Petrol price: పెట్రోపై వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలేవి? ఏం చెబుతున్నాయ్‌..?

వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలపై భాజపా ఒత్తిడి తెస్తోంది. పెట్రో ధరలపై మాట్లాడిన విపక్షాలు వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలపై ఆయా రాష్ట్రాలు ఏమంటున్నాయ్‌? ఇప్పటి వరకు ఏయే రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాయి?

Updated : 05 Nov 2021 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో చమురు ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. అదే సమయంలో రాష్ట్రాలు సైతం వ్యాట్‌ తగ్గించుకోవాలన్న కేంద్రం సూచన మేరకు కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. ముఖ్యంగా భాజపా నేరుగా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీయే కూటమి పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. దీంతో వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలపై భాజపా ఒత్తిడి తెస్తోంది. పెట్రో ధరలపై మాట్లాడిన విపక్షాలు వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలపై ఆయా రాష్ట్రాలు ఏమంటున్నాయ్‌? ఇప్పటి వరకు ఏయే రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాయి? ఇంకా తగ్గించాల్సిన రాష్ట్రాలేవో ఇప్పుడు చూద్దాం..

వ్యాట్‌ తగ్గించిన రాష్ట్రాలు..

కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, త్రిపుర, అస్సాం, సిక్కిం, బిహార్‌, మధ్యప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, చండీగఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, లద్దాఖ్, ఒడిశా.. వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను తగ్గించాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 22 తగ్గించిన జాబితాలో ఉన్నాయి. అయితే, ఒక్కో రాష్ట్రంలో ఈ తగ్గింపు ఒక్కో విధంగా ఉంది. పొరుగున ఉన్న కర్ణాటకలో గరిష్ఠంగా వ్యాట్‌ కారణంగా పెట్రోల్‌పై లీటర్‌ 8.62 చొప్పున తగ్గగా.. డీజిల్‌ ధర రూ.9.40 మేర చవకైంది. కేంద్ర తగ్గింపుతో కలుపుకొని అక్కడ పెట్రోల్‌ ధర రూ.100.58కి చేరింది.

తగ్గించని రాష్ట్రాలు..

కాంగ్రెస్‌, ఆ పార్టీ పొత్తుతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలైన రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, తమిళనాడు రాష్ట్రాలు వ్యాట్‌ను ఇప్పటి వరకు తగ్గించలేదు. ఇవి కాకుండా తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఆప్‌ నేతృత్వంలోని దిల్లీ, తృణమూల్‌ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్‌, ఎల్డీఎఫ్‌ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రాలు ఇప్పటి వరకు వ్యాట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీలో లీటర్‌ పెట్రోల్‌ 109.05, హైదరాబాద్‌లో 108.20 ఉంది. దేశ రాజధాని దిల్లీలో 103.97 పలుకుతోంది.

వ్యాట్‌ సవాల్‌..

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన వెంటనే భాజపా పాలిత రాష్ట్రాలు సైతం తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాయి. దీంతో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీకి ఓ అస్త్రం దొరికింది. కేంద్రం ఊరట కల్పించినా తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు వ్యాట్‌ తగ్గించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో సైతం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై అటు తెదేపా, ఇటు జనసేన ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా భాజపా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి వేరే చెప్పనక్కనర్లేదు. దీంతో వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాదన మరోలా ఉంది.

* ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. 2021లో పెట్రోల్‌పై రూ.28, డీజిల్‌పై రూ.26 పెంచి ఇప్పుడు కంటితుడుపు చర్యగా రూ.5, రూ.10 తగ్గించి దీపావళి పండగ చేసుకోమని చెప్పడమేంటని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కేంద్రాన్ని విమర్శించారు. ఇప్పటి వరకు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పూర్వ స్థితికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

* ఇటీవల పశ్చిమబెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ తగలడం వల్లే పెట్రో ధరలు తగ్గించారని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ అన్నారు. గతంలో యూపీఏ హయాంలో ఉన్నట్లుగా ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.30 నుంచి రూ.9లకు తగ్గిస్తే కచ్చితంగా పెట్రో ధరలు దిగివస్తాయన్నారు. పెట్రోల్‌ ధరను రూ.30కు పెంచేసి.. ఓ లాలీపాప్‌లా కేవలం రూ.5 తగ్గించారన్నారని మండిపడ్డారు. రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే యూపీఏ హయాంలో ఉన్నంతగా పెట్రో ధరలు దిగొస్తాయంటూ కామెంట్‌ చేశారు.

* పెట్రోల్‌, డీజిల్‌పై తాము వ్యాట్‌ను తగ్గించేది లేదని కేరళ ఆర్థికశాఖ మంత్రి బాలగోపాల్‌ అన్నారు. రాష్ట్రం గత ఆరు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచలేదని, పైగా ఒకసారి తగ్గించిందని గుర్తుచేశారు. అయినా, కేంద్రం చమురుపై ఎక్సైజ్‌ ట్యాక్స్‌ తగ్గించినప్పుడు ఆ మేర రాష్ట్రంలో వ్యాట్‌ తగ్గుతుందని చెప్పారు. కాబట్టి రాష్ట్రం టాక్స్‌ను మరోసారి టాక్స్‌ను తగ్గించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

* ‘‘పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మేం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. కచ్చితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు సంబంధించి ఉపశమనం కల్పిస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ పరిహారం బకాయిలు రాష్ట్రాలకు సాధ్యమైనంత తొందరగా చెల్లించాలి. దీని తర్వాత మాత్రమే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవడం  సాధ్యమవుతుంది’’ అని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని