ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ప్ర‌ణాళిక ఏర్పాటు చేసుకున్నారా !

ఎంత త్వ‌ర‌గా మీరు పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అంత ఎక్కువ‌గా లాభం పొంద‌వ‌చ్చు​​​​​​....

Published : 18 Dec 2020 17:20 IST

ఎంత త్వ‌ర‌గా మీరు పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అంత ఎక్కువ‌గా లాభం పొంద‌వ‌చ్చు​​​​​​​.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవ‌నం గ‌డ‌పాలంటే వీలైనంత‌ త్వ‌ర‌గా దీనికోసం ప్ర‌ణాళిక‌ను ఏర్ప‌రుచుకోవాలి. దీర్ఘ‌కాలీక ప్ర‌ణాళిక ఏర్పరుచుకోవ‌డం వ‌ల్ల‌ మీ ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు దోహ‌దం చేస్తుంది. పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇప్పుడు చాలా మార్గాలున్నాయి. అయితే రిస్క్‌, రాబ‌డి, ఆర్థిక ల‌క్ష్యం వంటి విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాలి. అయితే అన్నింటికంటే ముందు అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం చాలా ముఖ్యం. అప్పుడు ఏదైనా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మీరు పొదుపు చేసిన‌ డ‌బ్బు తీయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు.

ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌:

పెట్టుబ‌డుల‌ను ప్రారంభించేముందు మూడు విష‌యాల‌ను అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకోవ‌డం, విశ్లేష‌ణ‌, పెట్టుబ‌డి.

  • మీరు గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే ఇష్టం ఉన్నా లేక‌పోయినా ఏదో ఒక‌రోజు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ఆ విష‌యాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. గ‌డిచిన‌ ఒక్కోరోజు మీ ప‌ద‌వీ విర‌మ‌ణకు ద‌గ్గ‌ర చేస్తుంద‌న్న విష‌యాన్ని తెలుసుకోవాలి. కేవ‌లం ప‌ద‌వీ విర‌మ‌ణ కోస‌మే కాకుండా ఇప్పుడు ఖ‌ర్చులు, అత్య‌వ‌స‌ర నిధి, పిల్ల‌ల పెళ్లి, ఉన్న‌త విద్య వంటి వాటికి ప్ర‌ణాళిక వేసుకోవాలి.
  • విశ్లేష‌ణ‌- మీరు నెల‌కు ఎంత పొదుపు చేయ‌గ‌ల‌రో విశ్లేషించుకొని దానికి త‌గిన ప్ర‌ణాళిక వేసుకొని ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం ప్రాంరంభించాలి.
  • పెట్టుబ‌డుల‌పై వ‌చ్చిన రాబడిపై కూడా వ‌డ్డీ ఆదాయం పెర‌గుతూ వ‌స్తుంది. కాబ‌ట్టి ఎంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అంత మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

పెట్టుబ‌డులుకు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు?

మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి విశ్లేషించుకొని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన త‌ర్వాత ఎందులో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచించుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్లు మేలా లేదా ప్రావిడెంట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాలా అని నిర్ణ‌యం తీసుకోవాలి. ప‌న్ను ఆదా ఉన్న సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెట్టడం మంచిది. దీంతో రాబ‌డి అధికంగా వ‌స్తుంది. చిన్న‌వ‌య‌సులో ఉన్న‌ప్పుడు రిస్క్ ఎక్కువ‌గా ఉండే ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేయ‌డం స‌రైన‌ద‌ని నిపుణులు అభిప్రాయం.

వ‌య‌సు పైబ‌డిన త‌ర్వాత పెరుగుతున్న బాధ్య‌త‌ల‌తో ఎక్కువ రిస్క్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. అందుకే పెట్టుబ‌డుల మొత్తాన్ని వేర్వేరు సాధ‌నాల్లో పెట్ట‌డం మంచిది. ఈక్విటీ, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు (పీపీఎఫ్), నెల‌వారి పెన్ష‌న్ ప‌థ‌కాలు, ట‌ర్మ్ బీమా, స్థిరాస్తి, బంగారం ఇలా అన్ని ర‌కాల పెట్టుబ‌డులను విశ్లేషించి త‌గిన‌ది ఎంచుకోవాలి.

మంచి రాబ‌డుల‌ను, డివిడెండ్ల‌ను అందించ‌గ‌లిగే స్టాక్‌ల‌ను ఆర్థిక నిపుణుల స‌ల‌హాతో తెలుసుకోవాలి. నెల‌వారిగా పెట్టుబ‌డులు చేసే సిప్ విధానంలో పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి. మీకు ఉద్యోగంలో బోన‌స్ ల‌భిస్తే అది కూడా పెట్టుబ‌డులకు ఉప‌యోగించ‌డం మంచిది. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ను ప్రారంబించేందుకు మీకు 40 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు వేచిచూడ‌కుండా ఇప్పుడే ప్రారంభించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని