రుణాలు త్వ‌ర‌గా చెల్లించేందుకు.. కొన్ని స్మార్ట్ టిప్స్ 

ఈఎమ్ఐ చెల్లింపులు క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం చూపుతాయి. స‌కాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు పెరుగుతుంది.  

Updated : 09 Sep 2021 14:36 IST

గ‌తంలో రుణం కావాలంటే.. బ్యాంకు బ్రాంచికి వెళ్లి లైన్‌లో నిలుచుని రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు. ఆమోదం కోసం రోజుల త‌ర‌బ‌డి వేచి చూసేవారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు కూడా ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అనుమ‌తిస్తున్నాయి. అలాగే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మంజూరు చేస్తూన్నాయి. రుణం వేగంగా పొంద‌డం గొప్ప సౌల‌భ్య‌మే. అయితే సుల‌భంగా ల‌భిస్తున్నాయి క‌దా.. అని అవ‌స‌రం లేని వాటికి రుణాలు తీసుకోవ‌డం మంచిది కాదు. ఎందుకంటే తీసుకున్న అప్పును స‌కాలంలో చెల్లించ‌డం చాలా ముఖ్యం.. ఆల‌స్యం అయితే అస‌లు, వ‌డ్డీకి అద‌నుపు రుసుములు తోడ‌వుతాయి. దీంతో  అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్ర‌మాదం ఉంది. 

సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు చాలా మంది గృహ రుణం కోసం ప్ర‌య‌త్నిస్తారు. రుణం మంజూరు అయితే..క‌ల నెర‌వేరింది అని చాలా సంతోషిస్తారు. ఈ సంతోషం ఎక్కువ కాలం కొన‌సాగాలంటే స‌కాలంలో ఈఎమ్ఐలు చెల్లించ‌డం అవ‌స‌రం. సరైన ప్ర‌ణాళిక ప్ర‌కారం రుణం తీసుకుంటే దీర్ఘ‌కాలంలో డ‌బ్బు ఆదా చేయ‌వ‌చ్చు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉండేందుకు ఇది మీకు స‌హాయ‌ప‌డుతుంది. 

వ‌డ్డీ రేట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కొన్ని రుణాల‌కు వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. గృహ‌, వాహ‌న రుణాల కంటే వ్య‌క్తిగ‌త రుణాల వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌టి కంటే ఎక్కువ  రుణాలు ఉన్నప్పుడు ముందుగా అధిక వ‌డ్డీ రేటు వ‌ర్తించే రుణాల‌ను చెల్లించేందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి. 

రుణాలు త్వర‌గా చెల్లించేందుకు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

శాల‌రీ..ఈఎమ్ఐ తేదీలు ప్ర‌క్క‌ప‌క్క‌నే ఉండేట్లు చూడాలి..
ఈఎమ్ఐ చెల్లింపులు క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం చూపుతాయి. స‌కాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. ఒక‌వేళ ఈఎమ్ఐ చెల్లింపుల్లో ఆల‌స్యం జ‌రిగినా, ఒక నెల ఈఎమ్ఐ చెల్లించ‌క‌పోయినా రుణ‌దాత జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది. ఈఎమ్ఐకి ఈ ఛార్జీలు కూడా తోడ‌వుతాయి. అంతేకాకుండా క్రెడిట్ స్కోరు కూడా త‌గ్గిపోతుంది. 

స‌రైన స‌మ‌యానికి ఈఎమ్ఐ చెల్లించాలంటే.. జీతం ఖాతాలో జ‌మైయ్యే తేదికి ద‌గ్గ‌ర‌లో ఈఎమ్ఐ చెల్లింపు తేది ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఈఎమ్ఐ చెల్లింపు స‌మ‌యానికి ఖాతాలో స‌రిప‌డ డ‌బ్బు ఉంటుంది కాబ‌ట్టి స‌కాలంలో ఈఎమ్ఐ చెల్లించే అవకాశం ఉంటుంది. 

డౌన్‌పెమెంట్ ఎక్కువ ఉండాలి..
దీర్ఘ‌కాల రుణాలు తీసుకునేప్పుడు డౌన్ పేమెంట్ ఎక్కువ‌గా ఉండేట్లు చూసుకోవాలి. ఇందుకోసం మీ ల‌క్ష్యాన్ని ఆధారంగా ముందు నుంచి మ‌దుపు చేయాలి. డ‌బ్బు మొత్తాన్ని ఒకే చోట కాకుండా వేరు వేరు పెట్టుబ‌డి సాధనాల్లో మ‌దుపు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. దీంతో ఎక్కువ మొత్తం స‌మ‌కూర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. 

గృహ రుణం వంటి దీర్ఘ‌కాల రుణాలు తీసుకున్న‌ప్పుడు ప్రారంభ సంవ‌త్స‌రాల‌లో మ‌నం చెల్లించే ఈఎమ్ఐలో ఎక్కువ శాతం వ‌డ్డీనే ఉంటుంది. డౌన్‌పేమెంట్ ఎక్కువ ఉంటే రుణం మొత్తం త‌గ్గుతంది. కాబ‌ట్టి వ‌డ్డీని కూడా త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో ఈఎమ్ఐ కూడా బాగా త‌గ్గుతుంది కాబ‌ట్టి  స‌కాలంలో సుల‌భంగా చెల్లించ‌గ‌లుగుతారు.

వ‌డ్డీ రేట్లు..
ప్ర‌స్తుతం మార్కెట్లో అనేక వ‌డ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకును బ‌ట్టి వ‌డ్డీ రేటు మారుతుంటుంది. అత్యుత్త‌మ వ‌డ్డీ రేట్లు పొందేంద‌కు, సేవా రుస‌ముల‌ను త‌గ్గించేందుకు రుణ‌దాత‌తో చ‌ర్చించాలి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న‌వారికి, వారి రుణ చ‌రిత్ర ఆధారంగా త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణాలు మంజూరు చేసే అవ‌కాశం ఉంది. వ‌డ్డీ రేటు త‌గ్గితే ఈఎమ్ఐ కూడా త‌గ్గుతుంది కాబ‌ట్టి రుణ చెల్లింపులు సుల‌భం అవుతాయి. 

స్వల్ప కాల‌ప‌రిమితి..  
దీర్ఘ‌కాల రుణాలు తీసుకునేప్పుడు  ప‌రిగ‌ణించాల్సిన అంశాల‌లో కాల‌ప‌రిమితి ఒక‌టి. త‌క్కువ కాల‌ప‌రిమితి ఎంచుకుంటే.. ఈఎమ్ఐ కొంత పెరిగ‌న‌ప్ప‌టికి వ‌డ్డీ త‌గ్గుతుంది కాబ‌ట్టి త‌క్కువ స‌మ‌యంలోనే రుణాలు తిరిగి చెల్లించేయ‌వ‌చ్చు. 

ఎక్కువ రుణాలు ఉంటే..
ఒక‌టి కంటే ఎక్కువ రుణాలు ఉంటే, వాటిని.. సంబంధిత ఈఎమ్ఐలు ట్రాక్ చేయ‌డం క‌ష్టం అవుతుంది. స‌కాలంలో ఈఎమ్ఐ  చెల్లించ‌లేక‌పోవ‌చ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు స‌కాలంలో చెల్లించ‌క‌పోతే వ‌ర్తించే వ‌డ్డీ రేటు కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి రుణాల‌న్నింటిని ఒక‌చోట చేర్చ‌డం మంచిది. 

ఒకే రుణం ఉంటే ఒకే అనుబంధ వ‌డ్డీ రేటు ఉంటుంది. ఒకే ఈఎమ్ఐ ఉంటుంది. ప్ర‌స్తుతం బ్యాంకులు.. రుణాల‌పై ఆక‌ర్ష‌ణీయమైన ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి. వ‌డ్డీ భారాన్ని త‌గ్గించుకుని.. త్వ‌ర‌గా అప్పు తీర్చేందుకు ఇదొక మంచి మార్గం. దీంతో ఆర్థిక నిర్వ‌హ‌ణ సుల‌భం అవుతుంది. 

రుణ బ‌దిలీ..
వ‌డ్డీ రేటు వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటుంది. ప్ర‌స్తుతం మీరు వ్య‌క్తిగ‌త రుణం తీసుకుని ఉంటే.. మీ బ్యాంకు విధిస్తున్న వ‌డ్డీ రేటును ఇత‌ర బ్యాంకులు అందిస్తున్న వ‌డ్డీ రేటుతో పోల్చి చూడాలి. వ‌డ్డీ ఎక్కువ‌గా ఉంది అనిపిస్తే.. త‌క్కువ వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తున్న బ్యాంకుకు రుణాన్ని బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అయితే ఇందుకు మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి.  బ‌దిలీ చేసేప్పుడు వ‌డ్డీ రేటుతో పాటు ప్రాసిసింగ్ ఫీజు, కాల‌ప‌రిమితి వంటి వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ప్ర‌యోజ‌నక‌రంగా ఉంటే.. బ‌దిలీ చేయ‌వ‌చ్చు. 

చివ‌రిగా..
తీసుకున్న అప్పు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో.. స‌కాలంలో చెల్లించ‌డం వ‌ల్ల రుణ చరిత్ర మెరుగుప‌డ‌డంతో పాటు క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. దీంతో దీర్ఘ‌కాలంలో అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. భ‌విష్య‌త్తులో త్వ‌రిత గ‌తిన రుణం పొందాల‌న్నా, ఒక రుణం ఉండ‌గానే.. మ‌రొక రుణం తీసుకోవాల‌న్నా క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని