ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందం నిలపండి

రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ చేసుకున్న రూ.24,713 కోట్ల విలీన ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూ సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ (ఈఏ) ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియమ్‌ సుప్రీంకోర్టుకు మంగళవారం విన్నవించారు.

Published : 21 Jul 2021 01:06 IST

సుప్రీంకోర్టుకు నివేదించిన అమెజాన్‌

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ చేసుకున్న రూ.24,713 కోట్ల విలీన ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూ సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ (ఈఏ) ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియమ్‌ సుప్రీంకోర్టుకు మంగళవారం విన్నవించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు వింటోంది. సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) ఈఏ అవార్డును దిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ సమర్థిస్తూ ఒప్పందాన్ని నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఫ్యూచర్‌ గ్రూప్‌ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లడంతో అక్కడ స్టే వచ్చిందని గోపాల్‌ వివరించారు. సుప్రీంకోర్టు బెంచ్‌ తదుపరి వాదనలను ఈ గురువారం లేదా వచ్చే మంగళవారం వినే అవకాశం ఉందని తెలుస్తోంది.


వినియోగదారు ల్యాప్‌టాప్‌ విపణిలోకి ఫుజిత్సు

దిల్లీ: జపాన్‌కు చెందిన ఐటీ హార్డ్‌వేర్‌ కంపెనీ ఫుజిత్సు భారత వినియోగదారు ల్యాప్‌టాప్‌ విపణిలోకి అడుగుపెడుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. 2022 మార్చి నాటికి దేశంలో 10,000 ప్రీమియం నోట్‌బుక్‌లు విక్రయించాలనే ప్రణాళికతో ఉన్నట్లు పేర్కొంది. భారత్‌లో వ్యాపార నిర్వహణకు నిర్వ ఫ్లెక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పంపిణీ, విక్రయానంతర సేవలను ఫ్లెక్స్‌ అందిస్తుంది. ఇప్పటివరకు వ్యాపార పీసీలను ఫుజిత్సు దేశీయంగా విక్రయిస్తోంది. ప్రీమియం వినియోగదార్ల కోసం ఇప్పుడు నోట్‌బుక్‌లను విడుదల చేస్తున్నట్లు యూహెచ్‌ఎక్స్‌ సిరీస్‌ నోట్‌బుక్‌ల విడుదల సందర్భంగా ఫుజిత్సు క్లయింట్‌ కంప్యూటింగ్‌ (ఎఫ్‌సీసీఎల్‌) ప్రెసిడెంట్‌, సీఈఓ తకేషి ఒకుమా వెల్లడించారు. యూహెచ్‌-ఎక్స్‌, యూహెచ్‌-ఎక్స్‌ 2ఇన్‌1 నోట్‌బుక్‌ల ప్రారంభ ధర రూ.80,990-86,990గా నిర్ణయించింది. రెండేళ్ల వారెంటీ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ నెల 26 నుంచి అమెజాన్‌లో ఈ 2 ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఎఫ్‌సీసీఎల్‌ ప్రధానంగా లెనోవో నేతృత్వంలో ఉంది. ఫుజిత్సు గ్రూప్‌నకు ఆ కంపెనీలో 44 శాతం వాటా ఉంది.


పబ్లిక్‌ ఇష్యూకు పాలసీ బజార్‌ మాతృసంస్థ

పాలసీ బజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.6,500 కోట్లు సమీకరించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన దరఖాస్తు పత్రాలను ఈ నెలలోనే కంపెనీ సమర్పించనున్నట్లు సమాచారం. నవంబరు- డిసెంబరులో పబ్లిక్‌ ఇష్యూ నిర్వహించి షేర్లు నమోదు చేయాలని కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని