‘స్పుత్నిక్‌’ టీకా 20 కోట్ల డోసుల తయారీకి భారత కంపెనీతో ఒప్పందం

రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన ‘స్పుత్నిక్‌ వి’ కొవిడ్‌-19 టీకాను మనదేశానికి చెందిన స్టెలిస్‌ బయోఫార్మా తయారు చేయనుంది. దాదాపు 20 కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి..........

Published : 20 Mar 2021 16:54 IST

 

 

దిల్లీ: రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన ‘స్పుత్నిక్‌ వి’ కొవిడ్‌-19 టీకాను మనదేశానికి చెందిన స్టెలిస్‌ బయోఫార్మా తయారు చేయనుంది. దాదాపు 20 కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. స్టెలిస్‌ బయోఫార్మా, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కు బయోఫార్మాస్యూటికల్స్‌ విభాగం. మనదేశంలో ఆర్‌డీఐఎఫ్‌ తరఫున భాగస్వామిగా ఉన్న ఎస్నో హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌పీ., తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టెలిస్‌ బయోఫార్మా పేర్కొంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి టీకా సరఫరా ప్రారంభించాల్సి ఉంది. అవసరాలను బట్టి ఇంకా అధిక డోసులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టెలిస్‌ బయోఫార్మా వివరించింది. స్పుత్నిక్‌ వి టీకాను పెద్ద సంఖ్యలో సరఫరా చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆర్‌డీఐఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కిరిల్‌ డిమిట్రివ్‌ పేర్కొన్నారు.

యూకేకు అధికంగా టీకా డోసులు  పంపుతాం..సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌: ఆస్ట్రజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకాను యూకే అవసరాలకు అనుగుణంగా అధికంగా సరఫరా చేయడానికి ప్రయత్నిస్తామని మనదేశానికి చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) స్పష్టం చేసింది. ఈ టీకాను మనదేశంలో ‘కొవిషీల్డ్‌’ పేరుతో ఎస్‌ఐఐ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్‌-19 టీకాల సరఫరా తగ్గినట్లు ఇటీవల యూకేలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై ఎస్‌ఐఐ ప్రతినిధి స్పందిస్తూ కొద్ది వారాల క్రితమే యూకేకు 50 లక్షల డోసులు టీకా సరఫరా చేశామని, తదుపరి మరికొన్ని డోసులు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించనున్నట్లు పేర్కొన్నారు. మనదేశంలో టీకా అవసరాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.

ఇవీ చదవండి...

టీసీఎస్‌ ఉద్యోగులకు వేతనపెంపు

మీ క్రెడిట్‌కార్డు రివార్డు పాయింట్ల విలువ తెలుసా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని