ఏటీఎమ్‌లో ఏమ‌ర‌పాటు వ‌ద్దు

మ‌న దేశంలో ఏటీఎమ్‌ల‌ ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య ఇప్ప‌టికే ఎక్కువ. జ‌న్ ధ‌న్ యోజ‌న విజ‌య‌వంతంతో బ్యాంకు ఖాతాలు మ‌రింత మందికి చేరువ‌య్యాయి. ప్ర‌భుత్వ రూపొందించిన‌ రూపే కార్డు వినియోగంతో డెబిట్ కార్డులు వాడే వారి సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంది. అదే స‌మ‌యంలో వీటి ద్వారా మోసాల‌కు గుర‌య్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతిక‌ను ..

Updated : 01 Jan 2021 19:47 IST

మ‌న దేశంలో ఏటీఎమ్‌ల‌ ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య ఇప్ప‌టికే ఎక్కువ. జ‌న్ ధ‌న్ యోజ‌న విజ‌య‌వంతంతో బ్యాంకు ఖాతాలు మ‌రింత మందికి చేరువ‌య్యాయి. ప్ర‌భుత్వ రూపొందించిన‌ రూపే కార్డు వినియోగంతో డెబిట్ కార్డులు వాడే వారి సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంది. అదే స‌మ‌యంలో వీటి ద్వారా మోసాల‌కు గుర‌య్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతిక‌ను వినియోగించి చేసే ఆర్థిక సైబ‌ర్ నేరాల సంఖ్య అధిక‌మ‌వుతున్న‌ నేప‌థ్యంలో ఏటీఎమ్‌ల ద్వారా కార్డు స‌మాచారం త‌స్క‌రించి మోసాల‌కు పాల్ప‌డే స్కిమ్మింగ్ గురించి తెలుసుకుందాం.

స్కిమ్మింగ్ అంటే…

సాధార‌ణంగా వినియోగ‌దార్లు ఏటీఎమ్‌కు వెళ్లిన‌పుడు త‌మ‌ కార్డును ఏటీఎమ్ స్లాట్ లో పెట్టి పిన్ వివ‌రాలు న‌మోదుచేస్తారు. కార్డు వివ‌రాల‌ను గుర్తించి ఏటీఎమ్ మెషిన్ లావాదేవీలు చేసేందుకు అనుమ‌తిస్తుంది. ఈ స్వ‌ల్ప‌కాలంలోనే మీ కార్డు స‌మాచారం మొత్తం చోరీకి గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఇదొక హైటెక్ మోసం . ఏటీఎమ్ వినియోగించే స‌మ‌యంలో కార్డు స‌మాచారాన్ని ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రం ద్వారా అప‌హ‌రించ‌డాన్ని స్కిమ్మింగ్ అంటారు. ఇలా సేక‌రించిన స‌మాచారంతో మోస‌గాళ్లు లావాదేవీలు చేయ‌డం లేదా క్లోనింగు చేసి న‌కిలీ కార్డుల‌ను త‌యారుచేయ‌డం వంటి ప్ర‌మాదాలు ఉంటాయి.

స‌మాచారాన్ని త‌స్క‌రిస్తారిలా

స‌మాచారాన్ని అప‌హ‌రించేందుకు ఉప‌యోగించే ప‌రిక‌రాన్ని స్కిమ్మ‌ర్‌ అంటారు.ఇది చూసేందుకు ఏటీఎమ్ కార్డు పెట్టే స్లాట్‌లో క‌లిసిపోయేట్టుగా ఉంటుంది. ఏటీఎమ్ కార్డు వివ‌రాల‌ను దొంగిలించేందుకు అవ‌స‌ర‌మ్యే కార్డురీడ‌ర్ ను ఇది క‌లిగి ఉంటుంది. కార్డురీడ‌ర్ అంటే స‌మాచారాన్ని సేక‌రించే ప‌రిక‌రం. ఏటీఎమ్ కార్డు మాగ్న‌టిక్ స్ట్రిప్ పై ఉన్న స‌మాచారాన్ని రీడ్ చేస్తుంది. ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డేవారు ఈ స్కిమ్మ‌ర్ల‌ను ఏటీఎమ్‌కు అమ‌ర్చి తద్వారా కార్డు వివ‌రాలు త‌స్క‌రిస్తారు.

పిన్‌ను అప‌హ‌రించేందుకు

  1. పిన్ న‌మోదుచేసే కీప్యాడ్ పై వేరొక స‌న్న‌ని పొర లాంటి దాన్ని అమ‌ర్చ‌డం చేస్తుంటారు. దీని ద్వారా పిన్ నంబ‌రును తెలుసుకుంటారు. కీప్యాడ్ పై పిన్ టైప్ చేసేట‌పుడు దానికి అమ‌ర్చిన స్కిమ్మ‌ర్ వెంట‌నే మోస‌గాళ్ల మొబైల్‌కు మెసేజీలు పంపే సాంకేతిక‌ను ఉప‌యోగిస్తున్నారు.
  2. పిన్ హోల్ ప‌రిమాణంలో ఉన్న కెమేరాను అమ‌ర్చి మీరు టైప్ చేసే పాస్‌వ‌ర్డ్ వివ‌రాల‌ను తెలుసుకుంటారు.

వ్య‌క్తుల ప్ర‌మేయం అవ‌స‌రం లేకుండా ఏం జ‌రుగుతుందో వినియోగ‌దార్ల‌కు తెలియ‌కుండా మొత్తం స‌మాచారాన్నిదొంగిలిస్తారు. స్కిమ్మ‌ర్ ద్వారా రికార్డు చేసిన కార్డు వివ‌రాల‌ను నేరుగా వారి కంప్యూట‌ర్ ల‌కు చేరేవిధంగా ఏర్పాటు చేస్తారు. ఇలా దొంగిలించిన స‌మాచారంతో ఆన్‌లైన్ షాపింగు, పీఓస్ ప‌రిక‌రాల‌ ద్వారా కొనుగోళ్లు, న‌కిలీ ఏటీఎమ్ కార్డుల త‌యారీ మోసాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి మోసాల‌ను గుర్తించాలంటే సామాన్య ప్ర‌జ‌ల‌కు స‌వాలే అని చెప్పాలి. ఎందుకంటే అంత చాక‌చ‌క్యంగా, తెలివిగా సాంకేతిక‌ నైపుణ్యాన్ని వినియోగించి మోసాలు చేస్తున్నారు. అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఇలాంటి వాటిని ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు.

వీటిని గ‌మ‌నించండి

ఏటీఎమ్ కి వెళ్ల‌గానే కార్డు స్లాట్‌ను గ‌మ‌నించాలి. స్కిమ్మింగు ప‌రిక‌రం అమ‌ర్చిన ఏటీఎమ్ కార్డు పెట్టే స్లాట్ ప‌రిమాణం పెద్ద‌గా ఉంటుంది.

ఏటీఎమ్ కు అతి సూక్ష్మ‌మైన కెమెరాలు లాంటి ప‌రిక‌రాలు ఏవైనా అమ‌ర్చారేమో చూడాలి. అలాంటి సూక్ష్మ ప‌రిక‌రాల ద్వారా మీరు టైప్ చేసే పాస్‌వ‌ర్డ్ ను అప‌హ‌రిస్తారు. ఎప్పుడూ వినియోగించే ఏటీఎమ్ అయితే ఏమైనా మార్పులు జ‌రిగితే వెంట‌నే ప‌సిగ‌ట్ట‌గ‌లం. కాబ‌ట్టి ఒక్కోసారి ఒక్కో ఏటీఎమ్ కాకుండా త‌క్కువ ఏటీఎమ్‌లు వినియోగించాలి.

ఏటీఎమ్ కార్డును స్లాట్ లో పెట్టేట‌పుడు నేరుగా పెట్టి తీస్తే దానిపై ఉన్న స‌మాచారం స్కిమ్మ‌ర్ ద్వారా రికార్డు అవుతుంది. కార్డును కొంచెం అటుఇటు క‌దిలించాలి.

ఏటీఎమ్ పిన్ న‌మోదుచేసే ప్యాడ్ పై ఏమైనా ప‌లుచ‌ని స్క్రీను లాంటివి అమ‌ర్చిఉన్నాయేమో ప‌రిశీలించాలి. పిన్ న‌మోదు చేసేట‌పుడు కీప్యాడ్ ను పూర్తిగా మూసివేయాలి. నేర‌గాళ్ల‌కు ఏటీఎమ్ కార్డు వివ‌రాలు తెలిసిన‌ప్ప‌టికీ పిన్ తెలియ‌క‌పోతే మోసం చేసే అవ‌కాశం తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని