ఆర్డీపై 8శాతం వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తున్నస్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌(ఎఫ్‌డీ)పై  మాత్ర‌మే కాకుండా రిక‌రింగ్ డిపాజిట్ల‌(ఆర్‌డీ)పై కూడా అధిక వ‌డ్డీ రేట్లు అందిస్తున్నాయి. 

Published : 26 Apr 2021 11:40 IST


ఎక్కువ మొత్తంలో డ‌బ్బు చేతిలో ఉన్న‌ప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది. అయితే అంద‌రికి ఇది సాధ్యం కాదు. ఉద్యోగం చేసే వారు, నెల‌వారి ఆదాయం పొందేవారు, ప్ర‌తీ నెల కొంత స్థిర‌మైన మొత్తాన్ని ఆదా చేయ‌గ‌లుగుతారు.  ముందుగా నిర్ణ‌యించిన మొత్తాన్ని ప్ర‌తీ నెల పెట్టుబ‌డి పెట్టే సౌక‌ర్యం ఆర్‌డీ ఖాతాలలో అందుబాటులో ఉంటుంది కాబ‌ట్టి అటువంటి వారికి రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలు స‌రిగ్గా స‌రిపోతాయి. చిన్న మొత్తాల‌ను పొదుపు చేసే వారికి ఈ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఎందుకంటే రూ. 100 లోపు త‌క్కువ మొత్తాన్ని కూడా ప్ర‌తి నెల ఇందులో ఆదా చేసుకోవ‌చ్చు.

వ‌డ్డీరేట్లు.. 

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాధార‌ణంగా 36 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఖాతాల‌పై అధిక వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కి, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24 నుంచి 36 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి క‌లిగిన రిక‌రింగ్ డిపాజిట్ల‌పై 8 శాతం వ‌డ్డీ అందిస్తుంది. 

అయితే చాలా వ‌ర‌కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 5 నుంచి 10 సంవ‌త్స‌రాల మ‌ధ్య గ‌ల‌ అధిక కాల‌ప‌రితి డిపాజిట్ల‌కు మాత్రం, ఇత‌ర కాల‌ప‌రిమితితో పోలిస్తే త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఇస్తున్నాయి. బ్యాంకు వెబ్‌సైట్ల ప్ర‌కారం 12, 15, 18, 21, 24 నెలలకు, బ్యాంక్ 7.25 శాతం వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తుండ‌గా అవే రేట్లు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ, 10 సంవత్సరాల వరకు గ‌ల ఆర్‌డీల‌కు ఆఫ‌ర్ చేస్తున్నాయి. 

రిక‌రింగ్ డిపాజిట్లపై జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 36  నుంచి 60 నెల‌ల మ‌ధ్య‌ కాల‌ప‌రిమితికి అత్య‌ధికంగా 7.25 శాతం ఇస్తుండ‌గా, 60 నుంచి 120 నెల‌ల కాల‌ప‌రిమితికి మాత్రం 6.50 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది. అదేవిధంగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 60 నెలల(ఐదేళ్లు) కాల‌ప‌రిమితికి అత్య‌ధికంగా 7.25 శాతం, 5 నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి 6.50 శాతం వ‌డ్డీ రేటును అందిస్తుంది. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండేళ్ల ఆర్డీపై అత్యధికంగా 7.50 వ‌డ్డీ రేటును అందిస్తుంది. ఇతర చిన్న ఫైనాన్స్ బ్యాంకులు  వివిధ కాల‌ప‌రిమితుల‌కు ఆర్‌డీ ఖాతాల‌పై 6.5 శాతం మొద‌లుకుని 7శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.

ఖాతాల‌ను తెరిచే ముందు ఇవి గుర్తించుకోండి..
* స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులలో ఆర్‌డీ ఖాతాను తెరిచినప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అన్ని బ్యాంకులు ముంద‌స్తు ఉపసంహరణను అనుమతిస్తాయి, కానీ 1శాతం జరిమానా విధిస్తాయి. 

* ఏదైనా బ్యాంకులో ఆర్‌డీ ఖాతాను తెర‌వాల‌నుకుంటే, ముందుగా పొదుపు ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది.  చాలా వ‌ర‌కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 6 నెల‌లు నుంచి గ‌రిష్టంగా 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి ఆర్‌డీ ఖాతాల‌ను తెరిచే వీలుక‌ల్పిస్తున్నాయి. క‌నీస పెట్టుబ‌డి మొత్తం రూ. 100

* నిబంధ‌న‌లు, ష‌ర‌తులు అన్ని స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకే విధంగా ఉండ‌వు. బ్యాంకును బ‌ట్టి మారుతుంటాయి.  ఉదాహరణకు, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, వెబ్‌సైట్‌లో పొందుప‌రిచిన వివ‌రాల ప్ర‌కారం, “నెలవారీ వాయిదాలు చెల్లించ‌డంలో త‌రచుగా విఫ‌లం అయినా,  వ‌రుస‌గా మూడు వాయిదాలు బాకీ ప‌డినా, ఆర్‌డీ ఖాతాను మూసివేసే హక్కు బ్యాంకుకు ఉంది”.

* ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కనీస పదవీకాలం 12 నెలలు, కనీస ప్రారంభ పెట్టుబడి రూ.1,000. అదేవిధంగా చాలా వ‌ర‌కు బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేట్ల కంటే ఎక్కువ ఆఫ‌ర్ చేస్తుంటాయి. అయితే  ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అధిక రేట్లు ఇవ్వదు.

ఇదీ చ‌ద‌వండి..
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారా? 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని