Financial Planning: ఈ ప‌ని 20 ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది... అని అనిపిస్తోందా?

పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు వాటిని దీర్ఘ కాలం పాటు కొన‌సాగించిన‌ప్పుడే క‌లుగుతాయి. దీనినే చ‌క్ర‌వ‌డ్డీ మ్యాజిక్ గా చూస్తారు. అందుకే క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేప్పుడు ఎక్కువ చ‌క్ర‌వ‌డ్డీ పొందే విధంగా చూసుకోవాలి.

Updated : 23 Jan 2022 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మొక్క నాట‌డం, ఆర్థిక ప్రణాళిక రెండూ ఒక్కటే అంటుంటారు నిపుణులు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటిన మొక్క ఇప్పుడు మ‌హావృక్ష‌మై తీయ‌ని ఫ‌లాల‌ను అందిస్తుంది. అలాగే 20 ఏళ్ల క్రితం జీవితంలో మొదలుపెట్టిన ఆర్థిక‌ ప్ర‌ణాళిక మీకు అవసరమైన సమయంలో ఆర్థిక ఫలాలను అందిస్తుంది. ఈ లెక్కేంటి, దాని వివరాలేంటో చూద్దాం!

ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక ప్ర‌కారం మ‌నిషి ఆయుః ప్ర‌మాణం 1960ల్లో 52 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి 72ఏళ్ల‌కు చేరుకుంది. అంటే మ‌నిషి స‌గ‌టు జీవించే వ‌య‌సు పెరుగుతూ వ‌స్తోంది. ఇది శుభ‌ప‌రిణామ‌మే. అయితే అంత కాలంపాటు జీవించేందుకు స‌రి ప‌డా ఆర్థిక వ‌న‌రుల‌ను స‌మకూర్చుకోవ‌డంలోనే అస‌లు శ్ర‌మ దాగి ఉంది.దేశంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు సాధార‌ణంగా 60 ఏళ్లు. అప్ప‌టి నుంచి ప్ర‌ధాన ఆదాయాన్ని కోల్పోతారు. ఎక్కువ సంద‌ర్భాల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిగా దాచుకున్న సొమ్మునే ఉప‌యోగించాల్సి ఉంటుంది.

పొదుపు చేసే విధానంలో మార్పు...

సంప‌ద సృష్టి త‌గినంత చేసుకునేందుకు పొదుపు చేసే విధానాన్ని మార్చుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. మ‌న దేశంలో పెట్టుబ‌డులు దాదాపు సంప్ర‌దాయ‌, క‌చ్చిత‌మైన‌ రాబ‌డినిచ్చే ప‌థ‌కాల్లోనే పెడుతుంటారు. ఇలా పెట్టుబ‌డులు పెట్ట‌డంలో త‌ప్పు లేదు. అయితే త‌గ్గే వ‌డ్డీ రేట్లు, పెరిగే ద్ర‌వ్యోల్బ‌ణంతో పోలిస్తే చివ‌రికి మిగిలేది కొంతే. ఆర్థిక ల‌క్ష్యాలు నిర్దేశించుకోవ‌డంలోనూ విఫ‌ల‌మ‌వుతుంటారు. అన్ని ర‌కాల లక్ష్యాల‌కు పెట్టుబ‌డులు ఒకే విధంగా చేసుకుంటూ వెళుతుంటారు. జీవితంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చాలా ముఖ్య‌మైన‌ది. ఇది చివ‌రాఖ‌రులో ఉంటుంది కాబ‌ట్టి సాధార‌ణంగానే దీనిపై నిర్ల‌క్ష్యం ఎక్కువ‌.

నెల‌కు రూ.500ల‌తో…

పొదుపు చేయాల‌నుకునేవారు లక్ష్యాన్ని నిర్దేశించుకొని మ్యూచువ‌ల్ ఫండ్ లాంటి మార్కెట్ ఆధారిత ప‌థ‌కాల్లో మెల్ల‌మెల్ల‌గా పెట్టుబ‌డి ప్రారంభించ‌డం మంచిది. కేవ‌లం నెల‌కు ₹500ల‌తో రిక‌రింగ్ డిపాజిట్ మాదిరిగా ఉండే సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను ప్రారంభించ‌డం లాభ‌దాయ‌కం. సిప్‌ను గుడ్ ఈఎమ్ఐగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ వాయిదా చెల్లించేది పెట్టుబ‌డికే త‌ప్ప అప్పు కోసం చెల్లించే వాయిదా కాదు అని గుర్తుంచుకోవాలి.

20 ఏళ్ల‌ల్లో రూ.కోటి

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే ఫ‌లితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నెల‌కు కనీసం ₹500తో పెట్టుబ‌డి పెట్టేందుకు అవ‌కాశం ఉంది. అయితే ఇక్క‌డ క‌నీసం నెల‌కు ₹10 వేలు పెట్టుబ‌డి పెట్టే ఉదాహ‌ర‌ణ చూద్దాం. వార్షిక  వ‌డ్డీ 12 శాతం వ‌స్తుంద‌నుకుందాం. ఇలా 20 ఏళ్ల‌పాటు నెల నెలా ₹10వేలు మ‌దుపు చేస్తూ ఉంటే చివ‌ర‌కు సుమారు ₹కోటి చేతికందుతుంది. అదే 30 ఏళ్ల‌లో ₹3.5 కోట్లు జ‌మవుతుంది. దానిపై ప్ర‌స్తుత‌మున్న ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల ప్ర‌కారం ఎటువంటి ప‌న్ను ఉండ‌దు.

సిప్ ప‌రిమాణాన్ని పెంచుకుంటూ వెళ్తే...

సాధార‌ణ స్టాండ‌ర్డ్ సిప్‌ల‌తోనే ఇంత‌గా ప్ర‌యోజ‌నం ఉంటే స్టెప్ అప్ లేదా టాప్ అప్ సిప్‌ల‌కు ఇంకెంత ఉంటుంది. వీటితో సంవ‌త్స‌రానికి లేదా కావాల్సిన టైమ్‌లో సిప్ విలువ‌ను పెంచుకునే సౌల‌భ్యం ఉంటుంది. ప్ర‌స్తుతం చేసే పెట్టుబ‌డి కంటే ఏడాదికి ₹10 వేలు లేదా 10 శాతం పెంచిన‌ట్ట‌యితే...  12 శాతం చ‌క్ర‌వ‌డ్డీతో 20 ఏళ్ల‌లో ₹1.58 కోట్లు అందుకోగ‌లుగుతాం. 30 ఏళ్ల‌కు ₹6 కోట్లు చేతిలో ఉండ‌వ‌చ్చు. స్టెప్ అప్ సిప్ లో అందుకునే సొమ్ము సాధార‌ణ స్టాండ‌ర్డ్ సిప్ ద్వారా వ‌చ్చే సొమ్ముకు దాదాపు రెట్టింపుగా ఉంటుంది. దీనికి కూడా ఎటువంటి ప‌న్ను లేదు.

చ‌క్ర‌వ‌డ్డీ మ‌హిమ‌

పెట్టుబ‌డుల‌పై ఏటా 10 శాతం సొమ్మును పెంచుకుంటూ వెళ్ల‌డం ద్వారా జ‌మ అయ్యే మొత్తం దాదాపు రెట్టింపు ఎలా అవుతుంద‌ని ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. అయితే ఇదంతా చ‌క్ర‌వ‌డ్డీ మ‌హిమ‌. ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త‌ ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ దీనిని ప్ర‌పంచ ఎనిమిదో వింత‌గా అభివ‌ర్ణించిన విషయం మీకు తెలిసే ఉంటుంది.

దీర్ఘ‌కాల ప్ర‌యోజ‌నాలకు...

సంప‌ద సృష్టించుకునే చాలా అవ‌కాశాల‌ను కోల్పోతుంటాం. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డులు కొన‌సాగించ‌క‌పోవ‌డం, సిప్ తేదీల‌ను రెన్యూవ‌ల్ చేయించ‌కపోవ‌డం లాంటివి వీటిలో కొన్ని. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డిదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా పెర్‌పెచ్చువ‌ల్ సిప్ అనే కొత్త కాన్సెప్ట్‌తో మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ముందుకొచ్చాయి. పెర్‌పెచ్చువ‌ల్ సిప్ అంటే దీనికి కాల‌ప‌రిమితి అంటూ ఉండ‌దు. ఎన్నేళ్ల‌యినా సిప్ కొన‌సాగుతూనే ఉంటుంది.

తాత్కాలికంగా నిలిపివేత‌

పెర్‌పెచ్యువ‌ల్ సిప్‌ను ప్రారంభించిన‌ప్పుడు పెట్టుబ‌డి సొమ్మును మార్చుకునేందుకు లేదా తాత్కాలికంగా సిప్ వాయిదాను నిలిపివేసే అవకాశమూ ఉంది. చాలా మ్యూచువ‌ల్ ఫండ్లు ఫ్లెక్సిబుల్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తున్నాయి. ఒక‌టి లేదా రెండు నెల‌ల పాటు సిప్ చెల్లించ‌లేక‌పోతే దానిని తాత్కాలికంగా నిలిపివేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. తిరిగి మీకు కావాల్సినప్పు సిప్‌ను ప్రారంభించుకోవ‌చ్చు. సిప్ విలువ‌ను పెంచుకునేందుకు, త‌గ్గించుకునేందుకూ కొన్ని సంస్థ‌లు అనుమ‌తిస్తున్నాయి.

సిప్ తేదీలో మార్పు

కొన్నిసార్లు ఉద్యోగం మారిన‌ప్పుడు, వేతనం అందుకునే తేదీల్లో మార్పు ఉండ‌వ‌చ్చు. ఒకటో తారీఖున అందుకునే జీతం 20న అందుకుంటాం. అలాంట‌ప్పుడు సిప్ తేదీని మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సిప్‌లలో ఈ అవ‌కాశమూ ఇస్తున్నారు. అయితే ఇలాంటి వెసులుబాటును మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు క‌ల్పిస్తున్నాయో లేదో ముందే అడిగి తెలుసుకొని తర్వాత పెట్టుబడి పెట్టాలి.

మొక్క నాట‌డ‌మూ అంతే...

ఎంత త్వ‌ర‌గా ఇన్వెస్ట్ చేయ‌డం ప్రారంభిస్తే దీర్ఘ‌కాలంలో అంత మంచి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లం. ఉదాహ‌ర‌ణ‌కు నెల‌కు ₹10 వేల చొప్పున పెట్టుబ‌డి పెడుతున్న‌ట్ల‌యితే 30 ఏళ్ల‌లో 12 శాతం వ‌డ్డీతో ₹3.53 కోట్లు అవుతాయి. అదే సొమ్ము 10 ఏళ్ల‌లో జ‌మ‌ చేసుకోవాలంటే నెల‌కు ₹1.5లక్ష‌లు పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. అంటే 15 రెట్లు ఎక్కువ‌న్న మాట‌. 40 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌వారు... పెట్టుబ‌డి గురించి ఆలోచించ‌డం వ‌ల్ల ఇన్నేళ్ల త‌మ అవ‌కాశాన్ని పోగొట్టుకున్న‌వారే అవుతారు. కాబ‌ట్టి ఆ ప‌ని 20 ఏళ్ల కిందే మొద‌లు పెట్టి ఉంటే ఈ పాటికి సంప‌ద సృష్టించుకున్న‌వార‌వుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని