నాల్గ‌వ త్రైమాసికానికి అవే వ‌డ్డీ రేట్లు 

జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీరేట్లును య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది

Updated : 31 Dec 2020 16:31 IST

 

 

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ ప‌థ‌కాల‌పై 2020-21 నాల్గ‌వ (జ‌న‌వ‌రి 1, 2021 నుంచి మార్చి 31,2021 వ‌ర‌కు) త్రైమాసికానికి ముందున్న వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయ‌ని తాజాగా ప్ర‌క‌టించింది. చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది

పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌(ఎస్ఎస్‌వై), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్‌, సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌) వంటి చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం అందిస్తుంది. ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకించి ఏర్పాటు చేసిన సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కంలో అత్య‌ధిక వ‌డ్డీ రేటును కొన‌సాగిస్తుంది. 

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు, తాజా వ‌డ్డీ రేట్లు:
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్):
జనాదరణ పొందిన పన్ను ప్ర‌యోజ‌న‌కం క‌లిగిన‌, దీర్ఘకాలిక పొదుపు పథకం,  15 సంవత్సరాల మెచ్యూరిటీ స‌మ‌యం ఉంటుంది.  పెట్టుబడిదారులు 5 సంవత్సరాల తరువాత పాక్షిక ఉపసంహరణను పొందొచ్చు. అదేవిధంగా మ‌రో 15 సంవ‌త్స‌రాలు పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంది. ఖాతాను చురుకుగా ఉంచేందుకు సంవత్సరానికి కనీసం రూ. 500 డిపాజిట్ అవసరం.  ప్ర‌స్తుత వ‌డ్డీ 7.1 శాతం 

2. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్):
60 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన‌ పెట్టుబడిదారులు తమ జీవితకాలంలో రూ. 15 లక్షల వరకు సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకంలో జమ చేసి త్రైమాసికంగా క్ర‌మ‌మైన‌ ఆదాయాన్ని పొందవచ్చు. దీనికి 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంది. వ‌డ్డీ రేటు 7.4 శాతం. 

3. సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై):
అమ్మాయిల భ‌విష్య‌త్తు కోసం రూపొందించిన ప‌థ‌కం ‌ సుకన్య సమృద్ధి యోజన. ప్ర‌స్తుతం ఈ ఖాతా  తీసుకున్న వారికి 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక్క కుమార్తెకు ఒక అక్కౌంటు చొప్పున  ఇద్దరు కుమార్తెల పేరుపై గ‌రిష్టంగా 2 ఖాతాలు తెర‌వ‌వ‌చ్చు. పిల్లల వయస్సు 21 ఏళ్ళకు చేరుకున్న తర్వాత, మెచ్యూరిటీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

4. పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ ఖాతా:
1, 2, 3, 5 సంవత్సరాల కాలానికి  టైమ్ డిపాజిట్ల ఖాతాను మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోస్టాఫీసులో తెరవవచ్చు.  ఇది బ్యాంకులు అందించే ఫిక్సెడ్‌ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. 1, 2, 3 సంవత్సరాల పోస్టాఫీస్‌ టర్మ్ డిపాజిట్లు 5.5 శాతం , ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ 6.7 శాతం వ‌డ్డీని ఇస్తుంది.

5. ఐదు సంవత్సరాల పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్:
చిన్న నెలవారీ పెట్టుబడులతో, ఈ ఆర్‌డీ ఖాతాలు లాభదాయకమైన వడ్డీ రేట్లను అందిస్తాయి. పోస్టాఫీసులు అందించే ఈ పునరావృత డిపాజిట్ పథకంలో కొత్త పెట్టుబడిదారులకు 5.8 శాతం లభిస్తుంది.

6. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సి):
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంది. ఈ ప‌థ‌కంలో 6.8 శాతం వడ్డీని పొంద‌వ‌చ్చు. వ‌డ్డీని వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. కానీ మెచ్యూరిటీ స‌మ‌యంలో చెల్లిస్తారు. ఈ ప‌థ‌కం ద్వారా రూ.1000 పెట్టుబ‌డికి ఐదు సంవ‌త్స‌రాల త‌రువాత రూ. 1389.49 ల‌భిస్తుంది. 

7. కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ):
కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ) ఇప్పుడు 124 నెలల్లో (10 సంవ‌త్స‌రాల 4 నెల‌లు) మెచ్యూరిటీ లేదా విలువ రెట్టింపు అవుతుంది, ఇది 6.9 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని