మార్కెట్‌లోకి మ‌రోసారి సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కం

ఈ సావ‌రిన్ బంగారు బాండ్లపై మెచ్యూరిటీ (ప‌రిప‌క్వ‌త‌) త‌ర్వాత మూల‌ధ‌న లాభాల‌పై ప‌న్ను ఉండ‌దు.

Published : 12 Jul 2021 12:54 IST

సావ‌రిన్ బంగారు బాండ్ ప‌థ‌కం చందా కోసం ఈ రోజు తెరుచుకుంటుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర‌ను ఒక గ్రాముకు రూ. 4,807గా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యించింది. ఈ సావ‌రిన్ బంగారు బాండ్లపై మెచ్యూరిటీ (ప‌రిప‌క్వ‌త‌) త‌ర్వాత మూల‌ధ‌న లాభాల‌పై ప‌న్ను ఉండ‌దు.  సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం 2015లో ప్రారంభించిన‌ప్ప‌టి నుండి ప్ర‌భుత్వం రూ. 25 వేల కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం సార్వ‌భౌమ బంగారు బాండ్ యొక్క 4వ భాగం ఈ రోజు చందా కోసం ప్రారంభ‌మైంది. ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,807గా నిర్ణ‌యించ‌గా, ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకుని పెట్టుబ‌డి పెట్టేవారికి గ్రాముకి రూ. 50 త‌గ్గింపు ల‌భిస్తుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 సిరీస్ 4 ఈ శుక్ర‌వారం జులై 16న స‌బ్‌క్రిప్ష‌న్‌ కోసం ముగుస్తుంది. బంగారు బాండ్లు పెట్టుబ‌డిదారుల‌కు 2.50% వార్షిక వ‌డ్డీ రేటును  అందిస్తున్నాయి.

సార్వ‌భౌమ బంగారు బాండ్ ప‌థ‌కం తాజా ద‌శ గురించి తెలుసుకోవ‌ల‌సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలుః

1) డిజిట‌ల్ లేదా పేప‌ర్ బంగారం ద్వారా భౌతిక ర‌హిత బంగారంపై పెట్టుబ‌డి పెరుగుతుంది. గ‌త కొన్ని వారాలుగా బంగారం ధ‌ర‌ల‌లో ధృఢ‌త్వం కార‌ణంగా అధిక ఆస‌క్తి ఉంది.

2) 2015లో ఈ ప‌థ‌కం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి 2021 మార్చి చివ‌రి వ‌ర‌కు సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం ద్వారా మొత్తం రూ. 25,702 కోట్లు సేక‌రించారు.

3) బంగారం దిగుమ‌తులు త‌గ్గించి ఆర్థిక లోటును అదుపు చేయ‌డానికి నిరంత‌రం కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది.  భౌతిక బంగారు క‌డ్డీలు, నాణేలు కొన‌డం, నిల్వ చేయ‌డం, అమ్మ‌డం వంటి ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వం ఆదా చేస్తోంది.

4) ఇండియా బులియ‌న్ అండ్ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ లిమిటెడ్ ప్ర‌క‌టించిన 999 స్వ‌చ్ఛ‌త బంగారం ముగింపు స‌గ‌టు ధ‌ర ఆధారంగా చందా కాలానికి ముందు వారంలోని చివ‌రి 3 ప‌ని దినాల‌ ధ‌ర ఆధారం చేసుకుని బాండ్ ధ‌ర భార‌త క‌రెన్సీ రూపాయిల‌లో నిర్ణ‌యించ‌బ‌డింది.

5) ప్రాధ‌మికంగా 1 గ్రాము నుండి అనేక గుణ‌కాల‌లో బంగారం బాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 8 సంవ‌త్స‌రాలు బాండ్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే 5వ సంవ‌త్స‌రం త‌ర్వాత నిష్క్ర‌మ‌ణ అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నీసం అనుమ‌తించ‌ద‌గిన పెట్టుబ‌డి 1 గ్రాము బంగారం. చందా యొక్క గ‌రిష్ట ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు, హెచ్‌యూఎఫ్‌కు 4 కిలోలు మ‌రియు ట్ర‌స్ట్‌ల‌కు 20 కిలోల వ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

6) ఈ బాండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించ‌డం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని అంటే డైర‌క్ట్‌గా బంగారం లాంటివి కొన‌కుండా, ఆర్థిక పొదుపుగా మార్చాల‌నే ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 2015లో ప్రారంభించారు.

7) ఈ బాండ్లు బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మిన‌హా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), సెల‌క్ట్ చేయ‌బ‌డిన‌ పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా విక్ర‌యించ‌బ‌డ‌తాయి.

8) మెచ్యూరిటి (ప‌రిప‌క్వ‌త‌) ధ‌ర అప్ప‌టి బంగారం ధ‌ర‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని