
డ్రోన్ల ద్వారా సరఫరాకు
స్పైస్‌ఎక్స్‌ప్రెస్, డెలివరీ జట్టు
3-4 నెలల్లో ప్రయోగాత్మక సేవలు
దిల్లీ: డ్రోన్ల ద్వారా సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పైస్‌జెట్‌కు చెందిన సరకు సరఫరా సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్, ఇ కామర్స్ లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్ డెలివరీ జట్టుకట్టాయి. రాబోయే 3-4 నెలల్లో ప్రయోగాత్మక సేవలు ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. బియాండ్ విజ్యువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్ఓఎస్) డ్రోన్లపై దేశీయంగా ప్రయోగాలు చేసేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తుది జాబితాలో చేర్చిన సంస్థల్లో స్పైస్‌ఎక్స్‌ప్రెస్ ఒకటి. ‘మేం ఈ ప్రాజెక్టుపై ఎంతో ఉత్సుకతతో ఉన్నాం. రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులకు ఇది శ్రీకారం చుడుతుంది. ఈ ఒప్పందం ఇరు సంస్థలకు ప్రయోజనకరమేన’ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్ సీఈఓ సంజీవ్ గుప్తా తెలిపారు. అత్యవసర సేవలు, సరకు సరఫరా, క్లిష్టమైన వైద్య సేవలు, పర్యావరణ పరిరక్షణ విధులు కూడా పరీక్షిస్తారు.
సంక్షిప్తంగా
15.39 లక్షల కొవిడ్ క్లెయిమ్‌ల పరిష్కారం
జూన్ 22 నాటికి 15.39 లక్షలు లేదా 80 శాతం కొవిడ్-19 ఆరోగ్య క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సెటిల్ చేసినట్లు ఐఆర్డీఏఐ సభ్యుడు (నాన్ లైఫ్) టీఎల్ అలమేలు తెలిపారు. వీటి విలువ రూ.15000 కోట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు బీమా సంస్థలకు 19.11 లక్షలకు పైగా కొవిడ్-19 క్లెయిమ్‌లు వచ్చాయి. అసోచామ్ నిర్వహించిన 13వ అంతర్జాతీయ బీమా ఇ-సదస్సులో ఆమె మాట్లాడారు. 55,276 మరణ క్లెయిమ్‌లు రాగా.. రూ.3,593 కోట్ల విలువైన 48,484 క్లెయిమ్ (88 శాతం)లను జీవిత బీమా సంస్థలు పరిష్కరించినట్లు వెల్లడించారు.
గో ఎయిర్‌లైన్స్ బోర్డు నుంచి అపూర్వా దివాన్జీ నిష్క్రమణ
బోర్డు నుంచి స్వత్రంత డైరెక్టర్లలో ఒకరైన అపూర్వా దివాన్జీ వైదొలగినట్లు గో ఎయిర్‌లైన్స్ (ఇంతకు ముందు గో ఎయిర్) వెల్లడించింది. జూన్ 1 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చిందని తెలిపింది. 10 ఏళ్ల పాటు కంపెనీ బోర్డులో కొనసాగిన ఆమె వృత్తిగతమైన కారణాలతో తప్పుకున్నట్లు వివరించింది.
డిస్నీ+ హాట్‌స్టార్ 250 నియామకాలు
దేశంలో వివిధ స్థాయిలు, విభాగాల్లో దాదాపు 250 నియామకాలు చేపట్టనున్నట్లు కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ రంగంలోని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు మరింత పోటీ ఇవ్వడానికి హాట్‌స్టార్ చూస్తోంది. ఇంజినీరింగ్, ప్రోడక్ట్, మార్కెటింగ్, వృద్ధి, కంటెంట్, రెవెన్యూ విభాగాల్లో కొత్త నియామకాలు ఉంటాయని హాట్‌స్టార్ తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రేట్లు యథాతథం
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేట్లను రికార్డు కనిష్ఠమైన 0.1 శాతంగా కొనసాగించింది. కరోనా వైరస్ లాక్డౌన్ ఆంక్షలను చాలా వరకు సడలించడంతో బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.5 శాతం పెంచింది. కీలక రుణ రేట్లను యథాతథంగా ఉంచడానికి పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది