చేపట్టింది. అమెజాన్‌ తరఫున ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే గ్లోబల్‌ డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. ఆగస్టు 17-23 తేదీల మధ్య ఈ సర్వే జరిగింది. మొత్తం 1000 మంది ఉద్యోగులు దీంట్లో పాల్గొన్నారు.

సర్వేలోని ఇతర కీలకాంశాలు...

* భారత్‌లో ఉద్యోగులు, వృత్తి నిపుణులు కొత్త, భిన్నమైన ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. దాదాపు 59 శాతం మంది ఉద్యోగం మారేందుకు యాక్టివ్‌గా ప్రయత్నిస్తున్నారు.

* వేతనాల్లో కోతకు కరోనాయే కారణమని దాదాపు 35 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు తాము పనిచేస్తున్న రంగం నుంచి ఇతర రంగానికి మారాలనుకుంటున్నారు. అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరు తక్షణమే మరింత అర్థవంతమైన ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారు.

* కొత్త ఉద్యోగంలో చేరానుకునేవారిలో 56 శాతం మంది ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు. 55 శాతం మంది జీతభత్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. 47 శాతం మంది సురక్షితమైన పని వాతావరణం ఉండాలనుకుంటున్నారు. 49 శాతం మంది మరింత ఉన్నతస్థాయికి వెళ్లేందుకు అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నారు.

* రానున్న ఐదేళ్లలో తమ నైపుణ్యాలకు కాలం చెల్లుతుందని 75 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. వీరిలో 90 శాతం మంది కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొవిడ్‌ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని 74 శాతం మంది తెలిపారు.

* ఉద్యోగంలో ఉన్నతస్థితికి వెళ్లాలంటే సాంకేతిక, డిజిటల్‌ నైపుణ్యాలు ఉండాలని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉండాలన్నారు.

* 76 శాతం మంది యువ ఉద్యోగులకు ఆయా సంస్థలు ఇప్పటికే కావాల్సిన అదనపు శిక్షణనిచ్చాయి. వీరిలో 97 శాతం మంది శిక్షణను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని